నా పేరు శ్రీనివాస్ (పేరు మార్చాం). ఆదిలాబాద్ పట్టణంలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పట్టణంలోని విద్యార్థి కళాశాల సమీపంలోని ఓ ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ స్కూల్‌లో చదివిస్తున్నాను. లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి ఇంటిపట్టునే ఉన్నాను. ఇటీవల లాక్‌డౌన్ ఎత్తివేయడంతో ప్రస్తుతం పనులకు వెళ్తున్నాను. అయితే ఆన్‌లైన్ క్లాసుల పేరిట ఫీజులు చెల్లించాలని పాఠశాల యాజమాన్యం మెస్సేజ్‌లు పంపుతోంది. ఆలస్యమైనందుకు రూ.60 చొప్పున ఫెనాల్టీ చెల్లించాలట. లేదంటే అడ్మిషన్‌ను రద్దు చేస్తామని భయపెడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే మా పిల్లల్ని పాఠశాలలో ఉంచుతారో.. లేదోనన్న భయం. చాలా మందిది ఇదే పరిస్థితి.
సాక్షి, ఆదిలాబాద్: కరోనాతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మార్చి నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే కొంతమంది చిరు వ్యాపారాలు చేస్తుండటం, మరికొంత మంది కూలీ పనులకు వెళ్లిన విషయం విదితమే. అయితే ఆ సమయంలో విద్యాసంస్థలు బంద్ పాటించగా ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చెప్పని చదువులకు సైతం ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబాలను పోషించేందుకు అష్టకష్టాలు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఫీజులు ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఈ నెల 1 నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా విద్యాబోధన సాగుతోంది. ఇదివరకే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్ ద్వారా విద్యాబోధన చేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు ఇంకా ఆన్‌లైన్ చదువులు ప్రారంభించలేదు. గత మార్చి నుంచి ఆగస్టు వరకు ఫీజు చెల్లించాలని, ఆలస్యమైనందుకు ఫెనాల్టీతో సహా ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా బాగున్న వారు ఈ ఫీజులు చెల్లిస్తుండగా, ప్రైవేట్ ఉద్యోగులు, కూలీనాలి చేసేవారు ఫీజులు ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెప్పని చదువుకు ఫీజు
లాక్‌డౌన్ సమయంలో మార్చి 15 నుంచే పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వం విద్యార్థులందరిని అప్‌గ్రేడ్ చేస్తూ పైతరగతులకు పంపించింది. జిల్లాలో వందకుపైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా. కొన్ని పాఠశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థలు మే నుంచి ఆగస్టు వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాయి. మరికొన్ని ఎలాంటి తరగతులు నిర్వహించలేదు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ తరగతులు నిర్వహించవద్దని విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోకుండా ఈ తతంగం నడిపారు. ఆన్‌లైన్ తరగతుల ఫీజుల పేరిట వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆ ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసిన టీచర్లకు కూడా వేతనాలు ఇవ్వని యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. రెండు నెలల నుంచి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్‌లకు మెస్సేజ్‌లు పంపిస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం
జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు ఏమాత్రం పాటించకపోయినా ఫీజు జులుం మాత్రం మానడం లేదు. నిబంధనల ప్రకారం పాఠశాలలకు క్రీడా మైదానం, లైబ్రరీ, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, ఫైర్ అనుమతి, తదితర సౌకర్యాలు ఉండాలి. దీనికి తోడు పాఠశాలల్లోనే షూలు, బెల్టులు, యూనిఫాం, నోటుబుక్‌లు, పాఠ్యపుస్తకాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేయవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించవద్దని ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కారు. వీరి ఇబ్బందులతో తల్లిదండ్రులు నానా తంటాలు పడుతున్నారు.
పెనాల్టీ చెల్లించాలి
నెలనెలా ఫీజులు చెల్లించకపోతే జీఓ ప్రకారం ఫెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. మా యాజమాన్యం ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్‌లకు మెస్సేజ్‌లు పంపించాం. ఏవైన ఇబ్బందులు ఉంటే మమ్మల్ని పాఠశాలలో సంప్రదించాలి. వి ద్యార్థుల తల్లిదండ్రులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయడం లేదు. ఇది వరకు ఫీజులు అడగలేదు కాని, ప్రస్తుతం ఫీజులు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. -ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్
మెమో జారీ చేస్తాం
ఆ పాఠశాల యాజమాన్యానికి మెమో జారీ చేస్తాం. ఫెనాల్టీ ద్వారా ఫీజులు వసూలు చేస్తే సహించేది లేదు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయండి. – ఎ.రవీందర్ రెడ్డి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment