కరోనా: బ్లాక్‌లో మద్యం హవా | Lockdon: Liquor sales In Block At Mancherial | Sakshi
Sakshi News home page

కరోనా: బ్లాక్‌లో బెల్ట్‌ దందా

Published Thu, Apr 9 2020 11:47 AM | Last Updated on Thu, Apr 9 2020 11:47 AM

Lockdon: Liquor sales In Block At Mancherial - Sakshi

కాసిపేట మండలం దేవాపూర్‌లో పట్టుబడిన బీర్‌ కాటన్లు

సాక్షి, మంచిర్యాల: మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు గుట్టుగా బ్లాక్‌లో మద్యం దందా సాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లాక్‌డౌన్‌లో ఏకంగా వైన్సుల నుంచే అమ్మకాలు చేపడుతున్నారు. రాత్రి వేళల్లో స్టాక్‌ను బయటకు తీసి అదును చూసి విక్రయిస్తున్నారు. ఈనెల 22న జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి అన్ని వ్యాపారాలు మూత పడ్డాయి. ఇందులో భాగంగానే మద్యం దుకాణాలకు సైతం ఎక్సైజ్‌ అధికారులు తాళాలు వేసి సీల్‌ వేశారు. అయితే చాలా మంది కర్ఫ్యూ ప్రకటించగానే ఆ రోజు వరకే స్టాక్‌ బయటికి తీశారు. అదే రోజు రాష్ట్రంలో మార్చి 31వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడం, ఆ తర్వాత దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 14వరకు పొడిగించడం ప్రకటించడంతో చాలా చోట్ల వైన్సుల్లోనే సరుకు ఉండిపోయింది. (ప్రధాని మోదీ మీటింగ్‌.. వీడియో లీక్‌! )

ఇక కొందరు లాక్‌డౌన్‌ ప్రకటించడం టీవీల్లో చూసి వెంటనే అప్రమత్తమై ఉన్న స్టాక్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక కొందరు వైన్సుల నుంచే స్టాక్‌ తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జైపూర్‌లో రెండు రోజుల క్రితం ఓ వైన్సు షాపు తాళానికి వేసి ఉన్న సీల్‌ తొలగించినట్లు ఎక్సైజ్‌ అధికారుల దృష్టికి వచ్చింది. అంతేకాక గ్రామాల్లో బెల్టు షాపుల్లో ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేస్తే సరుకు పట్టుబడుతోంది. ఇదంతా వైన్సుల నుంచే సరఫరా అవుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బుధవారం కాసిపేట మండలం  దేవాపూర్‌లోని బెల్టుషాపుల్లో దాడి చేయగా మద్యం పట్టుబడింది. కొన్ని చోట్ల బ్లాక్‌లో కూడా మద్యం దొరక్కపోవడంతో వైన్సుల్లో చోరీలకు పాల్పడుతున్నారు. బుధవారం దండేపల్లి మండలం చెల్కగూడెంలోని ఓ వైన్సులో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి రూ.5వేల విలువైన మద్యం ఎత్తుకెళ్లారు. (క్యాస్టింగ్‌ కౌచ్‌: రాజీకొస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తా! )

అడ్డగోలు రేట్లకు అమ్మకం
మందుబాబుల బలహీనతను ఆసరా చేసుకుని అడ్డగోలు రేట్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి బ్రాండ్‌ సరుకును రెట్టింపు ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం. ఉదాహరణకు ఎంసీ ఫుల్‌ బాటిల్‌ ఎమ్మార్పీ రూ.560 కాగా, ప్రస్తుతం బ్లాక్‌లో రూ.1100లకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అలాగే బీరు ధర ఎమ్మార్పీ రూ.120 ఉంటే ప్రస్తుతం రూ.300 వరకు విక్రయాలు సాగిస్తున్నారు. ఇలా ప్రతి బ్రాండ్‌కు ఎమ్మార్పీతో పోల్చితే రెట్టింపుకు మించి ధరకు విక్రయాలు సాగిస్తున్నారు. ఇక కొందరు లాక్‌డౌన్‌ను ముందే ఊహించి పెద్ద ఎత్తున సరుకును రహస్య ప్రదేశాలకు తరలించారు. జనతా కర్ఫ్యూ పాటించిన రోజే లాక్‌డౌన్‌ ప్రకటించడంతో జిల్లా కేంద్రంతో పాటు అనేక షాపుల్లో ఉన్న స్టాక్‌ను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఉన్న స్టాక్‌ కూడా ఖాళీ అవుతుండడంతో ధరలు రెట్టింపు చేస్తూ వచ్చారు. లాక్‌డౌన్‌ తర్వాత రెండు, మూడు రోజులు ఎమ్మార్పీకి మించి రూ.50 నుంచి రూ.100 వరకు అధికంగా విక్రయించగా ప్రస్తుతం కొన్నిచోట్ల రెట్టింపు, మరి కొన్నిచోట్ల మూడింతల ధరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది. బయట ఎక్కడా మద్యం దొరకపోవడంతో ఎంత ధర  అయినా కొనేందుకు మద్యం ప్రియులు ఆసక్తి చూపుతుండడంతో ఈ దందా సాగుతోంది. ప్రస్తుతం వైన్సు షాపుల్లోనూ ఉన్న స్టాక్‌ దాదాపు అయిపోయినట్లే తెలుస్తోంది. ఎందుకంటే గోదాంల నుంచి మద్యం స్టాక్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఉన్న స్టాక్‌నే డిమాండ్‌ను బట్టి రహస్యంగా ఎక్కువ ధరలకు అమ్ముకునే పనిలో ఉన్నారు. (ఇదేం పని జోన్స్‌.. ట్రోల్‌ చేసిన ఆకాష్‌ )

గ్రామాల్లో గుడుంబా జోరు.. 
గుడుంబా రహిత జిల్లాగా సాగిన తర్వాత మళ్లీ లాక్‌డౌన్‌తో గ్రామాల్లో గుడుంబా తయారీ కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ప్రాణహిత తీరం వెంబడి పలు ప్రాంతాల్లో గుడుంబా తయారు చేస్తున్నారు. జిల్లాలో నెన్నెల, దండేపల్లి, కోటపల్లి, భీమారం, మందమర్రి తదితర మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్సైజ్‌ అధికారుల దాడుల్లో పెద్దఎత్తున బెల్లంపానకం, నాటు సారా పట్టుబడుతోంది. అటు మద్యం సరఫరా లేకపోవడంతో కొందరు గ్రామీణ ప్రాంతాల్లో మత్తు కోసం గుడుంబా వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం లీటరు గుడుంబా ఏడు వందల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఎంతైన ఖర్చు చేసి మత్తు కోసం జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. మద్యం షాపుల తాళాలకు వేసిన సీల్‌ తీసినా.. తాళాలు తమ వద్దనే ఉన్నట్లు ఎక్సైజ్‌ అధికారులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో నిత్యం మఫ్టీలో గుడుంబా తయారీ అరికట్టేందుకు గస్తీ చేస్తున్నామని ఎక్కడైనా మద్యం విక్రయిస్తే తమ దృష్టికి తేవాలని అబ్కారీ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు నిత్యం మద్యం సేవించే అలవాటు ఉన్నవారికి కొద్ది రోజులుగా మద్యం దొరకపోవడంతో నిర్ణీత సమయాల్లోనైనా ఆంక్షలతో మద్యం షాపులు తెరవాలనే డిమాండ్లు వస్తున్నాయని అంటున్నారు. (ఎల్లకాలం నీకు తోడుగా ఉంటా: బిగ్‌బాస్‌ రన్నరప్‌ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement