శాస్త్రీయ పద్ధతిలో తేనె తీస్తున్న చెంచు యువకుడు
సాక్షి, అచ్చంపేట (మహబూబ్‌నగర్): అడవి బిడ్డలు సేకరించే తేనె అంటే ఎంతో స్వచ్ఛమైనది. ఎలాంటి కల్తీ లేని తేనె పట్టు వారి వద్ద లభిస్తుంది. తరతరాలుగా వారు తేనె సేకరణ కులవత్తిగా సాగుతోంది. ప్రకతి దేవతలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి తేనె సేకరణకు బయలుదేరే చెంచులు.. చెట్లపైకి ఎక్కే దగ్గరి నుంచి తేనె సేకరణ పూర్తి చేసే వరకు ఓ ప్రత్యేకమైన ఆచారాన్ని నేటికీ అవలంబిస్తున్నారు.
తమ ఆచారాన్ని కొనసాగిస్తూనే పుష్కరకాలంగా శాస్త్రీయ పద్ధతుల్లో సైతం తేనెను సేకరిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో చెంచులు అధికంగా ఉన్న నల్లమలలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని ప్రతి ఏడాది జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ మాసంలో మాత్రమే తేనె సేకరణ చేస్తారు. సీజన్ల వారీగా అడవి బిడ్డలు తేమ సేకరణ విధానం, అందుకోసం ఉపయోగించే పద్ధతులు.. తదితర వాటిపై సండే స్పెషల్..
(చదవండి: వివాహేతర సంబంధం: కారు ఆగింది.. కథ అడ్డం తిరిగింది)
తేనె సేకరణ కోసం చెట్టు ఎక్కేందుకు సిద్ధమైన చెంచు వ్యక్తి
నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో చెంచు కుటుంబాలకు తేనె ముఖ్య జీవనాధారం. సీజన్లను బట్టి వివిధ రకాల తేనె సేకరణ చేస్తుంటారు. తొలకరి వర్షాకాలంలో దేవదారి పూతతో వచ్చే తేనె శ్రేష్టమైనది. మామిడి పూతతో వచ్చే తేనె చాలా మధురంగా, వామ తోటల మకరందాన్ని సేకరించిన సమయంలో వచ్చే తేనె కొంత ఘాటుగా ఉంటుంది.
పొద్దుతిరుగుడు, కందిపూల నుంచి తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి. తాటి పూతతో వచ్చే తేనె కొంత అరుదుగా దొరుకుతుంది. చెంచులకు తేనె సేకరణలో అవగాహన పెంపొందించే దిశగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా పదేళ్లుగా కోనేరు స్వచ్ఛంద సంస్థ అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లో చాలామంది చెంచులకు శాస్త్రీయ పద్ధతుల్లో తేనె సేకరణ విధానంపై అవగాహన కల్పించారు. తేనె సేకరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వారికి అవసరమైన కిట్లను అందజేస్తున్నారు. చెంచులు చూడడానికి నీరసంగా ఉన్నప్పటికీ తేనె సేకరణ సమయంలో కొండలు, చెట్లు సునాయసంగా ఎక్కగలుగుతారు.
(చదవండి: రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రోన్ స్వాధీనం)
వేప చెట్టు కొమ్మపై పొదిగి ఉన్న పెద్ద తేనె తుట్ట
తుట్టె నుంచి తేనెను వేరు చేయడం
తుట్టెగా ఉన్న తేనె గడ్డలను పలుచని తెల్ల వస్త్రంలో వేసి జల్లెడలాంటి ఓ ప్రత్యేక పాత్రలో పిండుతారు. తర్వాత వాటిని సీసాలు, డబ్బాల్లో నింపి గిరిజన సహకార సంస్థలో విక్రయించి, వారికి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో చేతులతో పిండి తేనెను తుట్ట నుంచి వేరు చేస్తారు. ఇది చూడడానికి అంతగా బాగో లేనప్పటికీ, తేనెతో పాటు వచ్చే మైనం ఆరోగ్యానికి మంచే చేస్తుంది.
శాస్త్రీయ పద్ధతిలో తెనే సేకరిస్తున్న చెంచులు
శాస్త్రీయ పద్ధతిలో సేకరణ
తేనెటీగలు నశించిపోకుండా చూడటంతో పాటు ఒకే తేనె తుట్ట నుంచి 5–6 సార్లు తేనె సేకరించే విధానాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేయవచ్చు. 12 ఏళ్లుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెంచులతో మమేకమై, వారికి శిక్షణ ఇచ్చి ప్రాక్టికల్‌గా రుజువు చేసి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇప్పటికే ఆయా స్వచ్ఛంద సంస్థలు అందజేసిన కిట్లు ప్రతి గ్రామం, పెంట, గూడెంలలో చెంచులకు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా సీజన్ల వారీగా తేనె సేకరిస్తున్నారు. తేనె సేకరణకు సంబంధించి కిట్టులో బలమైన రెండు తాళ్లు, ఎలిమెంట్, గ్లౌజెస్ బూట్లు, తెల్లనిప్యాంట్, షార్టు, బకెట్, కత్తి ఉంటాయి.
(చదవండి: ఖైదీని పట్టుకోబోతే గంజాయి దొరికింది)
తుట్టలో తేనె ఉన్న భాగం
తేనె సేకరణ ఇలా..
తేనె సేకరణకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా ప్రకతి, వన దేవతలను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అనంతరం తేనె తుట్ట కింది భాగంలో ఆకులు, పుల్లలతో దట్టమైన పొగ పెట్టేవారు. దీంతో తేనె టీగలు ఊపిరాడక కొన్ని చనిపోవడంతో పాటూ మరికొన్ని అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాయి. ఆ తర్వాత తేనెను సునాయసంగా తీస్తారు.
కొండభాగంలో ప్రత్యేక ఆచారం..
కొండభాగంలో ఉన్న తేనె సేకరించే సమయంలో చెంచులు ఆచారం ప్రకారం కొండపై నుంచి జాలువారే తాడును బావమరిదిని మాత్రమే పట్టుకొనిస్తారు. తాడు సహాయంతో తేనె తుట్టె వద్దకు వెళ్లే సమయంలో ఓ ప్రత్యేకమైన శబ్ధం చేస్తూ వెంట తెచ్చుకున్న సుడేకు మంటపెట్టి, ఆ పొగతో తేనెటీగలను తేనె పట్టుకు దూరం చేస్తారు. అనంతరం వెంట తెచ్చుకున్న శిబ్బెంలో (పల్లెం) తేనె ఉన్న భాగాన్ని వేసుకుని కింద ఉన్న వారికి చేరవేస్తారు.
ప్రభుత్వ ప్రోత్సాహం లేదు..
తేనె సేకరణలో ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడం లేదు. రోజురోజుకీ నశించి పోతున్న తేనెటీగలు పెంపకానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. జీసీసీలో కొనుగోలు చేసే ధర కంటే బయటి వ్యక్తులకు అమ్మకుంటే అధిక డబ్బలు వస్తున్నాయి. కల్తీ లేని తేనెను సేకరిస్తున్నాం. అందుకే మంచి డిమాండ్ ఉంటుంది. చాలా మంది తేనె కోసమే మా చెంచుపెంటలకు వస్తున్నారు.
– చిగుర్లపెద్ద లింగయ్య, రాంపూర్ పెంట
ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి..
ప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా(ఇన్సూరెన్స్) సౌకర్యం కల్పించాలి. కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయోగపడుతున్నాయి. వారు ఇచ్చిన క్లిట్లు కూడా పాడైనవి. కొత్త వాటిని ఇవ్వలేదు. ప్రస్తుత సీజన్‌లో తేనె ఎక్కవ సేకరణ జరుపుతాం. అడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది
– బయన్న, మల్లాపూర్ చెంచుపెంట
Comments
Please login to add a commentAdd a comment