నల్లమల అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలవుతున్నాయి. వేటగాళ్ల ఆటకట్టించేందుకు, అటవీ సంపదను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. వేటగాళ్లపై నిరంతర నిఘా పెట్టి వారి కదలికను నియంత్రిస్తున్నారు. అభయారణ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు గూడేలలో గార్డుల నిఘాతోపాటు కొరియర్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. ఇటీవల కాలంలో 15 కేసులు నమోదు చేసి 35 మంది వేటగాళ్లను జైలుకు పంపారు.
మార్కాపురం: ప్రకాశం జిల్లాలో 3568 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించింది. మార్కాపురం, పెద్దదోర్నాల, పెద్దారవీడు, అర్థవీడు, కంభం, గిద్దలూరు, కొనకనమిట్ల, తర్లుపాడు, పొదిలి, యర్రగొండపాలెం, పుల్లలచెరువు పరిధిలో ఉన్న అటవీ సమీప గ్రామాల్లో వన్యప్రాణులను వేటాడడం, అటవీ సంపదను వేటగాళ్లు దోచుకుంటున్నారు. మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిధిలో మార్కాపురం, దోర్నాల, కొర్రపోలు, నెక్కంటి, గంజీవారిపల్లి, యర్రగొండపాలెం, విజయపురి సౌత్‌లో అటవీ శాఖ అధికార కార్యాలయాలు ఉన్నాయి. వీరి పరిధిలో ఏడుగురు రేంజ్ ఆఫీసర్లు, పది మంది డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, 14 మంది సెక్షన్ ఆఫీసర్లు, 60 మంది బీట్ అధికారులు ఉన్నారు.
వేటగాళ్ల ఆగడాలను అరికట్టేందుకు అభయారణ్యంలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఏమాత్రం కదలికలు కనిపించినా వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో వేటగాళ్లు గిరిజన గూడేలు, సమీప గ్రామాలను ఎంపిక చేసుకుని నిరంతరం వన్యప్రాణులను సంహరిస్తున్నారు. జింకలు, దుప్పులు, కణుతులు, కుందేళ్లను రాత్రిపూట వేటకు వెళ్లి ఉచ్చులేసి చంపి విక్రయిస్తున్నారు. దీంతో రేంజ్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు గార్డులు, నిఘా పెట్టారు. కొరియర్ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఐదు నెలల కాలంలో 35 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
ఈ కేసులకు సంబంధించి మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయ పరిధిలో 35 మంది వేటగాళ్లను అరెస్టు చేశారు. దాదాపు 2.25 లక్షల అపరాధ రుసుము విధించారు. మార్కాపురం పరిధిలో 9 కేసుల్లో 19 మందిని, పెద్దదోర్నాల పరిధిలో 3 కేసుల్లో 10, యర్రగొండపాలెం పరిధిలో 1 కేసులో 3, విజయపురి సౌత్ పరిధిలో 2 కేసుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. రాత్రిపూట అటవీశాఖ సిబ్బంది గస్తీని పెంచారు. అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.
వేటాడితే కఠిన చర్యలు
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అటవీ జంతువులు కనిపిస్తే ఎవరూ చంపవద్దు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. 1972 వన్యప్రాణి చట్టం ప్రకారం శిక్షలు అమలవుతాయి.
– విఘ్నేష్ అప్పావ్, డీడీ, మార్కాపురం
ముఖ్య సంఘటనలు
► సెప్టెంబర్ 24న కలుజువ్వలపాడు దగ్గర కుందేళ్లను వేటాడుతున్న ఇద్దరు వేటగాళ్లను అరెస్టు చేశారు.
► సెప్టెంబర్ 1న కొనకనమిట్ల మండలం మునగపాడు వద్ద ముగ్గురు వేటగాళ్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
► నవంబర్ 7న పట్టణంలోని బాపూజీ కాలనీకి చెందిన ముగ్గురు వేటగాళ్లను అరెస్టు చేశారు.
వీరితో పాటు దోర్నాల మండలం కొత్తూరు వద్ద అడవిపందిని పట్టుకుని చంపి మాంసం విక్రయిస్తున్న వేటగాళ్లను అరెస్టు చేశారు. మార్కాపురం మండలం చింతగుంట్ల పరిధిలో ఇద్దరు వేటగాళ్లను, బోడపాడు వద్ద అక్టోబర్‌లో ఇద్దరు వేటగాళ్లను అరెస్టు చేశారు. గత నెలలో గిద్దలూరులో కూడా పలువురు వేటగాళ్లను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment