ఆకతాయిలపై లాఠీ ఝళిపిస్తున్న సీపీ సత్యనారాయణ
సాక్షి, మంచిర్యాల: రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తున్నా.. చిన్నచిన్న సాకులతో జనం బయటకు వస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్ పక్కాగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో పోలీసులు శనివారం లాఠీలకు పనిచెప్పారు. అనవసరంగా బయట తిరుగుతున్నవారిపై కొరడా ఝళిపించారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ జిల్లాలో లాక్‌డౌన్ అమలు తీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు రోడ్లపై తిరుగుతూ వాహనాలు తనిఖీ చేశారు. అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చినవారు, గల్లీల్లో గుంపులుగా ఉన్నవారిపై లాఠీ ఝళిపించారు. ఒక్క రోజులోనే జిల్లాలో 750 ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. వహనాలపై పాస్‌లు పెట్టుకుని తిరుగుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. పాస్‌లు ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు తిరగడానికి కాదని హెచ్చరించారు. పాస్‌లు అడ్డం పెట్టుకుని పదేపదే తిరుగుతుంటే పాస్‌లు రుద్ద చేస్తామని స్పష్టం చేశారు.
లాక్‌డౌన్‌ను పర్యవేక్షించిన ఏసీపీ..
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో లాక్‌డౌన్ అమలు తీరును శుక్రవారం అర్ధరాత్రి ఏసీపీ ఎంఏ.రహమాన్ పర్యవేక్షించారు. సబ్ డివిజన్ పరిధిలోని సీఐ, ఎస్సైలు, పోలీసులు కూడా మోటారు బైక్‌లపై వీధుల్లో తిరుగుతూ రోడ్లపై తిరుగుతున్నవారిని హెచ్చరించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ చేసి లాక్‌డౌన్ అమలును పర్యవేక్షించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 30 మంది యువకులపై కేసులు నమోదు చేశారు. 25 మోటారు బైక్‌లను సీజ్ చేశారు. ఏసీపీ వెంట బెల్లంపల్లి రూరల్ సీఐ కె.జగదీష్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రాజు, ఎస్సైలు, ఏఎస్సైలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment