సాక్షి, అచ్చంపేట : గుప్తనిధుల కోసం వచ్చిన దుండగులను స్థానిక ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామన్‌గౌడ్, స్థానికుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బద్వేల్ నియోజకవర్గం రాజేంద్రనగర్‌కు చెందిన మామిడి వెంకటేష్‌సాగర్, నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడిపల్లికి చెందిన ముత్యాల లక్ష్మారెడ్డి, పెద్దముద్దునూరు మండల కేంద్రానికి చెందిన వేనేపల్లి శ్యాంసుందర్‌రావు, అతని కుమారుడు అక్షయ్‌రావు, వంగూరు మండలం జాజాలకు చెందిన సురభి హరిప్రసాదరావులు శనివారం వేనేపల్లి సాహితీ పేరు మీద ఉన్న ఓ కారులో పదర మండలం రాయలగండి లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం వద్దకు వచ్చారు.
ఆలయ సమీపంలో తమ వెంట తెచ్చుకున్న పరికరాలతో గుప్తనిధుల కోసం అన్వేషిస్తుండగా స్థానికులు నల్లమల యురేనియం వ్యతిరేక జేఏసీ కమిటీకి సమాచారం ఇచ్చారు. యురేనియం తవ్వకాల కోసమే వచ్చారు అనుకొని వెంబడించగా కారులో పారిపోతుండగా.. కుమ్మరోనిపల్లి, అమ్రాబాద్‌లో స్థానిక ప్రజలు అడ్డగించినా కారు ఆపకుండా పరారయ్యారు. ఈ క్రమంలోనే అమ్రాబాద్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్ననూర్‌లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఉండగా ఎస్సీకాలనీ మీదుగా డ్రైవర్ కారును మరలించాడు. అయినా ప్రజలు అడ్డగించి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రామన్‌గౌడ్ పోలీసులతో వచ్చి వారిని, కారును అదుపులోకి తీసుకున్నారు. కారులో గుప్తనిధుల అన్వేషణకు తెచ్చుకున్న డిటోనెక్టర్, పౌడర్, వివిధ పరికరాలు ఉండటంతో పోలీస్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment