చిలకలూరిపేటటౌన్: వారిద్దరిలో ఒకరికి పెళ్లీడుకొచ్చిన పిల్లలుంటే, మరొకరికి అల్లుళ్లు సైతం ఉన్నారు. అయినా వారి వివాహేతర బంధం వీడలేదు. పలుమార్లు ఎందరో నచ్చజెప్పినా వినలేదు. చివరకు ఆ సంబంధం ఒకరి ప్రాణాలను బలిగొంది. చిలకలూరిపేట పట్టణంలో గురువారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక శాంతినగర్ వాసి, మినీ ఆటో డ్రైవర్ పాలపర్తి నాగరాజు అలియాస్ తిమ్మిరి(45) డైక్‌మెన్ నగర్‌కు చెందిన ఓ పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అక్కల చెంచయ్య భార్య నన్నీతో మూడేళ్ల కిందట వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పలుమార్లు ఇద్దరూ తమ కుటుంబాలను విడిచి వెళ్లిపోయిన ఘటనలు ఉన్నాయి.
నన్నీకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అల్లుళ్లూ వచ్చారు. నాగరాజుకు పెళ్లీడు కొచ్చిన పిల్లలు ఉన్నారు. అతడి భార్య నాగమ్మ ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. నన్నీ, నాగరాజుకు సంఘ పెద్దలు, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వారిలో ఎలాంటి మార్పూ రాలేదు. పైగా సుభాని నగర్ వాగు సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. దీంతో నాగరాజుపై నన్నీ భర్త చెంచయ్య కక్ష పెంచుకున్నాడు. తన అన్న కుమారుడు అక్కల ప్రభుదాసుతో కలిసి హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందించాడు. అక్కయ్య కుమారుడితో కలిసి నన్నీ, నాగరాజు ఉండే ప్రాంతానికి వెళ్లారు.
అదే సమయంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో ఉన్న నన్నీ తమ్ముడికి భోజనం ఇచ్చేందుకు క్యారేజీ తీసుకుని నాగరాజు, నన్నీ బయలుదేరారు. దీంతో ప్రభుదాసు, చెంచయ్య వారిని అడ్డగించారు. నన్నీని అక్కడి నుంచి పంపివేశారు. వెంటనే నాగరాజును రేకుల షెడ్డులోకి లాక్కెళ్లి కూరగాయల చాకుతో గొంతుకోసి హత్యచేసి పరారయ్యారు. హత్య అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. నాగరాజు భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment