కుక్కలను చంపి.. కారం చల్లి.. | huge theft of Guntakal | Sakshi
Sakshi News home page

కుక్కలను చంపి.. కారం చల్లి..

Published Mon, Apr 7 2014 2:43 AM | Last Updated on Tue, Oct 2 2018 3:16 PM

huge theft of Guntakal

 గుంతకల్లు రూరల్, న్యూస్‌లైన్ : గుంతకల్లులో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. వీధి కుక్కలకు విషం పెట్టిన దుండగలు.. చోరీ చేసిన ఇంట్లో ఆనవాళ్లు లభ్యం కాకుండా కారం పొడి చల్లారు. గుంతకల్లు రైల్వే జిల్లా ఎస్పీ కార్యాలయానికి వంద అడుగుల దూరంలోని వివేకానందనగర్ (వీవీ నగర్) రైల్వే క్వార్టర్స్‌లో జరిగిన ఈ ఘటనలో 30 తులాల బంగారం, కిలో వెండి, రూ.22 వేల నగదు చోరీ అయ్యాయి. బాధితులు, పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

 కసాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వీవీ నగర్ రైల్వే క్వార్టర్స్‌లో గుంతకల్లు డీజిల్ షెడ్‌లో పని చేస్తున్న బీఏ నాగరాజు నివాసం ఉంటున్నారు. తన సమీప బంధువు అనారోగ్యంగా ఉండడంతో చూసేందుకు ఈనెల 2న బెంగళూరుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఆదివారం ఇంటి తలుపులు తెరచి ఉండడం.. సమీపంలో మూడు వీధి కుక్కలు చనిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే రైల్వే ఉన్నతాధికారులకు తెలియజేయగా వారు నాగరాజుకు సమాచారమిచ్చారు.

 హుటాహుటిన ఇక్కడికి చేరుకున్న నాగరాజు.. ఇంట్లోకి వెళ్లిచూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇళ్లంతా కారం పొడి చల్లి ఉండడాన్ని గుర్తించి బెడ్‌రూంలోకి వెళ్లారు. రెండు బీరువాలను పగులగొట్టిన దుండగులు అందులోని 30 తులాల బంగారు నగలు, కిలో వెండి సామగ్రి, రూ.22 వేల నగదు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా దుండగులు పక్కా ప్రణాళికతో చోరీ చేసినట్లు స్పష్టమవుతోంది.

రాత్రి వేళ వీధి కుక్కలు అరవకుండా ఉండేందుకు విషప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఆహారంలో విషం కలిపి కాలనీలో వేయడంతో అవి తిని చనిపోయాక గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేసినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. పైగా ఇంట్లో ఆధారాలు లేకుండా ఉండేందుకు కారం పొడి చల్లినట్లు తెలుస్తోంది. కాగా, శనివారం రాత్రి రైల్వే క్వార్టర్స్‌లో పోలీసులు గస్తీ నిర్వహించలేదని స్థానికులు చెబుతున్నారు. సివిల్ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. క్లూస్ టీం సిబ్బంది, కసాపురం ఎస్‌ఐ వెంకటరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement