సాక్షి, అచ్చంపేట : హరహర మహాదేవ.. శంభో శంకర.. ఓం నమఃశివాయ.. శివాయ నమ ఓం.. అంటూ ఒంటిపూట భోజనం.. సాయంత్రం అల్పాహారం.. అందుబాటులోని శివాలయంలో పూజలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు.. ధ్యానముద్రలతో ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతున్నారు శివదీక్షా స్వాములు. పంచాక్షరి నామజపం ఆ మల్లికార్జునస్వామి శివదీక్షను స్వీకరిస్తే తమకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని, కుటుంబమంతా ఆయురోగ్యాలతో తులతూగుతారని భావిస్తుంటారు. రవాణా సౌకర్యాలు ఉన్నా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో శివనామ సంకీర్తనలు చేసుకుంటూ కాలినడకన కొండలు, గుట్టలు, బండరాళ్లు, ముళ్లకంపల అడ్డు తొలగించుకుంటూ శ్రీశైలం చేరుకుంటారు. ఈ ప్రయాణం శరీరానికి ఎంతో బాధ కలిగించినప్పటికీ మనస్సు మాత్రం ఆధ్యాతి్మకానందంతో పులకిస్తుందని, అది ప్రత్యక్షంగా అనుభవిస్తే తెలుస్తుందని శివస్వాములు పేర్కొంటున్నారు. వందల కి.మీ.ల దూరం నుంచి మండుటెండలను సైతం లెక్క చేయకుండా.. పుడమి తల్లి వేడికి పాదాలు బొబ్బలెక్కుతున్నా, మదిలో ప్రతిధ్వనిస్తున్న శివనామస్మరణతో కైలాస ద్వారం చేరుతున్నామని పేర్కొంటున్నారు. అక్కడి నుంచి తమ ప్రయాణం సాఫీగా జరుగుతుందని, ఇక శ్రీశైలం చేరినట్లేనని భావిస్తామని చెబుతున్నారు.
ఆదుకుంటున్న అన్నదాన సత్రాలు
శ్రీశైలంలో 50కిపైగా నిత్యాన్నదాన సత్రాలు ఉన్నాయి. అన్నదాన సత్రాల్లో అన్నపూర్ణాదేవికి అర్చనలు చేస్తున్నారు. వాసవీ సత్రం, కొండవీటి రెడ్ల సత్రం, మున్నూరుకాపు సత్రం, వెలమ సత్రం, విశ్వబ్రాహ్మణ సత్రం, అన్నదాన సత్రం, కమ్మసత్రం, కాకతీయ సత్రం, కంబం సత్రం, యాదవ సత్రం, శ్రీకష్ణదేవరాయ సత్రం, ఆరెకటిక, మేరుసంఘం, వెలమ, వందేళ్లనాటి కరివెన సత్రాలతోపాటు మరిన్ని సత్రాలు నిరాటకంగా నిత్యాన్నదానం చేయడంలో ముందున్నాయి. ఇక ఆశ్రమాలు, మఠాల సంగతి చెప్పక్కర్లలేదు. శివరాత్రి బహ్మోత్సవాల సందర్భంగా అటకేశ్వర సమీపంలోని నాలుగు ఆశ్రమాలు వేలాది మంది భక్తులకు అన్నదానం చేస్తున్నాయి. శ్రీశైలంలో ఒకరికి అన్నదానం చేస్తే కాశీలో లక్షమందికి అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయనే నేపథ్యంలో అన్న వితరణకు తామూ భాగస్వాములం అవుతామని వేలాది మంది విశేషంగా అన్నసత్రాలకు విరాళాలు సమరి్పస్తున్నారు. శ్రీశైలంలో అన్నదాన ప్రభంజనంతో హర్షిత రేఖలు వ్యక్తం చేస్తూ ‘అన్నదాతా.. సుఖీభవ’ అంటూ దీవిస్తున్నారు.
అటవీశాఖ నిబంధనలతో..
పాదయాత్రతో శ్రీశైల మహాక్షేత్రం వెళ్లే స్వాములకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొచ్చి షామియానాలు, ఉచిత భోజనం, మంచి నీటి సౌకర్యాలతోపాటు అల్పాహారం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పాదయాత్రతో వచ్చిన శివస్వాములకు నల్లమల దారిలోని మన్ననూర్, ఫర్హాబాద్, వట్టువర్లపల్లి, రాసమల్లబావి వద్ద గత పుష్కరకాలంగా దాతలు సేవలందిస్తున్నారు. కాలినడకన వెళ్లే శివస్వాముల ఆకలి తీర్చడంలో దాతలు ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాలు చురుకైన పాత్ర పోషిస్తుంది. అచ్చంపేట– శ్రీశైలం నల్లమల అభయారణ మార్గంలో ప్రతిఏటా 20కిపైగా అన్నదాన కేంద్రాలు వెలిశాయి. మన్ననూర్ తర్వాత వటువర్లపల్లి వరకు ఎక్కడ కూడా వీరికి తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకదు. వటువర్లపల్లి తర్వాత మళ్లీ దోమలపెంట వరకు ఇదే పరిస్థితి. అటవీశాఖ వారు అటవీప్రాంతంలో తాగునీటి వసతి కలి్పంచాల్సి ఉన్నా ఇంత వరకు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. గతంలో కమ్యూనిటీ అవేర్‌నెస్ ప్రోగ్రాం కింద అటవీశాఖ వారు మంచినీటి సరఫరా, అల్పహార కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. కానీ గత నాలుగేళ్లుగా ఈ పద్ధతికి అటవీశాఖ స్వస్తి చెప్పి వీరి పేరిట డబ్బు ఖర్చు పెడుతున్నట్లు రికార్డులు చూపుతున్నారు. పాదయాత్ర చేసే స్వామలకు జంతువుల నుంచి ప్రాణహాని కలగకుండా అటవీ మార్గంలో సిబ్బందితో టీం ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై స్వాములకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రత్యేక బస్సు సర్వీసులు
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు, శివరాత్రిని పురస్కరించుకొన్ని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ ఆర్టీసీ డిపోల నుంచి సోమవారం నుంచి 22వ తేదీ వరకు ఆరురోజులపాటు శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. శ్రీశైలం కాలినడకన వెళ్లిన శివస్వాములు తిరుగు ప్రయాణం కోసం జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. గద్వాల డిపో నుంచి సోమవారం 35 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపిస్తున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఐదురోజులపాటు 390 బస్సులను శ్రీశైలానికి నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లకుండా ఆర్టీసీ బస్సులో సురక్షిత ప్రయాణం చేయాలని అధికారులు కోరుతున్నారు. అచ్చంపేట డిపో నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని డీఎం మనోహర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment