షాపింగ్..ఫుడ్ ఆర్డర్..టికెట్ బుకింగ్..ఇలా అన్నీ ఆన్‌లైన్ అయిపోయాయి. ఇపుడు ఈ కోవలోకి క్లాసెస్ కూడా వచ్చిచేరాయి. కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడే పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం లేకపోవడంతో పాఠశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాయి. అయితే ఈ ఆన్‌లైన్ చదువుల వల్ల విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఓ సర్వేలో తేలింది. అనేకమంది వెన్ను, కంటి, నిద్రలేమి తదితర సమస్యలతో బాధపడుతున్నారని వెల్లడైంది.
సాక్షి, సిటీబ్యూరో: కరోనా నేపథ్యంలో నగరంలోని కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు తమ విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు బోధిస్తున్నాయి. ఆన్‌లైన్ చదువుల పేరుతో కంప్యూటర్లు, ఇతర గాడ్జెట్లపై పిల్లలు గంటల తరబడి పని చేస్తున్న సమయంలో ఎర్గోనామిక్స్ (సౌకర్యవంతమైన స్థితి)పై తల్లిదండ్రులకు ఏ మేరకు అవగాహన ఉందనే అంశంపై ప్రొఫెసర్ భక్తీయార్ చౌదరి, అషద్ భక్తియార్ చౌదరి, సహేరా జమాల్, సనాజమాల్‌లు ఇటీవల ఓ ఆన్‌లైన్ సర్వే నిర్వహించారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ముందు పిల్లలు కూర్చొనే స్థితి? వ్యవధి?నేలపై కాళ్లను తాకించి కూర్చొనే స్థితి? కీబోర్డు, మౌస్‌ల స్థితి, పని చేసే సమయంలో మధ్యలో తీసుకునే విరామం వంటి అంశాలపై ప్రశ్నావళిని రూపొందించి 10 నుంచి 17 ఏళ్లలోపు వయసుగల 186 మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించగా విస్తుగొలిపే వాస్తవాలు బయటికి వచ్చాయి. సరైన భంగిమలో పిల్లలు కూర్చోకపోవడం వల్ల వారికి రిపిటేటీవ్ స్ట్రెయిన్ ఇంజురీ(ఆర్‌ఎస్‌ఐ), క్యుములేటివ్ ట్రామా డిజార్డర్స్(సీటీడీ), మస్కులో స్కెలిటల్ డిజార్డర్స్(ఎంఎస్‌డీ) వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది. స్కూళ్లు, టీచర్లు ఎర్గోనామిక్స్‌పై ఎప్పుడూ చెప్పలేదు. వారికి అసలు ఆ విషయంపై అవగాహన కూడా లేదని స్పష్టమైంది. సరైన స్థిలిలో కూర్చొవడంపై 6 శాతం మందికి, ఐ–మానిటర్ ఎర్గోనామిక్స్‌పై 1 శాతం మందికే అవగాహన ఉన్నట్లు తేలింది.
వింటున్నది 45 శాతం మంది మాత్రమే
తెలంగాణ వ్యాప్తంగా 10, 547 పాఠశాలలు ఉండగా, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ 2500 వరకు ఉన్నాయి. వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6500 స్కూళ్లు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 31 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా.. నగరంలోనే 15 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 90 శాతం కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి. మొత్తం విద్యార్థుల్లో 40 శాతం మంది ఈ స్కూళ్లలోనే చదువుతుంటారు. ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్న ఆయా స్కూళ్ల పిల్లల్లో 45 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌లో పాఠాలు వింటున్నారు.
కంటినిండా నిద్ర కరువు
కూర్చొనే భంగిమపై వీరికి సరైన అవగాహన లేకపోవడంతో 21 శాతం మంది వెన్నముక పై భాగంలో నొప్పితో బాధపడుతుంటే...మరో 18 శాతం మంది వెన్నెముక కింది భాగంలో నొప్పిని ఎదుర్కొంటున్నారు. 13 శాతం మంది కళ్లు పొడిబారడం, ఎర్రబడటం, నొప్పిని ఎదుర్కొంటున్నారు. 11 శాతం మంది పిల్లలు తలనొప్పితో బాధపడుతూ కనీసం కంటినిండా నిద్రకూడా పోవడం లేదు. 6 శాతం మంది అనవసరంగా కోపానికి గురవుతున్నారు. ఆన్‌లైన్ పాఠాలు పేరుతో గాడ్జెట్లను వినియోగిస్తున్న పిల్లల్లో 35 శాతం మంది గేమ్స్, వినోద అంశాలను వీక్షిస్తున్నారు. 20 శాతం మంది ఇతర అంశాలను వీక్షిస్తున్నట్లు తేలింది.
ఇదో కొత్త వ్యాపారం
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో స్కూళ్ల రీ ఓపెన్‌పై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పునఃప్రారంభం అవుతాయా? లేదా అనే అంశంపై కూడా స్పష్టత లేదు. కానీ నగరంలోకి పలు కార్పొరేట్ స్కూళ్లు ఇప్పటికే అడ్మిషన్లను పూర్తి చేశాయి. అనధికారికంగా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నాయి. ఆన్‌లైన్ చదువుల పేరుతో కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్‌లు కొనుగోలు చేయిస్తున్నారు. నోట్‌బుక్స్, ఇతర పుస్తకాలు, స్టేషనరీ వస్తు వులను స్కూళ్లలోనే విక్రయిస్తున్నారు. పిల్లలు కంప్యూటర్ల ముందు కూర్చొని ఆన్‌లైన్‌లో పాఠాలు వినాలంటే డ్రస్‌కోడ్ మస్ట్ చేశాయి. అధికారికంగా స్కూళ్లు పునఃప్రారంభం కాక ముందే ఫస్ట్‌టర్మ్ ఫీజులు చెల్లించాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఫీజు చెల్లించని పిల్లలకు ఆన్‌లైన్ కనెక్షన్ కట్ చేస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల గత మూడు నెలల నుంచి ఉపాధి అవకాశాలు లేవు. అప్పుడే ఫీజులు చెల్లించాలంటే ఎక్కడి నుంచి తెస్తామని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
అవగాహన కల్పించాలి
అధిక కాంతి కళ్లు త్వరగా అలిసిపోవడానికి కారణమవుతాయి. తలనొప్పి వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే మయోపియాకు దారి తీస్తుంది. ఎక్కువ కాలం లాక్‌డౌన్ వల్ల విసుగు, కోపంతో పాటు గాడ్జెట్ల నుంచి వెలువడే మైక్రోవేవ్ రేడియోషన్‌లు తలనొప్పి, నిద్రలేమి, చికాకు, కోపానికి కారణమవుతాయి. ఎర్గోనామిక్స్, వర్క్‌ప్లేస్ మేనేజ్‌మెంట్లను పాఠ్యాంశాల్లో చేర్చి....వాటి ముందు కూర్చొనే విధానంపై అవగాహన కల్పించడం ద్వారా పిల్లలను అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. – ప్రొఫెసర్ భక్తియార్ చౌదరి
Comments
Please login to add a commentAdd a comment