నంబూరు మహిళ హత్య కేసులో వెలుగులోకి పలు విషయాలు
పెదకాకాని: వివాహేతర సంబంధం కారణంగానే నంబూరులో మహిళ హత్యకు గురైనట్లు తెలిసింది. స్థానికుల ద్వారా సేకరించిన విశ్వసనీయ సమాచారం మేరకు... పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయిన షేక్ మల్లికది హత్యేనని నిర్ధారణ అయింది. నంబూరుకు చెందిన షేక్ మల్లికను పది ఏళ్ల కిందట అదే గ్రామానికి చెందిన షేక్ అక్బర్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి పాప, బాబు సంతానం.
మల్లిక ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో పిల్లలు పుట్టిన కొద్ది రోజులకే గొడవలు జరిగాయి. దీంతో ఆమె భర్త నుంచి విడిపోయింది. తరువాత గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. వీరు కొంతకాలంపాటు గుంటూరులో కాపురం పెట్టారు. ఆ సమయంలో బంగారం వ్యాపారం చేసే రెహమాన్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. మల్లికకు సంతానం కలగకుండా ఆపరేషన్ అయింది. దీంతో సుమారు రూ.5 లక్షలు ఖర్చు చేసి మల్లిక దంపతులు పెంచుకునేందుకు పాపను కూడా రెహమాన్ తీసుకొచ్చి ఇచ్చినట్లు తెలిసింది.
ఇటీవల దంపతులు నంబూరుకు కాపురం మార్చారు. అప్పటి నుంచి రెహమాన్‌కు ఆమె దూరంగా ఉంటోంది. స్థానిక యువకుడితో వివాహేతర సంబంధం కారణమని రెహమాన్ గుర్తించాడు. దీంతో శనివారం ఆమెను హత్య చేసేందుకు ఇద్దర్ని నంబూరు పంపాడు. మల్లిక విషయాలను మరొక మహిళ ఫోన్ ద్వారా రెహమాన్‌కు చేరవేస్తూ వచ్చింది. ప్లాన్ ప్రకారం ముఖానికి మాస్క్‌లు ధరించిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను హతమార్చి తిరిగి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీనిపై పెదకాకాని సీఐ టి.పి. నారాయణ స్వామి మాట్లాడుతూ కేసు దర్యాప్తులో ఉందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment