పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్‌ఈబీ స్వాధీనం చేసుకున్న నాటుసారా, బెల్లం ఊట (ఫైల్)
సాక్షి, అమరావతి: ‘సాక్షి’ వరుస కథనాలతో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ‘కాటు సారా’, ‘హద్దులు లేవు–అక్రమాలకు కేరఫ్ ఆంధ్రా ఒడిశా బోర్డర్’ నిఘా కథనాలను వెలుగులోకి తేవడంతో ఎస్‌ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ స్పందించి రాష్ట్రంలో నాటుసారా తయారీ కేంద్రాలను నిర్మూలించేలా అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా నాటు సారా కేంద్రాలపై విస్తృత దాడులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌ఈబీ డైరెక్టర్ పీహెచ్‌డీ రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు.
► గత రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 202 కేసులు నమోదు చేశారు. 2,141.8 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సారా తరలించేందుకు వినియోగించిన 16 వాహనాలను సీజ్ చేశారు.
► సారా తయారీ కేంద్రాల వద్ద 88,065 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.
► ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 788 లీటర్ల సారా, 41,500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక సారా తయారీ కేంద్రాలు ఇక్కడి ఏజెన్సీ, గోదావరి లంకలు, కోరంగి మడ అడవుల్లో ఉండటంతో ఎస్‌ఈబీ ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆ తర్వాత పశ్చిమ గోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్‌ఈబీ కొరడా ఝుళిపించింది.
Comments
Please login to add a commentAdd a comment