ఘజియాబాద్‌లో ఘరానా దోపిడీ
► యూపీలోని ఓ బ్యాంకులో భారీ చోరీ
► 30 లాకర్లలోని ఆభరణాలు మాయం
► బ్యాంకు గోడకు రెండు అడుగుల మేర కన్నం
► నగదును మాత్రం ముట్టుకోకుండా వదిలేసిన వైనం
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ఓ బ్యాంకులో జరిగిన భారీ దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగలు బ్యాంకుకు కన్నం వేసి ఏకంగా 30 లాకర్లలోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. పోయిన వస్తువుల మొత్తం విలువ ఎంత అనేది స్పష్టంగా తెలీదు. ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్, మోదీనగర్ శాఖలో గత వారాంతంలో ఈ చోరీ జరిగింది.
సోమవారం బ్యాంకుకు సిబ్బంది వచ్చిన వెంటనే దొంగతనాన్ని గుర్తించారు. 58వ జాతీయ రహదారిపై ఉన్న బ్యాంకుకు వెనుకవైపున మూతబడిన రబ్బరు ఫ్యాక్టరీలోని ఓ గదికి, బ్యాంకు స్ట్రాంగ్‌రూమ్‌కు ఉమ్మడి గోడ ఉంది. 9 అంగుళాల మందమైన గోడను పగులగొడితే బ్యాంకు స్ట్రాంగ్‌రూమ్‌లోకి ప్రవేశించవచ్చు. దొంగలు సరిగ్గా ఇలానే చేశారు. గోడకు దాదాపు ఆరు అడుగుల ఎత్తులో రెండు అడుగుల వెడల్పుతో సరిగ్గా అవతలివైపు లాకర్ల పైకి వచ్చేలా రంధ్రం చేసి బ్యాంకులోకి ప్రవేశించారు.
బ్యాంకులో మొత్తం 435 లాకర్లు ఉండగా ప్రస్తుతం 96 వాడుకలోలేవు. మిగిలిన వాటిలో 30 లాకర్లను తెరిచిన దొంగలు వాటిలోని ఆభరణాలు, విలువైన పత్రాలను ఎత్తుకెళ్లిపోయారు. మరికొన్ని లాకర్లను కూడా తెరిచేందుకు విఫలయత్నం చేసినట్లు అక్కడి పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. బ్యాంకులో అలారం కూడా ఉన్నప్పటికీ, సెక్యూరిటీ గార్డు ఎవరూ లేరు. దీంతో దొంగలుపడినప్పుడు అలారం మోగినా, దానిని పట్టించుకునేవారెవరూ లేకుండా పోయారు. సీసీటీవీ కెమెరా కూడా ఉంది. ఆభరణాలతోపాటు దొంగలు ఓ తుపాకీని కూడా ఎత్తుకెళ్లారు. దొంగలు కరెన్సీ నోట్లను మాత్రం ముట్టుకోకపోవడం గమనార్హం. దొంగతనాన్ని గుర్తించిన వెంటనే బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీనియర్ పోలీసు అధికారులు ఫోరెన్సిక్ బృందం, జాగిలాలతో బ్యాంకుకు చేరుకుని, పరిశీలించి ఆధారాలను సేకరించారు.