natu sara centers
-
చంద్రన్న నాటుసారా.. కుప్పంలో కొత్త లిక్కర్
-
తూర్పుగోదావరిలో ఎస్ఈబీ మెగా ఆపరేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధిక నాటుసారా తయారీ కేంద్రాలు ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో ఎస్ఈబీ ఏఎస్పీ సుమిత్ గరుడ్, ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ప్రసాద్‌ల పర్యవేక్షణలో 100 మంది సిబ్బంది 13 టీమ్‌లుగా ఏర్పడి సారా తయారీ కేంద్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేశారు. మంగళవారం ఒక్క రోజే జిల్లాలోని 30 వేర్వేరు ప్రాంతాల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 67,900 లీటర్ల (రూ.13 లక్షల విలువైన) బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇంత పెద్ద ఎత్తున బెల్లం ఊటను ధ్వంసం చేయడం ఆంధ్రప్రదేశ్‌లోనే రికార్డు. 5గురిని అరెస్టు చేశారు. 100 లీటర్ల నాటు సారాను, ఒక వాహనాన్ని స్వాదీనం చేసుకున్నారు. సారా తయారీకి సంబంధించిన సమాచారాన్ని తూర్పుగోదావరి ఎస్ఈబీ హెల్ప్‌లైన్ నంబర్ +91 9490618510కు ఫోన్ చేసి తెలియజేయాలని వినీత్ బ్రిజ్‌లాల్ సూచించారు. -
రెండు రోజుల్లో 202 కేసులు
సాక్షి, అమరావతి: ‘సాక్షి’ వరుస కథనాలతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ‘కాటు సారా’, ‘హద్దులు లేవు–అక్రమాలకు కేరఫ్ ఆంధ్రా ఒడిశా బోర్డర్’ నిఘా కథనాలను వెలుగులోకి తేవడంతో ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ స్పందించి రాష్ట్రంలో నాటుసారా తయారీ కేంద్రాలను నిర్మూలించేలా అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా నాటు సారా కేంద్రాలపై విస్తృత దాడులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ఈబీ డైరెక్టర్ పీహెచ్డీ రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ► గత రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 202 కేసులు నమోదు చేశారు. 2,141.8 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సారా తరలించేందుకు వినియోగించిన 16 వాహనాలను సీజ్ చేశారు. ► సారా తయారీ కేంద్రాల వద్ద 88,065 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ► ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 788 లీటర్ల సారా, 41,500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక సారా తయారీ కేంద్రాలు ఇక్కడి ఏజెన్సీ, గోదావరి లంకలు, కోరంగి మడ అడవుల్లో ఉండటంతో ఎస్ఈబీ ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆ తర్వాత పశ్చిమ గోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్ఈబీ కొరడా ఝుళిపించింది. -
నాటు సారా కేంద్రాల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నాటు సారాను అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. సారా తయారీ కేంద్రాలను గుర్తించేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ‘కాటు సారా’, ‘హద్దులు లేవు.. అక్రమాలకు కేరాఫ్‌గా ఆంధ్రా ఒడిశా బోర్డర్’ అనే శీర్షికలతో ‘సాక్షి’ ప్రచురించిన కథనాలపై ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ స్పందించారు. 18 పోలీస్ యూనిట్లకు చెందిన ఎస్ఈబీ ఏఎస్పీలతో సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. సీఎం వైఎస్ జగన్ ఆశయం, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలకు అనుగుణంగా నాటు సారా, గంజాయి, మాదక ద్రవ్యాలతో పాటు ఇసుక అక్రమాలపై మరింత దృష్టి సారించాలని వినీత్ బ్రిజ్‌లాల్ ఆదేశించారు. ప్రజల ప్రాణాలు తీస్తున్న సారాను పూర్తిగా నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని.. గ్రామాల్లో ఉన్న ఇన్ఫార్మర్స్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 191 మండలాల్లో మొత్తం 682 నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. ఇవి కాకుండా ఇంకా ఎక్కడెక్కడ సారా తయారీ కేంద్రాలు ఉన్నాయో నిఘా వర్గాలు, ఇన్ఫార్మర్స్ ద్వారా జల్లెడ పట్టాలని ఆదేశించారు. ఇప్పటికే దాదాపు 10,000 మంది ఇక సారా తయారు చేయబోమని చెప్పారని.. ఇంకా ఎవరైనా ఉంటే నయానో, భయానో చెప్పి సారా తయారీని మాన్పించాలని సూచించారు. నవోదయం, పరివర్తన వంటి కార్యక్రమాల ద్వారా వారికి అవగాహన కల్పించాలని.. అప్పటికీ మారకపోతే పీడీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడవద్దని ఆదేశాలిచ్చారు. సారా తయారీ, రవాణాపై నిరంతరం నిఘా వేసి ఉంచాలని.. ఏ మాత్రం ఏమరుపాటు వద్దని ఆదేశించారు. జక్కరవలసలో 1,280 లీటర్ల బెల్లం ఊట కేన్లను పట్టుకున్న ఎస్ఈబీ సిబ్బంది శ్రీకాకుళంలో కొనసాగిన దాడులు.. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశమైంది. సరిహద్దులపై ఎస్ఈబీ అధికారులు మరింత దృష్టి సారించారు. దాడులు చేయడమే కాకుండా.. అవగాహన కల్పించడం ద్వారా కూడా మార్పు తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పాతపట్నం మండలం బొమ్మికలో, కంచిలి మండలం పి.సాసనం గ్రామంలో ఎస్ఈబీ అ«ధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు సీతంపేట మండలం జక్కరవలస పరిసర ప్రాంతాల్లో ఎస్ఈబీ సిబ్బంది సోమవారం దాడులు చేసి 1,280 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. మెళియాపుట్టి మండలం సవరమర్రిపాడులో 600 లీటర్లు, కొత్తూరు మండలంలో జక్కరగూడ, బొడ్డగూడలో 750 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పలాసలో నాటు సారాను, రాజాం, కోటబొమ్మాళి, పొందూరులో నాన్ పెయిడ్ డ్యూటీ వైన్‌ను పట్టుకుని సీజ్ చేశారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా వేసినట్లు ఎస్ఈబీ ఏఎస్పీ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. -
కరోనా: బ్లాక్‌లో మద్యం హవా
సాక్షి, మంచిర్యాల: మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు గుట్టుగా బ్లాక్‌లో మద్యం దందా సాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లాక్డౌన్లో ఏకంగా వైన్సుల నుంచే అమ్మకాలు చేపడుతున్నారు. రాత్రి వేళల్లో స్టాక్‌ను బయటకు తీసి అదును చూసి విక్రయిస్తున్నారు. ఈనెల 22న జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి అన్ని వ్యాపారాలు మూత పడ్డాయి. ఇందులో భాగంగానే మద్యం దుకాణాలకు సైతం ఎక్సైజ్ అధికారులు తాళాలు వేసి సీల్ వేశారు. అయితే చాలా మంది కర్ఫ్యూ ప్రకటించగానే ఆ రోజు వరకే స్టాక్ బయటికి తీశారు. అదే రోజు రాష్ట్రంలో మార్చి 31వరకు లాక్డౌన్ ప్రకటించడం, ఆ తర్వాత దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14వరకు పొడిగించడం ప్రకటించడంతో చాలా చోట్ల వైన్సుల్లోనే సరుకు ఉండిపోయింది. (ప్రధాని మోదీ మీటింగ్.. వీడియో లీక్! ) ఇక కొందరు లాక్డౌన్ ప్రకటించడం టీవీల్లో చూసి వెంటనే అప్రమత్తమై ఉన్న స్టాక్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక కొందరు వైన్సుల నుంచే స్టాక్ తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జైపూర్‌లో రెండు రోజుల క్రితం ఓ వైన్సు షాపు తాళానికి వేసి ఉన్న సీల్ తొలగించినట్లు ఎక్సైజ్ అధికారుల దృష్టికి వచ్చింది. అంతేకాక గ్రామాల్లో బెల్టు షాపుల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తే సరుకు పట్టుబడుతోంది. ఇదంతా వైన్సుల నుంచే సరఫరా అవుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బుధవారం కాసిపేట మండలం దేవాపూర్‌లోని బెల్టుషాపుల్లో దాడి చేయగా మద్యం పట్టుబడింది. కొన్ని చోట్ల బ్లాక్‌లో కూడా మద్యం దొరక్కపోవడంతో వైన్సుల్లో చోరీలకు పాల్పడుతున్నారు. బుధవారం దండేపల్లి మండలం చెల్కగూడెంలోని ఓ వైన్సులో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి రూ.5వేల విలువైన మద్యం ఎత్తుకెళ్లారు. (క్యాస్టింగ్ కౌచ్: రాజీకొస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తా! ) అడ్డగోలు రేట్లకు అమ్మకం మందుబాబుల బలహీనతను ఆసరా చేసుకుని అడ్డగోలు రేట్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి బ్రాండ్ సరుకును రెట్టింపు ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం. ఉదాహరణకు ఎంసీ ఫుల్ బాటిల్ ఎమ్మార్పీ రూ.560 కాగా, ప్రస్తుతం బ్లాక్‌లో రూ.1100లకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అలాగే బీరు ధర ఎమ్మార్పీ రూ.120 ఉంటే ప్రస్తుతం రూ.300 వరకు విక్రయాలు సాగిస్తున్నారు. ఇలా ప్రతి బ్రాండ్‌కు ఎమ్మార్పీతో పోల్చితే రెట్టింపుకు మించి ధరకు విక్రయాలు సాగిస్తున్నారు. ఇక కొందరు లాక్‌డౌన్‌ను ముందే ఊహించి పెద్ద ఎత్తున సరుకును రహస్య ప్రదేశాలకు తరలించారు. జనతా కర్ఫ్యూ పాటించిన రోజే లాక్డౌన్ ప్రకటించడంతో జిల్లా కేంద్రంతో పాటు అనేక షాపుల్లో ఉన్న స్టాక్‌ను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఉన్న స్టాక్ కూడా ఖాళీ అవుతుండడంతో ధరలు రెట్టింపు చేస్తూ వచ్చారు. లాక్డౌన్ తర్వాత రెండు, మూడు రోజులు ఎమ్మార్పీకి మించి రూ.50 నుంచి రూ.100 వరకు అధికంగా విక్రయించగా ప్రస్తుతం కొన్నిచోట్ల రెట్టింపు, మరి కొన్నిచోట్ల మూడింతల ధరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది. బయట ఎక్కడా మద్యం దొరకపోవడంతో ఎంత ధర అయినా కొనేందుకు మద్యం ప్రియులు ఆసక్తి చూపుతుండడంతో ఈ దందా సాగుతోంది. ప్రస్తుతం వైన్సు షాపుల్లోనూ ఉన్న స్టాక్ దాదాపు అయిపోయినట్లే తెలుస్తోంది. ఎందుకంటే గోదాంల నుంచి మద్యం స్టాక్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఉన్న స్టాక్‌నే డిమాండ్‌ను బట్టి రహస్యంగా ఎక్కువ ధరలకు అమ్ముకునే పనిలో ఉన్నారు. (ఇదేం పని జోన్స్.. ట్రోల్ చేసిన ఆకాష్ ) గ్రామాల్లో గుడుంబా జోరు.. గుడుంబా రహిత జిల్లాగా సాగిన తర్వాత మళ్లీ లాక్‌డౌన్‌తో గ్రామాల్లో గుడుంబా తయారీ కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ప్రాణహిత తీరం వెంబడి పలు ప్రాంతాల్లో గుడుంబా తయారు చేస్తున్నారు. జిల్లాలో నెన్నెల, దండేపల్లి, కోటపల్లి, భీమారం, మందమర్రి తదితర మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారుల దాడుల్లో పెద్దఎత్తున బెల్లంపానకం, నాటు సారా పట్టుబడుతోంది. అటు మద్యం సరఫరా లేకపోవడంతో కొందరు గ్రామీణ ప్రాంతాల్లో మత్తు కోసం గుడుంబా వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం లీటరు గుడుంబా ఏడు వందల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఎంతైన ఖర్చు చేసి మత్తు కోసం జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. మద్యం షాపుల తాళాలకు వేసిన సీల్ తీసినా.. తాళాలు తమ వద్దనే ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో నిత్యం మఫ్టీలో గుడుంబా తయారీ అరికట్టేందుకు గస్తీ చేస్తున్నామని ఎక్కడైనా మద్యం విక్రయిస్తే తమ దృష్టికి తేవాలని అబ్కారీ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు నిత్యం మద్యం సేవించే అలవాటు ఉన్నవారికి కొద్ది రోజులుగా మద్యం దొరకపోవడంతో నిర్ణీత సమయాల్లోనైనా ఆంక్షలతో మద్యం షాపులు తెరవాలనే డిమాండ్లు వస్తున్నాయని అంటున్నారు. (ఎల్లకాలం నీకు తోడుగా ఉంటా: బిగ్‌బాస్ రన్నరప్ ) -
నాటు సారా కేంద్రాలపై మెరుపు దాడులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నాటు సారా నిర్మూలనకు పోలీసులు కదం తొక్కారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు, ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా నాటు సారా కేంద్రాలపై పోలీసు, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో నాటు సారా తయారీ కేంద్రాలపై ఉదయం 4 గంటల నుండి దాడులు చేస్తున్నారు. పదివేల మంది సిబ్బందితో తనిఖీలు కొనసాగుతున్నాయి. వందలాది మంది పోలీస్ అధికారులతో కూడిన బృందాలతో, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, ప్రొబేషనరీ ఐపీఎస్, సీఐలు,ఎస్సైలు, పది వేల మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు జరుగుతున్నాయి. నాటుసారా నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు జిల్లాలను జల్లెడపడుతున్నారు. ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో బెల్లం ఊట నిల్వలు, నాటుసారా నిల్వలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో పూర్తిగా మద్యం, డబ్బు పంపిణీని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు చేస్తున్నారు. -
జిల్లాలో సారా పరవళ్లు
సాక్షి, చీరాల(ప్రకాశం) : జిల్లా ప్రస్తుతం కరువు కాటకాలతో అల్లాడుతోంది. సాగు, తాగునీరు లేక దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటోంది. కరువు బృందాలు జిల్లాలో పర్యటిస్తున్నాయి. ఇటువంటి కరువు జిల్లాలో నాటుసారా మాత్రం పరవళ్లు తొక్కుతోంది. ముఖ్యంగా చీరాలతో పాటు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన గిద్దలూరు, పెద్దదోర్నాల, పుల్లలచెరువు, అర్ధవీడు, మార్కాపురం ప్రాంతాల్లో జోరుగా నాటుసారా తయారీ, విక్రయాలు చేస్తున్నారు. చీరాలకు గుంటూరు జిల్లా స్టూవర్టుపురం నుంచి రోజుకు 1000 లీటర్లకుపైగా నాటుసారా సరఫరా అవుతోంది. చీరాల్లోని రామ్‌నగర్‌లో తయారీదారులు నేరుగా ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ ఇసుక భూముల్లో సారా తయారు చేస్తున్నారు. పశ్చిమాన అటవీ ప్రాంతాలతో పాటు తండాల్లో తయారీ చేసి పట్టణాలు, గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. సారా లభించని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. గతం టీడీపీ ప్రభుత్వం జిల్లాలో నాటుసారా లేదని ప్రకటించింది. పాలకులు మాత్రం నాటుసారా రహిత జిల్లాగా ఎలా ప్రకటించారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు చీరాలకు మరో పేరు క్షీరపురి. అంటే ఒకప్పుడు పాడిపరిశ్రమతో ఈ ప్రాంతం కళకళలాడేది. ప్రస్తుతం ఆ స్థానంలో సారా వెల్లువగా మారింది. చీరాల ప్రాంతంలో ఎక్కువగా నివసించేది బడుగు, బలహీన వర్గాల వారే. కాయ కష్టం చేసుకుని జీవనం సాగిస్తుంటారు. పని ఒత్తిళ్లు, ఇతర కారణాలతో మద్యం మత్తుకు ఎక్కువ మంది బానిసలవుతున్నారు. కూలి చేసుకుని బతికే ఈ వర్గాల ప్రజలు మద్యం కొనుగోలు చేసి తాగే ఆర్థిక స్థితి లేక ప్రత్యామ్నాయ మార్గంగా సారా వైపు దృష్టి సారిస్తున్నారు. కొన్నేళ్లుగా చీరాల ప్రాంతంలో సారా పరవళ్లు తొక్కుతోంది. చీరాలకు కూతవేటు దూరంలో అంటే ఐదు కిలోమీటర్లలోపే గుంటూరు జిల్లా స్టూవర్టుపురం మందుబాబులతో కోలాహలంగా ఉంటుంది. నాటుసారా కడుపునిండా తాగి తమతో కలిసి మద్యం తాగే వారికి పార్శిల్ రూపంలో కొనుగోలు చేసి రైళ్లలో రోజూ తెస్తుంటారు. వేటపాలెం, పందిళ్లపల్లి, జాండ్రపేట, రామకష్ణాపురం, చీరాల, ఈపూరుపాలెంతో పాటు చినగంజాం, పలు ప్రాంతాల నుంచి స్టూవర్టుపురం వెళ్లి సారాతాగి వెంట కూడా తెచ్చుకోవటం నిత్యకత్యం. సారా రహిత జిల్లా ఎక్కడ? జిల్లాలో నాటుసారా ఊసేలేదని గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ఎక్సైజ్ మంత్రి జవహర్ ప్రకటించారు. కానీ ఎక్కడా సారా ఆగలేదు. జిల్లాలోని చీరాల, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాలతో పాటు మారుమూల తండాల్లో కొందరు కొన్నేళ్లుగా నాటుసారా తయారు చేస్తున్నారు. ఏదో చాటుమాటుగా కాకుండా ఇళ్ల వద్దే సారా కాస్తున్నారంటే సారా అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చీరాల, రామ్‌నగర్, ఆదినారాయణపురం, సాయికాలనీ, తోటవారిపాలెం వీవర్స్ కాలనీకి చెందిన కొందరు స్టూవర్టుపురంలో సారాను ఐదు లీటర్ల క్యాన్ రూ.400 కొనుగోలు చేసి మందుబాబులకు గ్లాస్ రూ.10, క్వార్టర్ రూ.20 నుంచి 30 చొప్పున విక్రయిస్తున్నారు. అందులోనూ మొదటి క్వాలిటీ, రెండో క్వాలిటీని బట్టి డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే చీరాల ప్రాంతంలోని దండుబాట, స్వర్ణ రోడ్డు, జాలమ్మ గుడి, ఉజిలీపేట, శంగారపేట, గాంధీనగర్, ఎఫ్‌సీఐ గోడౌన్స్ సమీపంలో కూడా సారా విక్రయాలు రోజూ భారీ స్థాయిలో జరుగుతుంటాయి. స్థానికంగా కూడా తయారీ గతంలో కేవలం స్టూవర్టుపురంలో మాత్రమే సారా తయారై చీరాలకు సరఫరా చేసేవారు. కానీ సారాకు డిమాండ్ పెరగటంతో స్థానికంగా తయారు చేస్తున్నారు. ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ పక్కన, రామ్‌నగర్ గ్యాంగి, మత్య్సకార గ్రామం వాడరేవు, విజిలీపేట, జాలమ్మగుడి, ఫ్లయిఓవర్ బ్రిడ్జి కింద, జవహర్‌నగర్ ప్రాంతాలు కాపుసారా అమ్మకాలకు నిలయాలుగా మారాయి. ఇందుకోసం ఎక్సైస్ అధికారులు కొందరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని సారా నియంత్రణకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రైవేటు వ్యక్తులు సారా అమ్మకందారులతో చేతుల కలపడంతో సారా పరవళ్లు తొక్కుతోంది. కాపుసారా తయారీకి అధిక మోతాదులో మిరపకాయలు, యూరియా, బ్యాటరీ పౌడర్‌తో పాటు ఇతర హానికర విష పదార్థాలు కలుపుతున్నట్లు సమాచారం. నామమాత్రపు దాడులతో సరి నాటుసారా వ్యవహారాన్ని స్థానిక పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారు. స్టూవర్టుపురం నుంచి చీరాలకు ఆటోలు, టూవీలర్స్‌లో నేరుగా తరలిస్తుంటారు. ఈపూరుపాలెం రోడ్డు పక్కనే రూరల్ పోలీస్‌స్టేషన్ దాటుకుని నేరుగా ఈపూరుపాలెం, చీరాల ప్రాంతాలకు నాటుసారా తరలిస్తున్నా స్థానిక పోలీసులు సారా పట్టుకుంటే మనకేమి వస్తుందిలే అనుకున్నారెమో గానీ వారి జోలికి వెళ్లడం లేదు. ఎక్సైజ్ పోలీసులు పరిస్థితి మరీ దారుణం. వారికి సారా సామ్రాట్లు అంటే మహా భయం. ఎక్సైజ్ పోలీసులపై సారా అమ్మే మాజీ నేరగాళ్లు పలుమార్లు దాడులు చేసి గాయపరిచిన సంఘటనలు అనేకం ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్‌తో పాటు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, సబ్‌డివిజన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఉన్నా వారు సారా నియంత్రించడంలో నామమాత్రంగా కూడా దృష్టి పెట్టడం లేదు. -
నాటుసారాతో పట్టుబడ్డ టీడీపీ నేత
సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడ రూరల్‌లో సోమవారం ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీల్లో భారీగా నాటుసారా పట్టుబడింది. నేమాంకు చెందిన ఓ టీడీపీ నేత గత కొంతకాలంగా యథేచ్చగా నాటుసారా విక్రయిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అధికారులు సోమవారం పక్కా వ్యూహం ప్రకారం దాడి చేశారు. బలుసు తిప్ప, భైరవపాలెం నుంచి కాకినాడకు సముద్ర మార్గాన పడవల సహాయంతో రవాణా చేస్తుండగా సూర్యరావు వంతెన వద్ద అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అయితే పట్టుబడ్డ నాటుసారా బస్తాలపై టీడీపీకి చెందిన ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఫ్లెక్సీల మీద కాకినాడ రూరల్ ఎమ్మేల్యే పిల్లి అనంత లక్ష్మి దంపతులు ఫోటోలు కనిపించడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ దాడిలో స్థానిక టీడీపీ నేత బుజ్జి నాటుసారాతో పట్టుబట్టారు. గతకొంత కాలంగా నేమాంలో జోరుగా నాటుసారా వ్యాపారం జరుగుతున్నా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఎక్సైజ్ శాఖ చూస్తూ ఉండిపోయిందని స్థానికులు వాపోయారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరుడు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : నాటుసారాతో పట్టుబడ్డ టీడీపీ నేత బుజ్జి -
నాటుసారాతో పట్టుబడ్డ టీడీపీ నేత బుజ్జి
-
నాటు సార కేంద్రలపై ఎక్సైజ్ పోలీసులు దాడి
-
తాగర అన్నా.. తాగి ఊగర అన్నా..!
గిద్దలూరు: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నాటుసారా తయారు చేసి విక్రయించడం కొందరు ఉపాధిగా మార్చుకుంటున్నారు. సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతాలను సారా తయారీ కేంద్రాలుగా రూపాంతరం చెందిస్తున్నారు. బేస్తవారిపేట మండలం, కొమరోలు మండలంలోని కొన్ని గ్రామాలు, గిద్దలూరు మండలంలోని నల్లమల అడవికి సమీపంలో ఉన్న వెంకటాపురం, దూర్‌చింత్ తండా, బరుజుపల్లె తండా, కొత్తకోట, దిగువమెట్ట, ఓబులాపురం తండా, గడికోట, అంకాలమ్మపల్లె, బేస్తవారిపేట మండలం కోనపల్లె లోయలోని గ్రామాల్లోని నాటుసారా తయారీదారులు అడవిలో బట్టీలు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా నాటుసారా వ్యాపారం చేస్తున్నారు. రోజూ కొన్ని వందల లీటర్ల నాటుసారాను ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. దట్టమైన అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలను గుర్తించడం ఎక్సైజ్ అధికారులకు కష్టంగా మారింది. ఇటీవలి కాలంలో గ్రామాల్లోనూ నాటుసారా విక్రయం జోరుగా సాగుతోంది. గ్రామ చివరలో కాపలాదారులను ఉంచి అధికారుల రాకను సెల్ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుంటూ తప్పించుకుంటున్నారని తెలుస్తోంది. అడవిలోనే మకాం నాటుసారా తయారీకి అడవిలోనే రోజుల తరబడి మకాం వేస్తున్నారు. సారా తయారీకి అవసరమన తుమ్మచెక్క, బెల్లం, యూరియా అడవిలోకి చేరవేస్తున్నారు. వారికి అవసరమైన ఆహార పదార్థాలను కుండలు, క్యాన్లలో వెంట తీసుకుని వెళ్తున్నారు. నీటి వసతి ఉన్న చోట సారా బట్టీలు ఏర్పాటు చేసుకుని అక్కడే మకాం వేస్తున్నారు. సారా తయారు కాగానే క్యాన్లతో పల్లెల్లోకి వస్తున్నారు. కొందరు వ్యాపారులు రోజువారీ కూలీలను వినియోగిస్తున్నారు. సారా తయారీకి అవసరమైన సరుకును వారికి అప్పగిస్తున్నారు. కూలీలు సారా తయారు చేసేంత వరకు వారికి అవసరమైన భోజనం, కుటుంబాల అవసరాలను వారే తీరుస్తుంటారు. ఇందుకోసం కూలికి రోజుకు ఐదు వందల నుంచి రూ.వెయ్యి వరకు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కలిసొచ్చిన వివాహాల సీజన్ నెల రోజులుగా వివాహ, శుభకార్యాలు ప్రారంభం కావడంతో నాటుసారాకు గిరాకీ పెరిగింది. శుభకార్యాలకు గ్రామాల్లో ఎక్కువగా నాటుసారా వినియోగిస్తుంటారు. ఇటీవల సారాకు డిమాండ్ పెరిగింది. కొందరు కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు, కర్నాటకకు నాటుసారా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. సారా తయారీదారులు, విక్రయించేవారు అధికారులంటే భయంలేనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి నెలా ముడుపులు సమర్పించి మచ్చిక చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పుడు మాత్రమే నామమాత్రపు దాడులు నిర్వహించి బైండోవర్లు, చిన్న కేసులతో చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు, రైలు మార్గంలో ఇతర రాష్ట్రాలకు నాటుసారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పనులన్నీ రాత్రిళ్లు చక్కదిద్దుతున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి అడవుల్లో ఏర్పాటు చేసిన సారా బట్టీలను తొలగించి తమ కుటుంబాలను కాపాడాలని వివిధ గ్రామాల మహిళలు కోరుతున్నారు. దాడులు నిర్వహిస్తున్నాం ఇటీవల నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహిస్తున్నాం. అటవీ ప్రాంతాల్లో ఉన్న బట్టీలను ధ్వంసం చేసి పలువురిపై కేసులు పెట్టాం. ఎక్కడైనా నాటుసారా బట్టీలు ఉన్నట్లు మాకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం. నాటుసారాతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.– రాజేంద్రప్రసాద్, ఎస్ఐ, ఎక్సైజ్ శాఖ -
నాటుసారా స్థావరాలపై దాడులు
మల్యాల: నాటుసారా స్థావరాలపై పోలీసులు మంగళవారం ఉదయం దాడి చేసి నాటుసారాను ధ్వంసం చేశారు. కరీంనగర్ జిల్లా మల్యాల మండల కేంద్రంలోని గుట్టల సమీపంలో నాటుసారా తయారుచేస్తున్నారనే పక్కా సమాచారం మేరకు దాడిచేశారు. బూమిలో పాతిపెట్టిన డబ్బాల్లో నిల్వచేసిన సుమారు 200 లీటర్ల నాటుసారాతో పాటు, పాత్రలను ధ్వంసం చేశారు. ఈ మేరకు నాటుసారా కాస్తున్న లక్ష్మయ్యపై కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ చెప్పారు.