రెవెన్యూ మంత్రి అనగాని ఇలాకాలో టీడీపీ నేతల బరితెగింపు
తలపై సరివి బాదులతో విచక్షణారహితంగా దాడి
తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
రేపల్లె రూరల్/నగరం: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకా అయిన రేపల్లె నియోజకవర్గం.. నగరం మండలం దాసరిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త నున్నా భూషయ్య (47)పై అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు శనివారం రాత్రి దాడికి తెగబడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన భూషయ్య మృతిచెందాడు. దాసరిపాలేనికి చెందిన భూషయ్యను అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు డ్రింక్ తాగుదామంటూ నిజాంపట్నం ఆముదాలపల్లి పంట పొలాల సమీపంలోని బావి వద్దకు తీసుకెళ్లాడు.
వీరి కదలికలు గమనించిన దాసరిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, మంత్రి అనగాని ప్రధాన అనుచరులు నున్నా బాలశంకర్, నున్నా మణికంఠలతో పాటు మరికొందరు సరివిబాదులతో భూషయ్యపై ఒక్కసారిగా దాడిచేశారు. తలపై విచక్షణారహితంగా చితకబాదడంతో భూషయ్య తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంకటేశ్వరరావు వెంటనే భూషయ్య కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న భూషయ్యను రేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. భూషయ్యకు భార్య వెంకట లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దాసరిపాలేనికి చెందిన నున్నా భూషయ్య గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటాడు. భూషయ్యను హతమార్చితే గ్రామంలో టీడీపీకి తిరుగులేదని భావించిన గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పథకం ప్రకారం హత్యకు పన్నాగం పన్నినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
కాగా, భూషయ్య హత్యను వ్యక్తిగత కక్షలుగా చిత్రీకరించి కేసు నీరుగార్చేందుకు పోలీసులు పడరానిపాట్లు పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒత్తిడితో కేసు నీరుగార్చేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment