ఊరొదలకపోతే చంపేస్తాం | TDP attacks on ysrcp ranks | Sakshi
Sakshi News home page

ఊరొదలకపోతే చంపేస్తాం

Published Sat, Jun 29 2024 5:17 AM | Last Updated on Sat, Jun 29 2024 5:17 AM

TDP attacks on ysrcp ranks

బాపట్ల, తిరుపతి జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ నేతలకు టీడీపీ నేతల హెచ్చరిక

గ్రామం వదలిన చెరుకుపల్లి మాజీ ఎంపీపీ  కుటుంబం, రాంబోట్లపాలెం నేతలు  

మరికొందరు మండల స్థాయి నేతలు, కార్యకర్తలదీ ఇదే దారి 

శ్రీకాళహస్తిలో షికారీ, దళితులపై టీడీపీ శ్రేణుల దౌర్జన్యం 

ఊరు వదిలిన 70 కుటుంబాలు  

వెళ్లని వారి నివాసాల్లోకి దూరి తరిమి కొట్టిన వైనం 

రొంపిచర్ల, చంద్రగిరిలోనూ రెచ్చిపోయిన టీడీపీ గూండాలు 

రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

సాక్షి ప్రతినిధి, బాపట్ల/సాక్షి, టాస్‌్కఫోర్స్‌ :   బాపట్ల, తిరుపతి జిల్లాల్లో అధికార టీడీపీ నేతల అరాచక పర్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు చితక బాదుతున్నారు. ఇళ్లు, ఇతర ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. బలహీన వర్గాలపై, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయి. 

ఊరు విడిచి వెళ్లాలని, లేకపోతే చంపేస్తామని నేతలు, కార్యకర్తలను మైకు అనౌన్స్‌మెంట్ల ద్వారా హెచ్చరిస్తుండటం విస్తుగొలుపుతోంది. దీంతో పలువురు నేతలు, కార్యకర్తలు ఊర్లు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు. మరి కొందరు గ్రామాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల స్థాయి నాయకుడు చెన్ను కోటేశ్వరరావు కుటుంబం 20 రోజులుగా అజ్ఞాతంలో గడుపుతోంది. కోటేశ్వరరావు 1995 నుంచి వరుసగా మూడు దఫాలుగా గుళ్లపల్లి సర్పంచ్‌­గా, మండల పరిషత్‌ అధ్యక్షుడిగా పని చేశారు. 

2021 నుంచి ఆయన సతీమణి సర్పంచ్‌గా ఉన్నా­రు. గ్రామ పంచాయతీలోనే కాక మండల స్థాయిలో పేరున్న నేత. కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ కార్యకర్తలు చెన్ను కోటేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్‌ చేశారు. వీరి హయాంలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకాలన్నింటినీ ధ్వంసం చేశారు. కోటేశ్వరరావును గ్రామస్తుల సమక్షంలో దుర్భాషలాడారు. చంపేస్తామంటూ ఏకంగా మైకు­లో గ్రామం మొత్తం తిరిగి అనౌన్స్‌మెంట్‌ చేయడం గమనార్హం. అంతటితో ఆగకుండా మారణాయుధాలతో ఇంటి వద్దకు వెళ్లి గ్రామం వదలి వెళ్లకపోతే చంపేస్తామని నేరుగా హెచ్చరించారు.దీంతో కోటేశ్వరరావు కుటుంబంతో కలిసి సొంత గ్రామం గుళ్లపల్లి వదిలి వెళ్లిపోయారు. 

తర్వాత ఆయన వాటర్‌ ప్లాంట్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఆయన అనుచరుడి ఇంటిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో కోటేశ్వరరావు నాలుగు రోజుల క్రితం జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ను కలిసి గ్రామానికి చెందిన 8 మంది టీడీపీ కార్యకర్తలతో తనకు, కుటుంబానికి ప్రాణహాని ఉందని.. వారి నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అయినా పోలీసుల నుంచి స్పందన లేదు.  

దాడులను ప్రోత్సహిస్తున్న మంత్రి అనగాని 
చెరుకుపల్లి మండలం కస్తూరివారిపేటకు చెందిన ఆంధ్రప్రభ విలేకరి ఎనుముల వెంకటేశ్వరరావు ఇంటిని బుధవారం టీడీపీ నేతలు జేసీబీతో ధ్వంసం చేశారు. కొత్త ఇల్లు ని ర్మించుకొని మూడు నెలల క్రితమే ఆయన గృహ ప్రవేశం చేశారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడన్న కక్షతో ఈ దురాగతానికి పాల్పడ్డారు. పోలీసులు కనీసం ఫిర్యాదు పత్రం కూడా తీసుకోలేదు. ఇదే మండలం రాం»ొట్లవారిపాలెంకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు రాజేష్‌కుమార్‌ ఇంటిపై 30 మంది టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడి దారుణంగా కొట్టారు. 

ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత, సర్పంచ్‌ ప్రసాదరెడ్డిని చంపేస్తామని బెదిరించారు. గ్రామం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఆయన ఊరు వదిలి వెళ్లారు. ఇలా పలువురు నేతలు అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. నగరం, నిజాపట్నం తదితర మండలాల్లో సైతం ఈ తరహా దాడులు పెరిగాయి. రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క రేపల్లె నియోజకవర్గంలోనే వందల మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గ్రామాలు వదలిపెట్టి వెళ్లారు. 

మంత్రి కనుసైగ మేరకే దాడులు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా, మంత్రి స్పందించక పోవడమే ఇందుకు నిదర్శనం. కాగా, జిల్లాలో బాధితుల నుంచి పోలీసు అధికారులు ఫిర్యాదులు కూడా స్వీకరించక పోవడం గమనార్హం.

ఊరొదిలిన గిరిజన, దళిత కుటుంబాలు 
శ్రీకాళహస్తి రూరల్‌ మండల పరిధిలో టీడీపీ శ్రేణుల దాడులతో ఈశ్వరయ్య కాలనీకి చెందిన 55 కుటుంబాలు, వాగివేడులో 17 కుటుంబాలు, నారాయణపురంలో 3 కుటుంబాలు.. మొత్తం 75 కుటుంబాలు ఊరొదిలి వెళ్లిపోయాయి. ఇందులో ఎంపేడు సర్పంచ్‌ కొండయ్య కుటుంబం కూడా ఉంది. సర్పంచ్‌ కుటుంబం ఎక్కడకు వెళ్లిందో తెలియట్లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరొదిలి వెళ్లిన వారిలో సూళ్లకు వెళ్లే పిల్లలు కూడా ఉన్నారని చెబుతున్నారు. వారి కోసం స్కూల్‌ టీచర్లు తోటి విద్యార్థులను నివాసాలకు పంపించారని స్థానికులు తెలిపారు.

ఆస్తులు ధ్వంసం చేస్తున్న కూటమి
పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం పెద్దగొట్టికల్లుకు చెందిన మాధవరెడ్డి, జనార్థన్‌రెడ్డి ఆస్తులను కూటమి నేతలు ధ్వంసం చేశారు. పీలేరు–తిరుపతి జాతీయ రహదారిలోని రొంపిచర్ల క్రాస్‌ వద్ద ఉన్న వీఎంఆర్‌ కన్వెన్షన్‌ హాలు ముఖ ద్వారం ఆర్చిని గురువారం అర్ధరాత్రి  కూలదోశారు. జనార్ధన్‌రెడ్డికి చెందిన సెరికల్చర్‌ షెడ్డును పడగొట్టారు. కొంత కాలంగా చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తున్నా.. పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈశ్వరయ్య కాలనీలో జరిగిన ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో షికారీలపై మరోసారి దాడులు చేశారని స్థానికులు చెబుతున్నారు. ‘వాళ్లు అధికారంలో ఉన్నారు.. వారితో జాగ్రత్తగా ఉండాలి’ అని పోలీసులు సలహా ఇచ్చినట్లు సమాచారం. చంద్రగిరి నియోజక వర్గం పాకాల మండల యూత్‌ అధ్యక్షుడు చంటిపై గురువారం రాత్రి దాడి జరిగినా, పోలీసులు పట్టించుకోలేదు.

ఫ్యాన్‌కు ఓటేసినందుకు ఊళ్లో ఉండొద్దు   
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో ఫ్యాను గుర్తుకు ఓటేసిన షికారీలు, దళితులను ఊర్ల నుంచి వెళ్లగొడుతున్నారు. ఊరు విడిచి వెళ్లని వారి నివాసాల్లోకి దూరి తరిమి తరిమి కొట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మరి కొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీకి ఓటేసిన, పార్టీ శ్రేణుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఇంకొందరికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అప్పులిచ్చిన వాళ్లను నివాసాలకు పంపి ఒత్తిళ్లు చేయిస్తూ రాక్షసానందం పొందుతున్నారు.

శ్రీకాళహస్తి పరిధిలో ఇప్పటికే రూ.12 కోట్లు విలువ చేసే నివాసాలను కూల్చి వేశారు. శ్రీకాళహస్తి రూరల్‌ మండల పరిధిలోని ఈశ్వరయ్యకాలనీలో టీడీపీ శ్రేణులు శుక్రవారం షికారీల (గిరిజనులు) ఇళ్లలోకి చొరబడి కర్రలు, రాళ్లతో తరిమి కొట్టారు. ఊరు వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దీంతో పలువురు కాలనీ విడిచి వెళ్లిపోయారు. 

ఈ నెల 12న ఎంపేడు పంచాయతీ ఈశ్వరయ్యకాలనీ, వాగివేడు, నారాయణపురంలో జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. నివాసాల్లోకి చొరబడి చిన్నా , పెద్దా తేడా చూడకుండా విచక్షణా రహితంగా దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడ్డ వారిలో చిన్న పిల్లలు, మహేశ్వరి (బాలింత), రవీన (గర్భిణి), ఎంజీఆర్‌ (వృద్దుడు)తో పాటు మరి కొందరు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement