ఆత్మకూరు రూరల్: గతం తెలియని వారికి భవిష్యత్తు ఉండదని పెద్దలు చెబుతుంటారు. అందుకే గతకాలంలో జరిగిన విషయాలను పరిశోధించి, ఫలితాలను గుదిగుచ్చి చరిత్రగా మన ముందు ఉంచుతుంటారు చరిత్రకారులు. అలాంటి వారి దృష్టికి రాకుండా కొన్ని గతకాలపు ఆనవాళ్లు మరుగున పడిపోతుంటాయి.
అలాంటివి కృష్ణా తీరంలో, నల్లమల అడవుల్లో ఎన్నో గుప్తంగా ఉండిపోతున్నాయి. ఇక్కడ కనపడుతున్న రెండు శిలాశాసనాలు కూడా అలాంటివే.. ఇవి నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని ఇందిరేశ్వరం బీట్‌లో పెద్ద గుమ్మితం వద్ద ఉన్నాయి. గుమ్మితం ఒక ప్రాచీన శైవ క్షేత్రం. కొండపైనుంచి దుమికే జలపాతాన్ని ఏర్పరచిన ఒక కొండ వాగు ఒడ్డున ఈ క్షేత్రం ఉంది.
ఈ క్షేత్ర ఆవరణలో పురాతన లిపి ఉన్న రెండు శిలా శాసనాలు ఉన్నాయి. బాగా పాతకాలంనాడు అప్పటి వారు ఉపయోగించిన తెలుగు లిపితో ఈ శాసనాలు ఉన్నాయి. ఇవి కాకతీయ – విజయనగర పాలన మధ్య కాలంలోనివి(క్రీశ11–12 శతాబ్ధాలు) అయి ఉండొచ్చునని చరిత్రపై అవగాహన ఉన్న కొందరు చెబుతున్నారు. ఇవి ఎర్రయ్య అనే వ్యక్తి వేయించిన దాన శాసనాలుగా తెలుస్తోంది. మల్లికార్జున స్వామికి ఏదో బహుమానం రూపంలో సమర్పించినట్లు లిపిని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తోంది. అయితే ఈ శిలాశాసనాలను పూర్తిస్థాయిలో పరిశోధిస్తే చరిత్రలో మరుగున పడ్డ విషయాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment