పెళ్లికెళ్లారు.. ఇల్లు గుల్ల చేశారు
-
29 సవర్ల బంగారు అభరణాలు, రూ. 75 వేలు నగదు చోరీ
సూళ్లూరుపేట :
కుటుంబ సభ్యులందరూ బంధువుల పెళ్లికెళ్లగా గుర్తుతెలియని దుండగులు ఇల్లు గుల్ల చేశారు. ఈ సంఘటన పట్టణంలోని ఝాన్సీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగింది. సేకరించిన సమాచారం మేరకు.. చిత్తూరుజిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకంకు చెందిన కారికాటి జయకృష్ణ శ్రీరామ్‌చిట్స్ కంపెనీలో కావలిలో పనిచేస్తూ సూళ్లూరుపేటలోని ఝాన్సీనగర్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఆయన విధులు నిమిత్తం మంగళవారం కావలికి వెళ్లాడు. బుధవారం రాత్రి తన అక్క కుమార్తె వివాహం కావడంతో భార్య స్వప్నకుమారి ఇద్దరి పిల్లలను తీసుకుని తలుపులకు తాళం వేసి పక్కింట్లో ఇచ్చి కారిపాకం వెళ్లింది. బుధవారం ఉదయాన్ని తలుపు తీసేసి ఉండడాన్ని పక్కింటి వారు చూసి జయకృష్ణ, స్వప్నకుమారికి సమాచారం అందించారు. వారు వెంటనే స్థానిక సీఐ విజయకృష్ణకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి పరిశీలించి వేలిముద్రలను నిపుణులను రప్పించి బీరువా, తలుపులు మీద వేలిముద్రలను తీసుకున్నారు. సంఘటనా స్థలంలో తలుపునకు వేసిన తాళం పిట్టగోడ మీద ఉంది. చిన్నపాటి గడ్డపార కూడా అక్కడే కనిపించింది. అయితే గడ్డపారతో తలుపులు పగులగొట్టిన దాఖలాలు కనిపించలేదు. బీరువాను పగులగొట్టిన ఆనవాళ్లు కనిపించలేదు. తలుపునకు వేసిన తాళం తీసి బెడ్ కింద ఉన్న బీరువా తాళం తీసి అందులో ఉన్న 29 సవర్ల బంగారు ఆభరణాలు, కట్నం కోసం తెచ్చిపెట్టిన రూ.75 వేల నగదు మాత్రమే చోరీకి గురైంది. బంగారు ఆభరణాలు, నగదు తప్ప అందులో ఉన్న వెండి వస్తువులను తాకలేదు. చోరీ జరిగిన ఇంటిని, పరిసర ప్రాంతాలను ఐడీ పార్టీ సిబ్బంది శ్రీనివాసులురెడ్డి, మునీర్‌బాషా పరిశీలించారు. అయితే గుర్తు ðlలియని దొంగలు వేసుకుని వచ్చిన చెప్పులు మిద్దెపైన వదిలి వెళ్లడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. గడ్డపారను కూడా స్వాధీనం చేసుకుని బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని సీఐ విజయకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.