తాగర అన్నా.. తాగి ఊగర అన్నా..! | Officials Attack On Sarah Centres In Nallamala | Sakshi
Sakshi News home page

తాగర అన్నా.. తాగి ఊగర అన్నా..!

Published Fri, Apr 27 2018 12:39 PM | Last Updated on Fri, Apr 27 2018 12:39 PM

Officials Attack On Sarah Centres In Nallamala - Sakshi

గిద్దలూరు: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నాటుసారా తయారు చేసి విక్రయించడం కొందరు ఉపాధిగా మార్చుకుంటున్నారు. సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతాలను సారా తయారీ కేంద్రాలుగా రూపాంతరం చెందిస్తున్నారు. బేస్తవారిపేట మండలం, కొమరోలు మండలంలోని కొన్ని గ్రామాలు, గిద్దలూరు మండలంలోని నల్లమల అడవికి సమీపంలో ఉన్న వెంకటాపురం, దూర్‌చింత్‌ తండా, బరుజుపల్లె తండా, కొత్తకోట, దిగువమెట్ట, ఓబులాపురం తండా, గడికోట, అంకాలమ్మపల్లె, బేస్తవారిపేట మండలం కోనపల్లె లోయలోని గ్రామాల్లోని నాటుసారా తయారీదారులు అడవిలో బట్టీలు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా నాటుసారా వ్యాపారం చేస్తున్నారు. రోజూ కొన్ని వందల లీటర్ల నాటుసారాను ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. దట్టమైన అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలను గుర్తించడం ఎక్సైజ్‌ అధికారులకు కష్టంగా మారింది. ఇటీవలి కాలంలో గ్రామాల్లోనూ నాటుసారా విక్రయం జోరుగా సాగుతోంది. గ్రామ చివరలో కాపలాదారులను ఉంచి అధికారుల రాకను సెల్‌ఫోన్‌ల ద్వారా సమాచారం తెలుసుకుంటూ తప్పించుకుంటున్నారని తెలుస్తోంది.

అడవిలోనే మకాం
నాటుసారా తయారీకి అడవిలోనే రోజుల తరబడి మకాం వేస్తున్నారు. సారా తయారీకి అవసరమన తుమ్మచెక్క, బెల్లం, యూరియా అడవిలోకి చేరవేస్తున్నారు. వారికి అవసరమైన ఆహార పదార్థాలను కుండలు, క్యాన్లలో వెంట తీసుకుని వెళ్తున్నారు. నీటి వసతి ఉన్న చోట సారా బట్టీలు ఏర్పాటు చేసుకుని అక్కడే మకాం వేస్తున్నారు. సారా తయారు కాగానే క్యాన్లతో పల్లెల్లోకి వస్తున్నారు. కొందరు వ్యాపారులు రోజువారీ కూలీలను వినియోగిస్తున్నారు. సారా తయారీకి అవసరమైన సరుకును వారికి అప్పగిస్తున్నారు. కూలీలు సారా తయారు చేసేంత వరకు వారికి అవసరమైన భోజనం, కుటుంబాల అవసరాలను వారే తీరుస్తుంటారు. ఇందుకోసం కూలికి రోజుకు  ఐదు వందల నుంచి రూ.వెయ్యి వరకు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కలిసొచ్చిన వివాహాల సీజన్‌  
నెల రోజులుగా వివాహ, శుభకార్యాలు ప్రారంభం కావడంతో నాటుసారాకు గిరాకీ పెరిగింది. శుభకార్యాలకు గ్రామాల్లో ఎక్కువగా నాటుసారా వినియోగిస్తుంటారు. ఇటీవల సారాకు డిమాండ్‌ పెరిగింది. కొందరు కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు, కర్నాటకకు నాటుసారా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. సారా తయారీదారులు, విక్రయించేవారు అధికారులంటే భయంలేనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి నెలా ముడుపులు సమర్పించి మచ్చిక చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పుడు మాత్రమే నామమాత్రపు దాడులు నిర్వహించి బైండోవర్‌లు, చిన్న కేసులతో చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు, రైలు మార్గంలో ఇతర రాష్ట్రాలకు నాటుసారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పనులన్నీ రాత్రిళ్లు చక్కదిద్దుతున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడులు నిర్వహించి అడవుల్లో ఏర్పాటు చేసిన సారా బట్టీలను తొలగించి తమ కుటుంబాలను కాపాడాలని వివిధ గ్రామాల మహిళలు కోరుతున్నారు.

దాడులు నిర్వహిస్తున్నాం
ఇటీవల నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహిస్తున్నాం. అటవీ ప్రాంతాల్లో ఉన్న బట్టీలను ధ్వంసం చేసి పలువురిపై కేసులు పెట్టాం. ఎక్కడైనా నాటుసారా బట్టీలు ఉన్నట్లు మాకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం. నాటుసారాతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.– రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐ, ఎక్సైజ్‌ శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement