
ప్రపంచ లగ్జరీ మార్కెట్‌కు ప్రతీకగా ఉన్న జెమ్స్ అండ్ జువెలరీ పరిశ్రమ ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు కళాత్మకత, ఆర్థిక సహకారం, ఉపాధి కల్పనకు ప్రసిద్ధి చెందిన ఈ రంగం ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులు, మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య సమస్యలతో పోరాడుతోంది. దాంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఈ రంగంలో ఉద్యోగ కల్పన కరువవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో ఉపాధి పొందుతున్న కళాకారులు, రిటైలర్లు సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సవాళ్లు ఇవే..
రత్నాలు, ఆభరణాల పరిశ్రమ చాలాకాలంగా లగ్జరీకి సింబల్‌గా ఉంది. భారతదేశం, చైనా, యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థలకు బిలియన్ డాలర్ల కొద్దీ సహకారం అందిస్తుంది. ఈ విభాగంలో భారతదేశం ప్రపంచ మార్కెట్లో గణనీయమైన వాటాను కలిగి ఉంది. సూరత్‌లోని వజ్రాల పాలిషింగ్ కేంద్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో పరిస్థితులు తలకిందులవుతున్నాయి.
ఈ రంగంలో వినియోగిస్తున్న ముడిసరుకుల ధరలు పెరగడం ప్రధాన సవాలుగా మారింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా గొలుసు అడ్డంకుల కారణంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు పెరిగాయి. అదేవిధంగా సహజమైన, ప్రయోగశాలలో అభివృద్ధి(ల్యాబ్ గ్రోన్ డైమండ్స్) చేసిన రత్నాల ఖర్చు విపరీతంగా హెచ్చుతగ్గులకు గురవుతుంది. మైనింగ్ అంతరాయాలు, ఇతర ప్రత్యామ్నాయాలకు పెరిగిన డిమాండ్ కారణంగా ఈ పరిస్థితులు దాపరించాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్న నగల వ్యాపారులు, తయారీదారులకు పెరుగుతున్న ఖర్చులు తక్కువ మార్జిన్లను అందిస్తున్నాయి. దాంతో పోటీని తట్టుకోవడం కష్టమవుతుంది.
మారుతున్న వినియోగదారుల ధోరణి
ఈ విభాగంలో వినియోగదారుల ధోరణి మారుతుంది. యువకులు ముఖ్యంగా మిలీనియల్స్(1995 తర్వాత పుట్టినవారు), జెన్ జెడ్(2000 తర్వాత జన్మించినవారు) జువెలరీ కంటే వాటిని చౌకగా మార్కెట్ నుంచి కొనుగోలు చేసి దాని నుంచి పొందే అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తరచుగా సాంప్రదాయ ఆభరణాలను ఎంచుకుంటున్నారు. దాంతో సహజ డైమండ్లను పోలి ఉండి, చౌకగా లభించే ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాల పెరుగుదల మార్కెట్‌ను మరింత దెబ్బతీసింది. వ్యాపారాల ఆర్థిక సమస్యను మరింత జఠిలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా డిస్పోజబుల్ ఆదాయాల(ఖర్చులపోను మిగిలిన డబ్బు) ఖర్చును ప్రభావితం చేసింది. ఇది ఆభరణాలు వంటి లగ్జరీ కొనుగోళ్లను వాయిదా వేసేందుకు కారణమైంది.
భౌగోళిక అనిశ్చితులు, సరఫరా గొలుసు సమస్యలు
రత్నాలు, ఆభరణాల పరిశ్రమ ప్రపంచ వాణిజ్యంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇటీవలి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ వ్యాపారాన్ని మరింత బలహీన పరిచాయి. రఫ్ డైమండ్స్ ప్రధాన సరఫరాదారు అయిన రష్యాపై ఆంక్షలు సప్లై-చెయిన్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్యంలోని వజ్రాల దిగ్గజం అల్రోసాపై ఆధారపడిన సంస్థలకు ఈ సమస్య ఎక్కువైంది. ఇంతలో ఆఫ్రికా వంటి రత్నాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో సంఘర్షణలు, అస్థిరత వల్ల విలువైన రాళ్ల సరఫరాకు పరిమిత అవకాశం ఉంది. ఇది ఖర్చులను పెంచి కొరతను సృష్టిస్తుంది.
ఉద్యోగ నష్టాలు
వ్యాపారులకు పెద్దగా మార్జిన్లు లేకపోవడంతో చేసేదేమిలేక ఉద్యోగులను తొలగిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ జెమ్స్ అండ్ జువెలరీ రంగం మైనర్లు, కట్టర్లు, డిజైనర్లు, సేల్స్ పర్సన్ల వంటి లక్షలాది మంది నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. ఒక్క భారతదేశంలోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు మిలియన్లకు(50 లక్షలు) పైగా ఉద్యోగులు ఈ రంగంలో పని చేస్తున్నారు. వీరిలో చాలా మంది కొలువులు ప్రమాదంలో పడనున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కొత్త పంథా
ఈ రంగంలో కొద్దిమంది వ్యాపారులు రీసైకిల్ చేసిన లోహాలను మార్కెటింగ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. మరికొందరు టెక్నాలజీని అందిపుచ్చుకుని ఖర్చులను తగ్గించడానికి, కస్టమర్ అనుభవాలను పెంపొందించడానికి 3డీ ప్రింటింగ్, వర్చువల్ ట్రై-ఆన్ సాధనాలను(ఇమేజ్ సాయంతో కస్టమర్లకు నప్పే ఆభరణాలు ఎంచుకోవడం) ఉపయోగిస్తున్నారు. ఫిజికల్ స్టోర్ల జోలికి పోకుండా తమ బ్రాండ్లు ప్రపంచ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు వీలు కల్పిస్తూ ఈ-కామర్స్‌ను వాడుతున్నారు.
ఇదీ చదవండి: భారత్‌కు స్టీల్ దిగుమతుల ముప్పు
భారత్‌లో ఈ రంగానికి ఊతమిచ్చేందుకు పన్ను రాయితీలు, సబ్సిడీలు, ఎగుమతి ప్రోత్సాహకాలు ఇవ్వాలని పారిశ్రామిక సంఘాలు కోరుతున్నాయి. సరఫరా గొలుసులను స్థిరీకరించడానికి, వాణిజ్య అడ్డంకులను తగ్గించడానికి అంతర్జాతీయ సహకారం మరింత ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నాయి.