huge theft
-
న్యాల్కల్ రోడ్డులో భారీ చోరీ
నిజామాబాద్‌అర్బన్: న్యాల్కల్ రోడ్డులోని లలితానగర్‌లో సోమవారం ఓ ఇంట్లో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఇంటి యాజమని తిమ్మయ్య, లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి వేళ ఆరుగురు దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. ఇద్దరు దొంగలు లక్ష్మి వద్ద, నలుగురు దొంగలు తిమ్మయ్య వద్దకు వచ్చి కత్తులతో బెదిరించారు. ఇంట్లో బీరువా తాళాలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని భయపెట్టారు. గత్యంతరం లేక వారు దొంగలకు తాళాలు ఇచ్చారు. దీంతో దొంగలు ఇంట్లోని 16 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 50 వేల నగదు దోచుకెళ్లారు. పిల్లల వద్ద ఉన్న బంగారం చైన్ ఇవ్వకపోతే తిమ్మయ్యపై దుప్పటి వేసి కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో వారు కూడా బంగారు చైన్లు ఇచ్చేశారు. దొంగలు పారిపోతూ ఇంట్లోని వారిని గదిలో బంధించి వెళ్లిపోయారు. అనంతరం కిటిలో నుంచి చుట్టుపక్కల వారిని పిలిచి గది తలుపులు తీయించుకున్నట్లు వారు తెలిపారు. వారు వెంటనే 5 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని ఇంటిని పరిశీలించారు. అనంతరం సీపీ కార్తికేయ, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ఎస్సై జానరెడ్డిలు కూడా ఇంటిని పరిశీలించారు. దొంగలు డ్రాయర్లు, బనియన్లు ధరించి ఉన్నారని ఇంటివారు పోలీసులకు వివరించారు. ఇది మహారాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చేపడుతున్నారు. -
ఒంగోలులో భారీ చోరీ
సాక్షి, ఒంగోలు : నగరంలోని లాయరుపేట అడపా బ్యారన్ల వద్ద ఉన్న ఓ ఇంట్లో భారీ దొంగతనం వెలుగు చూసింది. ఆ నివాసం విద్యుత్ శాఖ మంత్రి బాలినేని ఇంటి అత్యంత సమీపంలోనిది కావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అడపా హరనాథబాబు ఇంట్లో చోరీ ఘటన సోమవారం రాత్రి వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హరనాథబాబుకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె, అల్లుడు తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయట హాలులో లైటు వేసి కుమార్తెను ఇంటికి తీసుకొచ్చేందుకు తిరుపతి వెళ్లాడు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న ఆయన కుమార్తె సైడ్ డోర్ నుంచి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అక్కడ తలుపు తెరిచి ఉండటంతో తండ్రికి చెప్పింది. దిగువ భాగంలో ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించి దొంగతనం జరిగిందని గుర్తించాడు. ఇల్లు డూప్లెక్స్ కావడంతో పైభాగంలోకి వెళ్లి పరిశీలించగా అక్కడ దేవుడి గూటితో పాటు కప్‌బోర్డులో దాచుకున్న ఆభరణాలు, సొత్తు చోరీకి గురైనట్లు స్పష్టమైంది. తన భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలకు చెందిన సుమారు 150 సవర్ల బంగారం మాయమైందని పేర్కొన్నాడు. మరో వైపు 8 కేజీల వెండి వస్తువులు, రూ.3 లక్షల నగదు చోరీకి గురైనట్లు చెబుతున్నాడు. మొత్తంగా చోరీ సొత్తు రూ.52 లక్షలు ఉండొచ్చని అంచనా వేశారు. ఎన్నికలకు ముందు స్థానిక కబాడీపాలెంలో జరిగిన దొంగతనం తర్వాత ఇదే అత్యంత భారీ దొంగతనంగా తెలుస్తోంది. చోరీ జరిగిన ఇంటికి సమీపంలో మంత్రి బాలినేని నివాసంతో పాటు మరి కొందరు పోలీసుల ఇళ్లు కూడా ఆ సమీపంలోనే ఉండటం గమనార్హం. -
ఘజియాబాద్‌లో ఘరానా దోపిడీ
► యూపీలోని ఓ బ్యాంకులో భారీ చోరీ ► 30 లాకర్లలోని ఆభరణాలు మాయం ► బ్యాంకు గోడకు రెండు అడుగుల మేర కన్నం ► నగదును మాత్రం ముట్టుకోకుండా వదిలేసిన వైనం ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ఓ బ్యాంకులో జరిగిన భారీ దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగలు బ్యాంకుకు కన్నం వేసి ఏకంగా 30 లాకర్లలోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. పోయిన వస్తువుల మొత్తం విలువ ఎంత అనేది స్పష్టంగా తెలీదు. ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్, మోదీనగర్ శాఖలో గత వారాంతంలో ఈ చోరీ జరిగింది. సోమవారం బ్యాంకుకు సిబ్బంది వచ్చిన వెంటనే దొంగతనాన్ని గుర్తించారు. 58వ జాతీయ రహదారిపై ఉన్న బ్యాంకుకు వెనుకవైపున మూతబడిన రబ్బరు ఫ్యాక్టరీలోని ఓ గదికి, బ్యాంకు స్ట్రాంగ్‌రూమ్‌కు ఉమ్మడి గోడ ఉంది. 9 అంగుళాల మందమైన గోడను పగులగొడితే బ్యాంకు స్ట్రాంగ్‌రూమ్‌లోకి ప్రవేశించవచ్చు. దొంగలు సరిగ్గా ఇలానే చేశారు. గోడకు దాదాపు ఆరు అడుగుల ఎత్తులో రెండు అడుగుల వెడల్పుతో సరిగ్గా అవతలివైపు లాకర్ల పైకి వచ్చేలా రంధ్రం చేసి బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకులో మొత్తం 435 లాకర్లు ఉండగా ప్రస్తుతం 96 వాడుకలోలేవు. మిగిలిన వాటిలో 30 లాకర్లను తెరిచిన దొంగలు వాటిలోని ఆభరణాలు, విలువైన పత్రాలను ఎత్తుకెళ్లిపోయారు. మరికొన్ని లాకర్లను కూడా తెరిచేందుకు విఫలయత్నం చేసినట్లు అక్కడి పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. బ్యాంకులో అలారం కూడా ఉన్నప్పటికీ, సెక్యూరిటీ గార్డు ఎవరూ లేరు. దీంతో దొంగలుపడినప్పుడు అలారం మోగినా, దానిని పట్టించుకునేవారెవరూ లేకుండా పోయారు. సీసీటీవీ కెమెరా కూడా ఉంది. ఆభరణాలతోపాటు దొంగలు ఓ తుపాకీని కూడా ఎత్తుకెళ్లారు. దొంగలు కరెన్సీ నోట్లను మాత్రం ముట్టుకోకపోవడం గమనార్హం. దొంగతనాన్ని గుర్తించిన వెంటనే బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీనియర్ పోలీసు అధికారులు ఫోరెన్సిక్ బృందం, జాగిలాలతో బ్యాంకుకు చేరుకుని, పరిశీలించి ఆధారాలను సేకరించారు. -
పెళ్లికెళ్లారు.. ఇల్లు గుల్ల చేశారు
29 సవర్ల బంగారు అభరణాలు, రూ. 75 వేలు నగదు చోరీ సూళ్లూరుపేట : కుటుంబ సభ్యులందరూ బంధువుల పెళ్లికెళ్లగా గుర్తుతెలియని దుండగులు ఇల్లు గుల్ల చేశారు. ఈ సంఘటన పట్టణంలోని ఝాన్సీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగింది. సేకరించిన సమాచారం మేరకు.. చిత్తూరుజిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకంకు చెందిన కారికాటి జయకృష్ణ శ్రీరామ్‌చిట్స్ కంపెనీలో కావలిలో పనిచేస్తూ సూళ్లూరుపేటలోని ఝాన్సీనగర్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఆయన విధులు నిమిత్తం మంగళవారం కావలికి వెళ్లాడు. బుధవారం రాత్రి తన అక్క కుమార్తె వివాహం కావడంతో భార్య స్వప్నకుమారి ఇద్దరి పిల్లలను తీసుకుని తలుపులకు తాళం వేసి పక్కింట్లో ఇచ్చి కారిపాకం వెళ్లింది. బుధవారం ఉదయాన్ని తలుపు తీసేసి ఉండడాన్ని పక్కింటి వారు చూసి జయకృష్ణ, స్వప్నకుమారికి సమాచారం అందించారు. వారు వెంటనే స్థానిక సీఐ విజయకృష్ణకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి పరిశీలించి వేలిముద్రలను నిపుణులను రప్పించి బీరువా, తలుపులు మీద వేలిముద్రలను తీసుకున్నారు. సంఘటనా స్థలంలో తలుపునకు వేసిన తాళం పిట్టగోడ మీద ఉంది. చిన్నపాటి గడ్డపార కూడా అక్కడే కనిపించింది. అయితే గడ్డపారతో తలుపులు పగులగొట్టిన దాఖలాలు కనిపించలేదు. బీరువాను పగులగొట్టిన ఆనవాళ్లు కనిపించలేదు. తలుపునకు వేసిన తాళం తీసి బెడ్ కింద ఉన్న బీరువా తాళం తీసి అందులో ఉన్న 29 సవర్ల బంగారు ఆభరణాలు, కట్నం కోసం తెచ్చిపెట్టిన రూ.75 వేల నగదు మాత్రమే చోరీకి గురైంది. బంగారు ఆభరణాలు, నగదు తప్ప అందులో ఉన్న వెండి వస్తువులను తాకలేదు. చోరీ జరిగిన ఇంటిని, పరిసర ప్రాంతాలను ఐడీ పార్టీ సిబ్బంది శ్రీనివాసులురెడ్డి, మునీర్‌బాషా పరిశీలించారు. అయితే గుర్తు ðlలియని దొంగలు వేసుకుని వచ్చిన చెప్పులు మిద్దెపైన వదిలి వెళ్లడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. గడ్డపారను కూడా స్వాధీనం చేసుకుని బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని సీఐ విజయకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. -
బిక్కవోలులో భారీ చోరీ
రాజమండ్రి: పెళ్లికి వెళ్లి వచ్చే సరికి ఇంటిని గుల్ల చేసిన సంఘటన రాజమండ్రి పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. బిక్కవోలు మండలం పొంకుదురు గ్రామానికి చెందిన పి.వీర్రాఘవులు కుటుంబం బంధువుల పెళ్లికి వెళ్లడంతో ఇదే అదునుగా దొంగలు తెగబడ్డారు. ఇంట్లో ఉన్న 50 తులాల బంగారం రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం పెళ్లి నుంచి తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళం తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రవింద్రనాథ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కుక్కలను చంపి.. కారం చల్లి..
గుంతకల్లు రూరల్, న్యూస్‌లైన్ : గుంతకల్లులో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. వీధి కుక్కలకు విషం పెట్టిన దుండగలు.. చోరీ చేసిన ఇంట్లో ఆనవాళ్లు లభ్యం కాకుండా కారం పొడి చల్లారు. గుంతకల్లు రైల్వే జిల్లా ఎస్పీ కార్యాలయానికి వంద అడుగుల దూరంలోని వివేకానందనగర్ (వీవీ నగర్) రైల్వే క్వార్టర్స్‌లో జరిగిన ఈ ఘటనలో 30 తులాల బంగారం, కిలో వెండి, రూ.22 వేల నగదు చోరీ అయ్యాయి. బాధితులు, పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కసాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వీవీ నగర్ రైల్వే క్వార్టర్స్‌లో గుంతకల్లు డీజిల్ షెడ్లో పని చేస్తున్న బీఏ నాగరాజు నివాసం ఉంటున్నారు. తన సమీప బంధువు అనారోగ్యంగా ఉండడంతో చూసేందుకు ఈనెల 2న బెంగళూరుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఆదివారం ఇంటి తలుపులు తెరచి ఉండడం.. సమీపంలో మూడు వీధి కుక్కలు చనిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే రైల్వే ఉన్నతాధికారులకు తెలియజేయగా వారు నాగరాజుకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఇక్కడికి చేరుకున్న నాగరాజు.. ఇంట్లోకి వెళ్లిచూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇళ్లంతా కారం పొడి చల్లి ఉండడాన్ని గుర్తించి బెడ్రూంలోకి వెళ్లారు. రెండు బీరువాలను పగులగొట్టిన దుండగులు అందులోని 30 తులాల బంగారు నగలు, కిలో వెండి సామగ్రి, రూ.22 వేల నగదు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా దుండగులు పక్కా ప్రణాళికతో చోరీ చేసినట్లు స్పష్టమవుతోంది. రాత్రి వేళ వీధి కుక్కలు అరవకుండా ఉండేందుకు విషప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఆహారంలో విషం కలిపి కాలనీలో వేయడంతో అవి తిని చనిపోయాక గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేసినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. పైగా ఇంట్లో ఆధారాలు లేకుండా ఉండేందుకు కారం పొడి చల్లినట్లు తెలుస్తోంది. కాగా, శనివారం రాత్రి రైల్వే క్వార్టర్స్‌లో పోలీసులు గస్తీ నిర్వహించలేదని స్థానికులు చెబుతున్నారు. సివిల్ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. క్లూస్ టీం సిబ్బంది, కసాపురం ఎస్ఐ వెంకటరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.