Acchampeta
-
తేనె సేకరిస్తున్నప్పడు ఆ తాడును బావమరిది మాత్రమే పట్టుకోవాలి!
సాక్షి, అచ్చంపేట (మహబూబ్‌నగర్): అడవి బిడ్డలు సేకరించే తేనె అంటే ఎంతో స్వచ్ఛమైనది. ఎలాంటి కల్తీ లేని తేనె పట్టు వారి వద్ద లభిస్తుంది. తరతరాలుగా వారు తేనె సేకరణ కులవత్తిగా సాగుతోంది. ప్రకతి దేవతలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి తేనె సేకరణకు బయలుదేరే చెంచులు.. చెట్లపైకి ఎక్కే దగ్గరి నుంచి తేనె సేకరణ పూర్తి చేసే వరకు ఓ ప్రత్యేకమైన ఆచారాన్ని నేటికీ అవలంబిస్తున్నారు. తమ ఆచారాన్ని కొనసాగిస్తూనే పుష్కరకాలంగా శాస్త్రీయ పద్ధతుల్లో సైతం తేనెను సేకరిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో చెంచులు అధికంగా ఉన్న నల్లమలలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని ప్రతి ఏడాది జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ మాసంలో మాత్రమే తేనె సేకరణ చేస్తారు. సీజన్ల వారీగా అడవి బిడ్డలు తేమ సేకరణ విధానం, అందుకోసం ఉపయోగించే పద్ధతులు.. తదితర వాటిపై సండే స్పెషల్.. (చదవండి: వివాహేతర సంబంధం: కారు ఆగింది.. కథ అడ్డం తిరిగింది) తేనె సేకరణ కోసం చెట్టు ఎక్కేందుకు సిద్ధమైన చెంచు వ్యక్తి నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో చెంచు కుటుంబాలకు తేనె ముఖ్య జీవనాధారం. సీజన్లను బట్టి వివిధ రకాల తేనె సేకరణ చేస్తుంటారు. తొలకరి వర్షాకాలంలో దేవదారి పూతతో వచ్చే తేనె శ్రేష్టమైనది. మామిడి పూతతో వచ్చే తేనె చాలా మధురంగా, వామ తోటల మకరందాన్ని సేకరించిన సమయంలో వచ్చే తేనె కొంత ఘాటుగా ఉంటుంది. పొద్దుతిరుగుడు, కందిపూల నుంచి తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి. తాటి పూతతో వచ్చే తేనె కొంత అరుదుగా దొరుకుతుంది. చెంచులకు తేనె సేకరణలో అవగాహన పెంపొందించే దిశగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా పదేళ్లుగా కోనేరు స్వచ్ఛంద సంస్థ అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లో చాలామంది చెంచులకు శాస్త్రీయ పద్ధతుల్లో తేనె సేకరణ విధానంపై అవగాహన కల్పించారు. తేనె సేకరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వారికి అవసరమైన కిట్లను అందజేస్తున్నారు. చెంచులు చూడడానికి నీరసంగా ఉన్నప్పటికీ తేనె సేకరణ సమయంలో కొండలు, చెట్లు సునాయసంగా ఎక్కగలుగుతారు. (చదవండి: రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రోన్ స్వాధీనం) వేప చెట్టు కొమ్మపై పొదిగి ఉన్న పెద్ద తేనె తుట్ట తుట్టె నుంచి తేనెను వేరు చేయడం తుట్టెగా ఉన్న తేనె గడ్డలను పలుచని తెల్ల వస్త్రంలో వేసి జల్లెడలాంటి ఓ ప్రత్యేక పాత్రలో పిండుతారు. తర్వాత వాటిని సీసాలు, డబ్బాల్లో నింపి గిరిజన సహకార సంస్థలో విక్రయించి, వారికి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో చేతులతో పిండి తేనెను తుట్ట నుంచి వేరు చేస్తారు. ఇది చూడడానికి అంతగా బాగో లేనప్పటికీ, తేనెతో పాటు వచ్చే మైనం ఆరోగ్యానికి మంచే చేస్తుంది. శాస్త్రీయ పద్ధతిలో తెనే సేకరిస్తున్న చెంచులు శాస్త్రీయ పద్ధతిలో సేకరణ తేనెటీగలు నశించిపోకుండా చూడటంతో పాటు ఒకే తేనె తుట్ట నుంచి 5–6 సార్లు తేనె సేకరించే విధానాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేయవచ్చు. 12 ఏళ్లుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెంచులతో మమేకమై, వారికి శిక్షణ ఇచ్చి ప్రాక్టికల్‌గా రుజువు చేసి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇప్పటికే ఆయా స్వచ్ఛంద సంస్థలు అందజేసిన కిట్లు ప్రతి గ్రామం, పెంట, గూడెంలలో చెంచులకు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా సీజన్ల వారీగా తేనె సేకరిస్తున్నారు. తేనె సేకరణకు సంబంధించి కిట్టులో బలమైన రెండు తాళ్లు, ఎలిమెంట్, గ్లౌజెస్ బూట్లు, తెల్లనిప్యాంట్, షార్టు, బకెట్, కత్తి ఉంటాయి. (చదవండి: ఖైదీని పట్టుకోబోతే గంజాయి దొరికింది) తుట్టలో తేనె ఉన్న భాగం తేనె సేకరణ ఇలా.. తేనె సేకరణకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా ప్రకతి, వన దేవతలను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అనంతరం తేనె తుట్ట కింది భాగంలో ఆకులు, పుల్లలతో దట్టమైన పొగ పెట్టేవారు. దీంతో తేనె టీగలు ఊపిరాడక కొన్ని చనిపోవడంతో పాటూ మరికొన్ని అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాయి. ఆ తర్వాత తేనెను సునాయసంగా తీస్తారు. కొండభాగంలో ప్రత్యేక ఆచారం.. కొండభాగంలో ఉన్న తేనె సేకరించే సమయంలో చెంచులు ఆచారం ప్రకారం కొండపై నుంచి జాలువారే తాడును బావమరిదిని మాత్రమే పట్టుకొనిస్తారు. తాడు సహాయంతో తేనె తుట్టె వద్దకు వెళ్లే సమయంలో ఓ ప్రత్యేకమైన శబ్ధం చేస్తూ వెంట తెచ్చుకున్న సుడేకు మంటపెట్టి, ఆ పొగతో తేనెటీగలను తేనె పట్టుకు దూరం చేస్తారు. అనంతరం వెంట తెచ్చుకున్న శిబ్బెంలో (పల్లెం) తేనె ఉన్న భాగాన్ని వేసుకుని కింద ఉన్న వారికి చేరవేస్తారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేదు.. తేనె సేకరణలో ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడం లేదు. రోజురోజుకీ నశించి పోతున్న తేనెటీగలు పెంపకానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. జీసీసీలో కొనుగోలు చేసే ధర కంటే బయటి వ్యక్తులకు అమ్మకుంటే అధిక డబ్బలు వస్తున్నాయి. కల్తీ లేని తేనెను సేకరిస్తున్నాం. అందుకే మంచి డిమాండ్ ఉంటుంది. చాలా మంది తేనె కోసమే మా చెంచుపెంటలకు వస్తున్నారు. – చిగుర్లపెద్ద లింగయ్య, రాంపూర్ పెంట ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.. ప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా(ఇన్సూరెన్స్) సౌకర్యం కల్పించాలి. కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయోగపడుతున్నాయి. వారు ఇచ్చిన క్లిట్లు కూడా పాడైనవి. కొత్త వాటిని ఇవ్వలేదు. ప్రస్తుత సీజన్లో తేనె ఎక్కవ సేకరణ జరుపుతాం. అడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది – బయన్న, మల్లాపూర్ చెంచుపెంట -
హరహర మహాదేవ.. శంభో శంకర
సాక్షి, అచ్చంపేట : హరహర మహాదేవ.. శంభో శంకర.. ఓం నమఃశివాయ.. శివాయ నమ ఓం.. అంటూ ఒంటిపూట భోజనం.. సాయంత్రం అల్పాహారం.. అందుబాటులోని శివాలయంలో పూజలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు.. ధ్యానముద్రలతో ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతున్నారు శివదీక్షా స్వాములు. పంచాక్షరి నామజపం ఆ మల్లికార్జునస్వామి శివదీక్షను స్వీకరిస్తే తమకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని, కుటుంబమంతా ఆయురోగ్యాలతో తులతూగుతారని భావిస్తుంటారు. రవాణా సౌకర్యాలు ఉన్నా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో శివనామ సంకీర్తనలు చేసుకుంటూ కాలినడకన కొండలు, గుట్టలు, బండరాళ్లు, ముళ్లకంపల అడ్డు తొలగించుకుంటూ శ్రీశైలం చేరుకుంటారు. ఈ ప్రయాణం శరీరానికి ఎంతో బాధ కలిగించినప్పటికీ మనస్సు మాత్రం ఆధ్యాతి్మకానందంతో పులకిస్తుందని, అది ప్రత్యక్షంగా అనుభవిస్తే తెలుస్తుందని శివస్వాములు పేర్కొంటున్నారు. వందల కి.మీ.ల దూరం నుంచి మండుటెండలను సైతం లెక్క చేయకుండా.. పుడమి తల్లి వేడికి పాదాలు బొబ్బలెక్కుతున్నా, మదిలో ప్రతిధ్వనిస్తున్న శివనామస్మరణతో కైలాస ద్వారం చేరుతున్నామని పేర్కొంటున్నారు. అక్కడి నుంచి తమ ప్రయాణం సాఫీగా జరుగుతుందని, ఇక శ్రీశైలం చేరినట్లేనని భావిస్తామని చెబుతున్నారు. ఆదుకుంటున్న అన్నదాన సత్రాలు శ్రీశైలంలో 50కిపైగా నిత్యాన్నదాన సత్రాలు ఉన్నాయి. అన్నదాన సత్రాల్లో అన్నపూర్ణాదేవికి అర్చనలు చేస్తున్నారు. వాసవీ సత్రం, కొండవీటి రెడ్ల సత్రం, మున్నూరుకాపు సత్రం, వెలమ సత్రం, విశ్వబ్రాహ్మణ సత్రం, అన్నదాన సత్రం, కమ్మసత్రం, కాకతీయ సత్రం, కంబం సత్రం, యాదవ సత్రం, శ్రీకష్ణదేవరాయ సత్రం, ఆరెకటిక, మేరుసంఘం, వెలమ, వందేళ్లనాటి కరివెన సత్రాలతోపాటు మరిన్ని సత్రాలు నిరాటకంగా నిత్యాన్నదానం చేయడంలో ముందున్నాయి. ఇక ఆశ్రమాలు, మఠాల సంగతి చెప్పక్కర్లలేదు. శివరాత్రి బహ్మోత్సవాల సందర్భంగా అటకేశ్వర సమీపంలోని నాలుగు ఆశ్రమాలు వేలాది మంది భక్తులకు అన్నదానం చేస్తున్నాయి. శ్రీశైలంలో ఒకరికి అన్నదానం చేస్తే కాశీలో లక్షమందికి అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయనే నేపథ్యంలో అన్న వితరణకు తామూ భాగస్వాములం అవుతామని వేలాది మంది విశేషంగా అన్నసత్రాలకు విరాళాలు సమరి్పస్తున్నారు. శ్రీశైలంలో అన్నదాన ప్రభంజనంతో హర్షిత రేఖలు వ్యక్తం చేస్తూ ‘అన్నదాతా.. సుఖీభవ’ అంటూ దీవిస్తున్నారు. అటవీశాఖ నిబంధనలతో.. పాదయాత్రతో శ్రీశైల మహాక్షేత్రం వెళ్లే స్వాములకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొచ్చి షామియానాలు, ఉచిత భోజనం, మంచి నీటి సౌకర్యాలతోపాటు అల్పాహారం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పాదయాత్రతో వచ్చిన శివస్వాములకు నల్లమల దారిలోని మన్ననూర్, ఫర్హాబాద్, వట్టువర్లపల్లి, రాసమల్లబావి వద్ద గత పుష్కరకాలంగా దాతలు సేవలందిస్తున్నారు. కాలినడకన వెళ్లే శివస్వాముల ఆకలి తీర్చడంలో దాతలు ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాలు చురుకైన పాత్ర పోషిస్తుంది. అచ్చంపేట– శ్రీశైలం నల్లమల అభయారణ మార్గంలో ప్రతిఏటా 20కిపైగా అన్నదాన కేంద్రాలు వెలిశాయి. మన్ననూర్ తర్వాత వటువర్లపల్లి వరకు ఎక్కడ కూడా వీరికి తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకదు. వటువర్లపల్లి తర్వాత మళ్లీ దోమలపెంట వరకు ఇదే పరిస్థితి. అటవీశాఖ వారు అటవీప్రాంతంలో తాగునీటి వసతి కలి్పంచాల్సి ఉన్నా ఇంత వరకు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. గతంలో కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాం కింద అటవీశాఖ వారు మంచినీటి సరఫరా, అల్పహార కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. కానీ గత నాలుగేళ్లుగా ఈ పద్ధతికి అటవీశాఖ స్వస్తి చెప్పి వీరి పేరిట డబ్బు ఖర్చు పెడుతున్నట్లు రికార్డులు చూపుతున్నారు. పాదయాత్ర చేసే స్వామలకు జంతువుల నుంచి ప్రాణహాని కలగకుండా అటవీ మార్గంలో సిబ్బందితో టీం ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై స్వాములకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక బస్సు సర్వీసులు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు, శివరాత్రిని పురస్కరించుకొన్ని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ ఆర్టీసీ డిపోల నుంచి సోమవారం నుంచి 22వ తేదీ వరకు ఆరురోజులపాటు శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. శ్రీశైలం కాలినడకన వెళ్లిన శివస్వాములు తిరుగు ప్రయాణం కోసం జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. గద్వాల డిపో నుంచి సోమవారం 35 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపిస్తున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఐదురోజులపాటు 390 బస్సులను శ్రీశైలానికి నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లకుండా ఆర్టీసీ బస్సులో సురక్షిత ప్రయాణం చేయాలని అధికారులు కోరుతున్నారు. అచ్చంపేట డిపో నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని డీఎం మనోహర్ తెలిపారు. -
గుప్తనిధుల కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యారు
సాక్షి, అచ్చంపేట : గుప్తనిధుల కోసం వచ్చిన దుండగులను స్థానిక ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ రామన్‌గౌడ్, స్థానికుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బద్వేల్ నియోజకవర్గం రాజేంద్రనగర్‌కు చెందిన మామిడి వెంకటేష్‌సాగర్, నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడిపల్లికి చెందిన ముత్యాల లక్ష్మారెడ్డి, పెద్దముద్దునూరు మండల కేంద్రానికి చెందిన వేనేపల్లి శ్యాంసుందర్‌రావు, అతని కుమారుడు అక్షయ్‌రావు, వంగూరు మండలం జాజాలకు చెందిన సురభి హరిప్రసాదరావులు శనివారం వేనేపల్లి సాహితీ పేరు మీద ఉన్న ఓ కారులో పదర మండలం రాయలగండి లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం వద్దకు వచ్చారు. ఆలయ సమీపంలో తమ వెంట తెచ్చుకున్న పరికరాలతో గుప్తనిధుల కోసం అన్వేషిస్తుండగా స్థానికులు నల్లమల యురేనియం వ్యతిరేక జేఏసీ కమిటీకి సమాచారం ఇచ్చారు. యురేనియం తవ్వకాల కోసమే వచ్చారు అనుకొని వెంబడించగా కారులో పారిపోతుండగా.. కుమ్మరోనిపల్లి, అమ్రాబాద్‌లో స్థానిక ప్రజలు అడ్డగించినా కారు ఆపకుండా పరారయ్యారు. ఈ క్రమంలోనే అమ్రాబాద్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్ననూర్‌లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఉండగా ఎస్సీకాలనీ మీదుగా డ్రైవర్ కారును మరలించాడు. అయినా ప్రజలు అడ్డగించి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రామన్‌గౌడ్ పోలీసులతో వచ్చి వారిని, కారును అదుపులోకి తీసుకున్నారు. కారులో గుప్తనిధుల అన్వేషణకు తెచ్చుకున్న డిటోనెక్టర్, పౌడర్, వివిధ పరికరాలు ఉండటంతో పోలీస్టేషన్‌కు తరలించారు. -
ప్రాణం తీసిన సరదా పందెం
సాక్షి, గుంటూరు(అచ్చంపేట) : ఇద్దరు స్నేహితులు సరదాగా వేసుకున్న పందెం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన మండలంలోని రుద్రవరం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వణుగూరి వెంకటరెడ్డి (56), నల్లపాటి నాగేశ్వరరావు సరదాగా గ్రామం చివరలోని ఆర్ అండ్ బీ రోడ్డు పక్కన ఉన్న యల్లమ్మకుంటలో ఒక వైపు నుంచి రెండో వైపునకు ఈదుకుంటూ వెళ్లాలని రూ.5 వేలు పందెం కాసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కుంటలో వర్షపునీరు చేరి గతంలో కుంటలోతు పెరిగింది. ఇద్దరు ఒకవైపు నుంచి ఈత ప్రారంభించారు. నాగేశ్వరరావు రెండో వైపునకు చేరుకున్నారు. వెంకటరెడ్డి మరో నాలుగు అడుగుల దూరంలో ఉన్న గమ్యానికి చేరుకుంటాడనగా ఊపిరి ఆగిపోయి నీళ్లలో మునిగిపోయాడు. కొద్దిసేపటికి గ్రామస్తులు వెంకటరెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య వెంకట్రావమ్మ, కుమార్తె ఉన్నారు. సరదాకా కాసుకున్న పందెం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. -
మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తం
సాక్షి, ఉప్పునుంతల: మండలంలో మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటివరకు వాటర్ ట్యాంకుల పనులు, పైప్లైన్ల పనులు పూర్తికాలేదు. కొన్ని గ్రామాల్లో ట్యాంక్‌ల నిర్మాణం పనులు నేటికీ ప్రారంభించలేదు. మరికొన్ని గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణం అర్ధాంతరంగా నిలిపేశారు. పనులు పెండింగ్‌లో ఉండడంతో కొన్ని గ్రామాలకు ఇప్పటివరకు నీటి సరఫరా కావడం లేదు. పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. భగీరథలో చేపడుతున్న వాటర్ ట్యాంకులు, ఇతర పైప్లైన్ల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాణ్యతతో పనులు త్వరితగతిన పూర్తిచేయించాలని వారు కోరుతున్నారు. మండలంలో సగం వాటర్ ట్యాక్‌లు పూర్తి.. మండలంలోని 27 పంచాయతీల పరిధిలో ఉన్న 38 ఆవాస గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంలో 31 వాటర్ ట్యాంకులు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటివరకు 14 వాటర్ ట్యాంకులు పూర్తయ్యాయి. 17 వాటరు ట్యాంకుల పనులు పూర్తికాలేదు. మూన్య తండాలో ఇప్పటివరకు ట్యాంక్ పనులు ప్రారంభించలేదు. బిల్లులు రాలేదంటూ సంబంధిత కాంట్రాక్టర్ రంగంపేట తదితర గ్రామాల్లో ట్యాంకు పనులు బెస్మెంట్ వరకు మాత్రమే నిలిపేశారు. ఇంటర్‌గ్రిడ్ పనుల్లో జాప్యం.. మండలంలో ఇంటర్‌గ్రిడ్ పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నారు. చిన్న చిన్న గ్రామాలు, తండాల్లోని కాలనీల్లో ఇళ్లలోకి కనెక్షన్లు ఇవ్వడానికి పైప్లైన్లు వేసి ఉంచినా నల్లాలు అమర్చలేదు. కొన్ని గ్రామాలకు మెయిన్ గ్రిడ్ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో నీళ్లు రావడంలేదు. రంగంపేట, మూన్య తాండ, కొత్తరాంనగర్ తదితర గ్రామాల్లో ట్యాంకులు, ఇంటర్‌గ్రిడ్ పనులు పూర్తిచేయకపోవడంతో భగీరథ నీళ్లు అందడంలేదు. గుట్టమీది తండాలో అసంపూర్తిగా పైపులైన్ పనులు , ఉప్పునుంతలలో పూర్తికాని ఇంటర్ గ్రిడ్ పైపులైన్ -
ఆడ పిల్ల వద్దమ్మా..
బల్మూర్ (అచ్చంపేట): మగ సంతానం కోసం ఆ తల్లిదండ్రులు నలుగురు పిల్లలను కన్నారు.. అయితే ఐదో కాన్పులోనూ ఆడ శిశువే జన్మించడంతో వదిలించుకోవాలనుకున్నారు. ఈ మేరకు కన్న పేగు బంధాన్ని కూడా కాదనుకుని అంగన్వాడీ టీచర్‌కు సమాచారమిచ్చారు. అంగన్వాడీ సిబ్బంది ఎంత నచ్చచెప్పినా ఆ దంపతులు వినకపోవడంతో చివరకు శిశువును శిశు సంరక్షణ గృహానికి చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని బాణాల గ్రామానికి చెందిన రామావత్ దస్లీ–నిరంజన్ దంపతులకు ఇది వరకే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఇందులో ఓ కూతురు అనారోగ్యంతో కన్నుమూసింది. ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చిన దస్లీ శనివారం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మళ్లీ ఆడ శిశువుకే జన్మనిచ్చింది. దీంతో ఇప్పటికే ఉన్న ముగ్గురు ఆడ పిల్లలకు తోడు ఈ శిశువు భారం మోయలేమని గ్రామ అంగన్వాడీ టీచర్ అనితకు సమాచారం ఇచ్చారు. దీంతో సూపర్వైజర్ విజయలక్ష్మి, ఇతర సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చినా వారు వినలేదు. దీంతో శిశువును మహబూబ్‌నగర్‌లోని శిశు సంరక్షణ గృహం అధికారులకు అప్పగించారు. -
కూలిన కాంగ్రెస్ వేదిక నాయకులకు తప్పిన ప్రమాదం
-
కూలిన స్టేజీ.. కాంగ్రెస్ నాయకులకు తప్పిన ప్రమాదం
సాక్షి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభావేదికపై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కార్యకర్తలకు అభివాదం చేయడానికి ముందుకు వచ్చారు. అదే సమయంలో కార్యకర్తలు ఉత్సాహంతో విజయశాంతికి షేక్‌హ్యాండ్ ఇవ్వాలని ముందుకు రావడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రమాద సమయంలో సభా వేదికపై విజయశాంతితోపాటూ, కాంగ్రెస్‌పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మరికొందరు నేతలు ఉన్నారు. షెడ్యుల్‌లో భాగంగా కాంగ్రెస్ నాయకులు కొల్లాపూర్ బహిరంగ సభ ముగించుకొని అచ్చంపేటలో సభకు హాజరయ్యారు. ప్రమాదం తర్వాత కాంగ్రెస్ నాయకులు ప్రచార రథంపై నిలబడి కార్యకర్తలకు అభివాదం చేసి తిరిగి హెలీక్యాప్టర్‌లో వెళ్లిపోయారు. -
రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్లాస్టిక్ నిషేధం
సాక్షి, మన్ననూర్ (అచ్చంపేట) : అమ్రాబాద్ పులుల రక్షిత ప్రాంతం (కోర్ ఏరియా)లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నామని వాటి స్థానంలో పేపర్, బట్ట సంచులను అందుబాటులో ఉంచుతున్నట్లు ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం అటవీశాఖ ఈసీ సెంటర్ వద్ద డబ్లూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. మానవ మనుగడతో పాటు జీవరాశులకు ముప్పు కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వన్యప్రాణులకు అమ్రాబాద్ అభయారణ్యం దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ క్రమంలో పర్యాటకులు, అటవీ సమీప గ్రామాల ప్రజలు ప్లాస్టిక్‌ను ఉపయోగించడం, పారబోయడంతో వాటిని తింటున్న వన్యప్రాణులు మృత్యవాతపడుతున్నాయని అన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ డైరెక్టర్ ఫరీదా టంపల్ మాట్లాడుతూ శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి వన్యప్రాణులను కాపాడాలన్నారు. ఈ ప్రాంతంలో పేవర్ కవర్ల తయారీ కోసం కుటీర పరిశ్రమను మరో నెల రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పేపర్ కవర్ల తయారీ కోసం చెంచు మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. అడవులను, జంతుజాలాన్ని రక్షించుకోవాలని కళాకారుల ఇచ్చిన ప్రదర్శన, ఆట పాటలు ఆకట్టుకున్నాయి. యాత్రికులకు పేపర్ కవర్లు అందజేత అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద డబ్ల్యూడబ్ల్యూఎఫ్, శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే యాత్రికులకు పేపర్ కవర్లు అందజేశారు. టోల్గేట్ రూ.20లకు అదనంగా రూ.5 వసూలు చేసి కవర్ అందిస్తున్నారు. దీంతోపాటు మరో రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు ఎలాంటి చెత్త, వ్యర్థాలు ఉన్నా రోడ్డు పక్కన వేయకూడదు. కవర్లో వేసి దోమలపెంట చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బందికి కవర్ అందించాలి. వారు రూ.25 తిరిగి ఇస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పర్యావరణ రోజు సందర్భంగా అమ్రాబాద్, మన్ననూర్ రేంజ్ పరిధిలోని ఆయా పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు డైరెక్టర్ శ్రీనివాస్, డీఎఫ్ఓ జోజీ,ఎఫ్ఆర్ఓలు ప్రభాకర్, శ్రీదేవి ఎఫ్ఎస్ఓ రామాంజనేయులు సిబ్బంది బాబలి, వెంకటేశ్వర్లు, కనకయ్య, కళాకారులు మాడ్గుల నర్సింహ, లింగస్వామి, బీముడు, ఆయా చెంచుపెంటల మహిళలు పాల్గొన్నారు. -
నేడు పోలింగ్
ఉదయం 7 నుంచి 5 గంటల వరకు పోలింగ్ భారీగా భద్రతా సిబ్బందినియామకం 20 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌తోపాటు వీడియో చిత్రీకరణ ‘అచ్చంపేట నగర చాయతీ’కి సర్వం సిద్ధం ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బహిరంగ ప్రచారం పూర్తయినప్పటికీ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి చివరి నిమిషం వరకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నాగర్‌కర్నూల్ ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పూర్తిచేశారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే అచ్చంపేట పట్టణంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అందరిని పంపించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. 18,614 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1085 ఎస్టీ, 2792 ఎస్సీ, 8755 బీసీ, 5982 జనరల్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 20 వార్డులకు 17వార్డులు రిజర్వేషన్లు కాగా 3వార్డులు జనరల్‌కు కేటాయించారు. భారీ బందోబస్తు ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. నగరపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా స్థానిక పోలీసులను భారీగా వినియోగించుకుంటున్నారు. జిల్లా ఆడిషనల్ ఎస్పీతో పాటు మరో ఆడిషల్ ఎస్పీ, 6గురు సీఐలు,30 మంది ఎస్ఐలు, 20 మంది ఏఎస్ఐలు,300ల మంది పీసీలు, హోంగార్డులు ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. రెండు స్పెషల్ పార్టీ టీంలు, రెండు వాహన తనిఖీ బందాలు, 6తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాగర్‌కర్నూల్, వనపర్తి డీఎస్పీలు ప్రవీణ్‌కుమార్, జోగుల చెన్నయ్యలు ఇక్కడే మకాం పెట్టి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 200మంది ఎన్నికల సిబ్బంది నియామకం 20 వార్డుల ఓటర్లుకు 20 పోలింగ్ కేంద్రాల్లో 200మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. పీఓలు 25, ఏపీలు 25, ఓపీఓలు 65 మంది, 4రూట్లలో నలుగురు జోనల్ అధికారులు, 8 మంది మైక్రో ఆబ్జర్వర్లను నియమించారు. మరో 70 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. 20 వార్డుల్లో పది సమస్యాత్మకంగా, అతి సమస్యాత్మకమైనవిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సజావుగా జరిగేలా అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల అధికారి సాబేర్ అలీ తెలిపారు. 20 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్‌తోపాటు వీడియో కవరేజ్ ద్వారా పర్యవే క్షించనున్నారు. ఇవీ రెండింటితోపాటు కేంద్రాల్లో సూక్ష్మపరిశీలకులను నియమించారు. అవసరాన్ని బట్టి అదనంగా వెబ్‌కాస్టింగ్ చేసేందుకు వీలుగా సామగ్రి, సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. అచ్చంపేటలో ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా ప్రత్యేకంగా డీఎస్పీలను, సీఐలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 16గుర్తింపు కార్డుల్ల ఏదో ఒకటి తప్పని సరి.. పట్టణంలో ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశామ ని, ఎవరికైన అందని పక్షంలో 16 గుర్తింపు కార్డులో ఏదో ఒకటి తప్పని సరిగా పో లింగ్ కేంద్రాలకు తీసుకురావాలని ఎన్నిక ల అధికారి సాబేర్ అలీ, సహాయధికారి జ యంత్కుమార్రెడ్డి తెలిపారు. పోలింగ్ జ రుగుతున్నందున పట్టణానికి లేబర్ హాలీడే ప్రకటించామని, ఎవరు కూడా దుకాణాలు తెరిచి ఉంచవద్దని చెప్పారు. పోలింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకమే.. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి అటు ఐక్యకూటమిగా బరిలోకి దిగిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఆయా పార్టీలకు చెందిన జిల్లా, రాష్ట్ర నేతలు వారం రోజులుగా అచ్చంపేటలోనే మకాం పెట్టి విజయానికి కావాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నం చేస్తూ మద్యం, డబ్బును ఎరగా వేస్తున్నారు. -
వైఎస్ ఇక లేరని..
అచ్చంపేట/కొల్లాపూర్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణాన్ని తట్టుకోలేక అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ముగ్గురు మృతిచెందారు. బాధిత కుటుంబాలను మంగళవారం షర్మిల పరామర్శించనున్నారు. అమ్రాబాద్‌కు చెందిన పర్వతనేని(బోగం) రంగయ్య వైఎస్ అభిమాని. 2009 సెప్టెంబర్8న వైఎస్ఆర్ సంతాపసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆందోళనతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. లేపిచూసే సరికి అప్పటికే ప్రాణాలు విడిచాడు. రంగయ్యకు భార్య అనసూయమ్మతో పాటు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ మహానేత కూతురు షర్మిల మమ్మల్ని పరామర్శించేందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని అనసూయమ్మ అంటున్నారు. కోడేరు మండలం ఎత్తం గ్రామానికి చెందిన పుట్టపాగ నర్సింహా కూలీ పను లు చేసుకుంటూ హైదారాబాద్‌లో జీవనం సాగించేవాడు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణవార్త విని నర్సింహా జీర్ణించుకోలేకపోయాడు. ఆ రోజం తా భోజనం కూడా చేయలేదు. సెప్టెంబర్ 3న టీవీలో వైఎస్ మరణవార్తను చూస్తూ గుండెపోటుతో మరణించాడు. అతని భార్య శంకరమ్మ, కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం వీరు కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొల్లాపూర్ పట్టణంలోని పాతబస్టాండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కటిక రాంచందర్ వైఎస్‌కు వీరాభిమాని. వైఎస్ఆర్ మరణవార్త తెలిసి కుంగిపోయాడు. రూ.2కు కిలోబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వంటి పథకాలు ఇక ఆగిపోతాయని తన సన్నిహితులతో చెబుతుండేవాడు. 2009 సెప్టెంబర్ 21న టీవీల్లో వైఎస్ఆర్ మరణవార్తలు చూస్తూ గుండెపోటుతో మరణించారు. అతనికి భార్య శంకరబాయి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇంటిపెద్దదిక్కు చనిపోవడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది.