
వేసవి ఉష్ణోగ్రతలకు చర్మం పొడిబారిపోతుంది. తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ముఖం కూడా కళా విహీనంగా తయారవుతుంది. చర్మ, ముఖం సౌందర్య రక్షణలో శతాబ్దాల తరబడి కలబంద లేదా అలోవెరా విశిష్టంగా నిలుస్తోంది. వడదెబ్బ నుంచి ఉపశమనం మొదలు, మొటిమల నివారణలో బాగా పనిచేస్తుంది.అలోవెరాలో అనేక ఆరోగ్య లక్షణాలున్నాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి అద్భుతాలు చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంది. మరి అలోవెరా, ఇతర మూలికలు, పదార్థాలతో కలిసి వేసుకునే మాస్క్‌ల గురించి తెలుసుకుందామా?
జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, కలబంద జెల్‌లో పాలీసాకరైడ్లు , గ్లైకోప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. గాయం మానడాన్ని వేగవంతం చేసేలా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి మంటను తగ్గించడానికి సాయ పడతాయి. ఇంకాకలబందలోని హైడ్రేటింగ్, యాంటీమైక్రోబయల్లక్షణాలు మొటిమలు, తామర లాంటి సమస్యల నివారణతోపాటు, చర్మం, పొడిబారడం, ఎర్రబారడం, పగుళ్లు, కాలిన గాయాలకు కూడా ప్రభావవంతంగా పనిస్తుందని అధ్యయనం పేర్కొంది.
కలబంద ఫేస్ మాస్క్‌లు
కలబంద - తేనె మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జులో 1 టీస్పూన్ తేనె కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసువాలి. ఇది చక్కటి హైడ్రేటింగ్ ఏజెంట్‌గా పనిచేసి పోషణనిస్తుంది. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
కలబంద - పసుపు మాస్క్: పసుపు, తేనె లేదా రోజ్ వాటర్ వంటి మూలికలు , సుగంధ ద్రవ్యాలతో కలిపినప్పుడు, కలబంద చర్మ సంరక్షణ శక్తి కేంద్రంగా మారుతుంది. ముఖ్యంగా సేంద్రీయ పసుపు , కలబంద మాస్క్, నిస్తేజమైన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మొటిమల మచ్చలను తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్‌ను చిటికెడు పసుపుతో కలపండి. 10 నిమిషాలు అలాగే ఉంచి సున్నితంగా కడగాలి.
కలబంద -రోజ్ వాటర్ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్, టీస్పూన్ రోజ్ వాటర్ బాగా కలపాలి. దీన్ని ముఖంపై సమానంగా అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఎరుపును తగ్గించి, చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది.
కలబంద - నిమ్మకాయ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్‌లో కొన్ని చుక్కల నిమ్మరసంతో కలపండి.దీన్ని ముఖానికి అప్లై చేసి, 10 నిమిషాలు ఉంచి శుభ్రంగా కడిగేసుకోవాలి. (బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఇది వాడకూడదు). నిమ్మకాయ నల్ల మచ్చలను క్రమంగా తగ్గిస్తుంది.

కలబంద-గ్రీన్ టీ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్‌లో, చల్లని గ్రీన్ టీ కలపండి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, క 15 నిమిషాలు అలాగే ఉంచి కడగాలి. యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ మాస్క్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. యవ్వనమైన, అందమైన చర్మాన్ని అందిస్తుంది.
కలబంద-కీరా మాస్క్: కలబంద జెల్‌లో తురిమిన కీరా కలిపి దీన్ని సున్నితంగా ముఖానికి అప్లై చేయాలి. చల్లటి నీటితో శుభ్రం చేయడానికి ముందు 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ మాస్క్ చాలా రిఫ్రెష్‌గా ఉంటుంది, అలసిపోయిన చర్మాన్ని డీపఫ్ చేయడానికి , హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.