రంగంపేటలో అసంపూర్తిగా వాటర్ ట్యాంకు నిర్మాణం
సాక్షి, ఉప్పునుంతల: మండలంలో మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటివరకు వాటర్ ట్యాంకుల పనులు, పైప్‌లైన్‌ల పనులు పూర్తికాలేదు. కొన్ని గ్రామాల్లో ట్యాంక్‌ల నిర్మాణం పనులు నేటికీ ప్రారంభించలేదు. మరికొన్ని గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణం అర్ధాంతరంగా నిలిపేశారు. పనులు పెండింగ్‌లో ఉండడంతో కొన్ని గ్రామాలకు ఇప్పటివరకు నీటి సరఫరా కావడం లేదు. పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
భగీరథలో చేపడుతున్న వాటర్ ట్యాంకులు, ఇతర పైప్‌లైన్ల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాణ్యతతో పనులు త్వరితగతిన పూర్తిచేయించాలని వారు కోరుతున్నారు.
మండలంలో సగం వాటర్ ట్యాక్‌లు పూర్తి..
మండలంలోని 27 పంచాయతీల పరిధిలో ఉన్న 38 ఆవాస గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంలో 31 వాటర్ ట్యాంకులు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటివరకు 14 వాటర్ ట్యాంకులు పూర్తయ్యాయి. 17 వాటరు ట్యాంకుల పనులు పూర్తికాలేదు. మూన్య తండాలో ఇప్పటివరకు ట్యాంక్ పనులు ప్రారంభించలేదు. బిల్లులు రాలేదంటూ సంబంధిత కాంట్రాక్టర్ రంగంపేట తదితర గ్రామాల్లో ట్యాంకు పనులు బెస్‌మెంట్ వరకు మాత్రమే నిలిపేశారు.
ఇంటర్‌గ్రిడ్ పనుల్లో జాప్యం..
మండలంలో ఇంటర్‌గ్రిడ్ పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నారు. చిన్న చిన్న గ్రామాలు, తండాల్లోని కాలనీల్లో ఇళ్లలోకి కనెక్షన్లు ఇవ్వడానికి పైప్‌లైన్లు వేసి ఉంచినా నల్లాలు అమర్చలేదు. కొన్ని గ్రామాలకు మెయిన్ గ్రిడ్ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో నీళ్లు రావడంలేదు. రంగంపేట, మూన్య తాండ, కొత్తరాంనగర్ తదితర గ్రామాల్లో ట్యాంకులు, ఇంటర్‌గ్రిడ్ పనులు పూర్తిచేయకపోవడంతో భగీరథ నీళ్లు అందడంలేదు.
గుట్టమీది తండాలో అసంపూర్తిగా పైపులైన్ పనులు , ఉప్పునుంతలలో పూర్తికాని ఇంటర్ గ్రిడ్ పైపులైన్
Comments
Please login to add a commentAdd a comment