తేనెటీగలే కాదు.. చీమలు కూడా తేనెను ఉత్పత్తి చేస్తాయని తెలుసా? | Honeypot Ants The Worlds Only Honey Producing Ants | Sakshi
Sakshi News home page

తేనెటీగలే కాదు.. చీమలు కూడా తేనెను ఉత్పత్తి చేస్తాయని తెలుసా?

Published Tue, Nov 29 2022 7:46 AM | Last Updated on Tue, Nov 29 2022 12:57 PM

Honeypot Ants The Worlds Only Honey Producing Ants - Sakshi

తేనె అనగానే మనకు గుర్తొచ్చేది తేనెటీగలే. అవి వివిధ రకాల పూల నుంచి మకరందాన్ని సేకరించి తేనెను ఉత్పత్తి చేస్తాయి. అందులోనూ కొన్నిరకాలే ఈ పనిచేస్తాయి. మరి వీటికి పూర్తి భిన్నంగా ఉండే ఒక రకం చీమలు కూడా తేనెను ఉత్పత్తి చేస్తాయి తెలుసా?.. ఈ చీమల తేనె, దాని సేకరణ, నిల్వ విధానం చాలా చిత్రంగా ఉంటుంది కూడా.. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.. 

కరువులో వాడుకొనేందుకు.. 
సాధారణంగా చాలా రకాల జీవులు ఎప్పుడైనా ఆహారం దొరకని పరిస్థితుల్లో వాడుకొనేందుకు వీలుగా నిల్వ చేసుకుంటూ ఉంటాయి. అది అవి మామూలుగా తినే ఆహారమే అయి ఉంటుంది. కానీ ఆ్రస్టేలియా, అమెరికా, మెక్సికోతోపాటు పలు ఆఫ్రికా దేశాల్లోని ఎడారి భూముల్లో ఉండే ఒక రకం చీమలు ఏకంగా తేనెను నిల్వ చేసుకుంటాయి. అది కూడా చిత్రమైన పద్ధతిలో కావడం విశేషం. ఇవి కాంపోనోటస్‌ ఇన్‌ఫ్లాటస్‌ జాతికి చెందినవి. సింపుల్‌గా హనీపాట్‌ చీమలు అని పిలుస్తుంటారు.  

శరీరంలోనే ‘తేనె’నిల్వ 
సాధారణంగా తేనెటీగలు తమ నోటిద్వారా పూల నుంచి మకరందాన్ని సేకరించి.. దానిని ప్రత్యేకమైన పట్టుల్లో నిల్వచేస్తాయి. కానీ ఈ చీమలు తేనెను నిల్వ చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లేమీ ఉండవు. వాటి శరీరంలోనే తేనెను నిల్వ చేసుకుంటాయి. అందుకే వీటిని హనీపాట్‌ చీమలు అని పిలుస్తుంటారు. 

సాధారణంగా చీమల కాలనీల్లో వేర్వేరు విధులను వేర్వేరు చీమలు నిర్వహిస్తుంటాయి. ఇలా వర్కర్‌ చీమలు పూల నుంచి మకరందాన్ని సేకరించుకుని వచి్చ.. పుట్టలోనే ఉండే హనీపాట్‌ చీమల నోటికి అందిస్తాయి. హనీపాట్‌ చీమలు దానిని తేనెగా మార్చి తమ కడుపులో నిల్వ చేస్తాయి. 

ఈ నిల్వ ఏ స్థాయిలో ఉంటుందంటే.. హనీపాట్‌ చీమల కడుపు పగిలిపోతుందేమో అన్నంతగా తేనెను నింపుకొంటాయి. ఆ బరువుతో కదలలేక.. పుట్టలో గోడలను పట్టుకుని చాలా రోజులు అలాగే ఉండిపోతాయి. 

పుట్టలోని చీమలకు ఆహారం కొరత తలెత్తినప్పుడు.. ఈ హనీపాట్‌ చీమల కడుపు నుంచి తేనెను బయటికి తీసి తినేస్తాయి. ఒక్కోసారి ఇతర పుట్టల చీమలు.. హనీపాట్‌ చీమలున్న పుట్టపై దాడిచేసి తేనెను ఎత్తుకుపోతుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఈ చీమలు.. బహుమతులు 
సాధారణ తేనెతో పోలిస్తే ఈ చీమల తేనె తీపిదనం తక్కువని, కాస్త పుల్లటి రుచి కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చీమల తేనెలో గ్లూకోజ్‌ చక్కెర శాతం ఎక్కువని.. అదే తేనెటీగల తేనెలో ఫ్రక్టోజ్‌ రకం చక్కెర అధికమని వివరించారు. ఆ్రస్టేలియాలో స్థానిక తెగల ప్రజలు తేనెచీమలను సేకరించి బహుమతిగా ఇచ్చి పుచ్చుకుంటారట కూడా. 
చదవండి: మనసు మాట వినే చక్రాల కుర్చీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement