అనుమానం పెనుభూతమై..
క్షణికావేశంలో భార్యను కత్తితో నరికి చంపిన భర్త
అనాథలైన బిడ్డలు ∙సైదాపురం మండలం గంగదేవిపల్లిలో ఘటన
సైదాపురం: క్షణికావేశంలో తాలికట్టిన భార్యపై అనుమానంతో కత్తితో దారుణంగా నరికి చంపేశాడు ఓ భర్త. అనంతరం బిడ్డలతో కలిసి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన ఘటన సైదాపురం మండలంలో చోటు చేసుకుంది. రాపూరు సీఐ విజయకృష్ణ అందించిన వివరాల మేరకు.. మండలంలోని గంగదేవిపల్లికి చెందిన చింతలపూడి మహేంద్ర(33)కు అదే గ్రామానికి చెందిన లావణ్యకు 11 ఏళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి వరుణ్(10), జయవర్ధన్(8) ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల కిందట నెల్లూరుకు కాపురం మార్చారు. అయితే వీరి మధ్య ఏడాది నుంచి వివాదం జరుగుతుండేది.
ఈ క్రమంలో ఇటీవలే స్వగ్రామానికి వెళ్లారు. మహేంద్రకు తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోమవారం భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దుస్తులు సర్దుకుని తన అమ్మవారి పుట్టినిల్లు అయిన చిట్వేల్‌కు చేరుకునేందుకు లావణ్య సిద్ధమైంది. ఇరుగు పొరుగు వారు సర్దిచెప్పారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మళ్లీ ఇంటి నుంచి వెళ్లేందుకు లావణ్య ప్రయత్నించడంతో మహేంద్ర క్షణికావేశంలో అక్కడే ఉన్న కత్తి తీసుకుని తలపై కొట్టి గొంతు కోశాడు.
దీంతో లావణ్య చనిపోవడంతో ఇద్దరు బిడ్డలను తీసుకుని మహేంద్ర సైదాపురం పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన భార్యను చంపేసినట్లు లొంగిపోయాడు. ఎస్‌ఐ క్రాంతికుమార్, సీఐ విజయకృష్ణ ఘటనా స్థలికి చేరుకుని హత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. కేసును నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారి రోదన చూసి స్థానికులు చలించిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment