నల్లమల అటవీప్రాంతంలో మంటలు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ డివిజన్‌లోని నల్లమల అడవిలో శనివారం రెండుచోట్ల మంటలు లేచాయి. నాగార్జునసాగర్‌కు 10 కిలో మీటర్ల దూరంలోని సమ్మక్క-సారక్క అటవీప్రాంతంలో మంటలు చెలరేగాయి. జాతరకు వచ్చినవారు గమనించి సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు స్ట్రైకింగ్‌ఫోర్స్‌ను పంపి మంటల నార్పించారు. కొద్దిసేపటి తర్వాత సాగర్‌కు ఐదుకిలోమీటర్ల దూరంలో గల మూలతండా, నెల్లికల్లు, శివం హోట ల్‌కు కొంతదూరంలో అడవిలో మంటలు లేచాయి.
ఆయా ప్రాంతాల వారు అధికారులకు సమాచారమివ్వడంతో వెంటనే స్ట్రైకింగ్‌ఫోర్సును తరలించారు. వేసవికావడం.. చెట్లన్నీ ఆకులురాల్చడంతోపాటు గడ్డి ఎండిపోయి ఉండటంతో ఉవ్వెత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. గంటసేపట్లో మంటలను అదుపులోకి తెచ్చారు. 20 ఎకరాల మేర అటవీ ప్రాంతం అగ్నికిఆహుతి అయ్యింది. అడవికి దగ్గరలో ఉన్న చేలలో రైతులు మంటలు పెట్టినప్పుడు వాటిని ఆర్పకుండా వదిలేస్తున్నారని ఫారెస్ట్ రేంజర్ భవానీశంకర్ అన్నారు. దీంతో అడవిలో తరచూ మంటలు వ్యాపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.