ఒంగోలులో భారీ చోరీ | A Huge Theft In A House Ongole | Sakshi
Sakshi News home page

ఒంగోలులో భారీ చోరీ

Jun 18 2019 11:01 AM | Updated on Jun 18 2019 11:05 AM

A Huge Theft In A House Ongole - Sakshi

సాక్షి, ఒంగోలు :  నగరంలోని లాయరుపేట అడపా బ్యారన్‌ల వద్ద ఉన్న ఓ ఇంట్లో భారీ దొంగతనం వెలుగు చూసింది. ఆ నివాసం విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని ఇంటి అత్యంత సమీపంలోనిది కావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అడపా హరనాథబాబు ఇంట్లో చోరీ ఘటన సోమవారం రాత్రి వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హరనాథబాబుకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె, అల్లుడు తిరుపతిలో నివాసం ఉంటున్నారు.

ఆదివారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయట హాలులో లైటు వేసి కుమార్తెను ఇంటికి తీసుకొచ్చేందుకు తిరుపతి వెళ్లాడు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న ఆయన కుమార్తె సైడ్‌ డోర్‌ నుంచి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అక్కడ తలుపు తెరిచి ఉండటంతో తండ్రికి చెప్పింది. దిగువ భాగంలో ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించి దొంగతనం జరిగిందని గుర్తించాడు. ఇల్లు డూప్లెక్స్‌ కావడంతో పైభాగంలోకి వెళ్లి పరిశీలించగా అక్కడ దేవుడి గూటితో పాటు కప్‌బోర్డులో దాచుకున్న ఆభరణాలు, సొత్తు చోరీకి గురైనట్లు స్పష్టమైంది. తన భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలకు చెందిన సుమారు 150 సవర్ల  బంగారం మాయమైందని పేర్కొన్నాడు.

మరో వైపు 8 కేజీల వెండి వస్తువులు, రూ.3 లక్షల నగదు చోరీకి గురైనట్లు చెబుతున్నాడు. మొత్తంగా చోరీ సొత్తు రూ.52 లక్షలు ఉండొచ్చని అంచనా వేశారు. ఎన్నికలకు ముందు స్థానిక కబాడీపాలెంలో జరిగిన దొంగతనం తర్వాత ఇదే అత్యంత భారీ దొంగతనంగా తెలుస్తోంది. చోరీ జరిగిన ఇంటికి సమీపంలో మంత్రి బాలినేని నివాసంతో పాటు మరి కొందరు పోలీసుల ఇళ్లు కూడా ఆ సమీపంలోనే ఉండటం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement