సాక్షి, పెద్దదోర్నాల : అరుదైన పంగోలిన్ జాతి జంతువు అలుగును విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అటవీశాఖ అధికారులు పట్టుకొని జంతువును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పెద్దదోర్నాలలో బుధవారం చోటుచేసుకుంది. పెద్దదోర్నాల మండల పరిధిలోని కడపరాజుపల్లెకు చెందిన కర్రావుల పెద్దిరాజులు మంగళవారం రాత్రి నల్లమల అటవీ ప్రాంతంలో అలుగును పట్టుకున్నాడు. వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో అంతరించి పోయే జంతువుల జాబితాలో ఉన్న అలుగును రహస్యంగా విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. బుధవారం మధ్యాహ్నం మార్కాపురం పరిసర ప్రాంతంలో అలుగును విక్రయించే ప్రయత్నం చేస్తున్నట్టు గుర్తించి, కొనుగోలుదారులుగా అక్కడికి వెళ్లిన అధికారులు అలుగుతో సహా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
విదేశాల్లో అలుగుకు డిమాండ్..
సాధారణంగా మెత్తటి ఇసుక నెలల్లో బొరియలు చేసుకొని చీకటి వేళల్లో సంచరించే జంతువు అలుగు. ఇది ఎక్కువగా చీమలు, చెదుపురుగులు, చిన్న కీటకాలు తిని జీవిస్తాయి. ఇది సాధారణంగా 10 నుండి 16 కేజీల బరువు వుండి, శరీరంపై 160 నుంచి 200 పొలుసులు కలిగి ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒక పిల్లను పెట్టి పాలిచ్చి సాకుతుంది. వీటికి ఇతర దేశలలో డిమాండ్ ఉండటం వలన ఎక్కువ రేటు పలుకుతుంది. దీని పొలుసులను చైనా దేశంలో సంప్రదాయ వైద్యంలో లైంగిక పటుత్వం కోసం, ఆభరణాలు తయారీలో వాడుతారు. దీని చర్మం బూట్లు, చెప్పుల తయారీలో వాడుతారు. ఈ కారణంగా వీటిని పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేయటం వలన అవి వేగంగా అంతరించి పోయే దశలో ఉన్నాయి. దీనిని వేటాడితే వన్యప్రాణల సంరక్షణ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment