చికెన్‌ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను హత్య చేసిన భార్య | Wife deceased her husband by mixing sleeping pills in chicken biryani | Sakshi
Sakshi News home page

చికెన్‌ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను హత్య చేసిన భార్య

Nov 12 2024 12:30 PM | Updated on Nov 12 2024 12:38 PM

Wife deceased her husband by mixing sleeping pills in chicken biryani

ఆ శవం మోహన్‌కుమార్‌దిగా తేల్చిన పోలీసులు

ప్రియుడు, కుమారుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

మడకశిర: నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన గుర్తు తెలియని శవం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మడకశిర రూరల్‌ సీఐ రాజ్‌కుమార్‌ వివరాలను తెలియజేశారు. 2023 జనవరి 12న మడకశిర మండలం కోడిగానిపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువకు ఏర్పాటు చేసిన బ్రిడ్జి కింద గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. వీఆర్‌ఓ హారతి స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మిస్సింగ్‌ కేసుల ఆధారంగా ..
మడకశిర పోలీసులు వివిధ ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లలో నమోదైన మిస్సింగ్‌ కేసుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మడకశిర సీఐ సురేష్‌బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆయన బదిలీపై వెళ్లిపోవడంతో ప్రస్తుత మడకశిర రూరల్‌ సీఐ రాజ్‌కుమార్‌, గుడిబండ ఎస్‌ఐ మునిప్రతాప్‌ కేసు దర్యాప్తు కొనసాగించారు. ఇందులో భాగంగా కర్ణాటకలోని తుమకూరు జయనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ మిస్సింగ్‌ కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. తుమకూరుకు చెందిన నాగరత్నమ్మ అనే మహిళ తన పెద్ద కుమారుడు మోహన్‌కుమార్‌ (52) తప్పిపోయినట్లు 2023 జనవరి 21న జయనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వివరాలను మడకశిర పోలీసులు సేకరించారు. ఆ తర్వాత శవం ఫొటోను నాగరత్నమ్మకు చూపించగా మృతుడు తన పెద్ద కుమారుడేనని గుర్తు పట్టింది. మృతుడి సోదరులైన అరుణ్‌కుమార్‌, కిరణ్‌కుమార్‌లను కూడా మడకశిర పోలీసులు విచారించారు. తప్పిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.

విచారణలో పోలీసులకు దొరికిన క్లూ
మృతుడి తల్లి, సోదరుల విచారణలో ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడికి, అతని భార్య కవితకు మనస్పర్థలు ఉన్నాయి. దీంతో మృతుడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి తుమకూరులోనే శిరా గేట్‌లో వేరుగా తన కుమారుడు కౌశిక్‌, కుమార్తె దీక్షితతో కలిసి ఉంటోందని వారు పోలీసులకు వివరాలు అందించారు. ఈవివరాల మేరకు మడకశిర పోలీసులు మృతుడి భార్య కవితను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు.

భార్య విచారణతో వీడిన మిస్టరీ
మృతుడి భార్య కవితను పోలీసులు విచారణ చేయడంతో మోహన్‌కుమార్‌ను హత్య చేసినట్లు తేలింది. కవితకు తుమకూరు జిల్లా గుబ్బిలో పనిచేసే విద్యుత్‌శాఖ జేఈగా పని చేసే అక్తర్‌పాషాతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అతనితో సహ జీవనం కూడా చేసేది. అక్తర్‌పాషాతో కవిత డబ్బులు ఇప్పించుకుని తుమకూరులోనే ఓ హోటల్‌ పెట్టింది. ఈ క్రమంలో మృతుడు మోహన్‌కుమార్‌ పలుసార్లు హోటల్‌ వద్దకు వెళ్లి భార్య కవిత, ప్రియుడు అక్తర్‌పాషా, హోటల్‌లో పని చేసే వంట మనిషి మోహన్‌ప్రసాద్‌, కుమారుడు కౌశిక్‌ను దూషించేవాడు. తన ఆస్తిని మీకు ఇవ్వనని, తన సోదరులకు ఇస్తానని భార్య, కుమారుడితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్‌, ప్రియుడు అక్తర్‌పాషాలు మోహన్‌కుమార్‌ను చంపడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికి హోటల్‌ వంట మనిషి మోహన్‌ప్రసాద్‌తో సుపారీ మాట్లాడారు. రూ.లక్షకు ఒప్పందం చేసుకొని రూ.50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారు.

చికెన్‌ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి హత్య
పథకం ప్రకారం కుమార్తె దీక్షతకు ఆరోగ్యం బాగా లేదని మోహన్‌కుమార్‌ను భార్య కవిత 2023 జనవరి 11న రాత్రి 9 గంటల సమయంలో ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించింది. చికెన్‌ బిర్యానీలో నిద్రమాత్రలు వేసి మోహన్‌కుమార్‌కు పెట్టారు. భోజనం చేసిన తర్వాత మృతుడు మత్తులోకి పోయాడు. ఈక్రమంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్‌, వంట మనిషి మోహన్‌ప్రసాద్‌... మోహన్‌కుమార్‌ తలపై రోకలిబండతో కొట్టారు. మృతుడి భార్య ప్రియుడు అక్తర్‌పాషా కత్తితో గొంతుకోశారు. మోహన్‌కుమార్‌ మృతి చెందగా శవాన్ని ఓ ప్లాస్టిక్‌ సంచిలో కట్టి వంట మనిషి ఓ కారులో వేసుకుని మడకశిర మండలంలోని కోడిగానిపల్లి హంద్రీనీవా కాలువ బ్రిడ్జి కింది భాగాన పడేసి వెళ్లారు.

నలుగురు నిందితుల అరెస్ట్‌
పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మడకశిర రూరల్‌ సీఐ రాజ్‌కుమార్‌, గుడిబండ ఎస్‌ఐ మునిప్రతాప్‌ సిబ్బంది ఆదివారం నిందితులను తుమకూరులో అరెస్ట్‌ చేశారు. శవాన్ని తరలించడానికి ఉపయోగించిన కారు, మరణాయుధాలు కూడా సీజ్‌ చేశారు. నిందితులైన కవిత, అక్తర్‌పాషా, కౌశిక్‌, మోహన్‌ప్రసాద్‌లను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ రాజ్‌కుమార్‌, ఎస్‌ఐ మునిప్రతాప్‌ తదితర పోలీసులను ఎస్పీ రత్న అభినందించినట్లు పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement