వైచిత్రి
కథ
- కూర చిదంబరం
అది, ఓ మేలు జాతి కుక్క. ఆ జాతిని ‘పామినేరియన్’ అంటారు. దాని ఒళ్లంతా తెల్లని పొడవైన బొచ్చు. చిన్న ఆకారం. భూమి నుండి తొమ్మిది అంగుళాల ఎత్తు ఉంటుంది. నల్లని కళ్లు. కళ్లని కప్పేసే తెల్లని జుట్టు. దాని యజమానులు దాన్ని ప్రేమగా, ‘టామీ’ అని పిలుస్తారు.
మూడేళ్లక్రితం గోపీనాథ్‌కు ఆయన సీనియర్ టామీని ‘బహుమతి’గా ఇచ్చాడు. బహుమతి అనటం కంటే ‘అంటగట్టబడింది’ అనడం సమంజసం. టామీని ఆ సీనియర్, రోజుల పసిగుడ్డుగా ఉన్నప్పుడు, దాని కళ్లింకా పూర్తిగా తెరుచుకోనప్పుడే, వాళ్ల స్నేహితుడి దగ్గర తెచ్చుకున్నాడు. అది వచ్చిన వేళావిశేషం ఏమిటోగాని 4-5 రోజుల్లోనే ఆయనకు ఏనాటి నుండో కోరుకుంటున్న ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. ఎకాఎకిన పిల్లామేకా (భార్యా భర్తలు మాత్రమే) ఆ ఊరికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆయన తన సబార్డినేట్ అయిన గోపీనాథ్‌ను పిలిచి టామీ సంరక్షణా భారం అప్పగించాడు. అప్పగించడమే కాకుండా అప్పుడప్పుడు టామీ యోగ క్షేమాలు అడుగుతూండేవాడు. అందువల్ల కొత్తలో, గోపీనాథ్ టామీని వదుల్చుకోలేక పోయాడు. తరువాతి రోజుల్లో అలవాటు అయిపోయింది.
గోపీనాథ్ దంపతులు ఓ ‘కాంప్లెక్సు’లో అయిదవ అంతస్తులో ఉంటారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కనుక, ఆఫీసుకు వెళ్తూ ఫ్లాట్‌కు తాళంవేసి టామీని ఆ కాంప్లెక్స్ వాచ్‌మన్ నర్సింహ దగ్గర వదిలి వెళతారు. పగలంతా, వారంలో అయిదు రోజులు నర్సింహ దంపతులు టామీకి యజమానులు. పెడిగ్రీ వారు తయారుచేసే ఆహారం దానికి బ్రేక్‌ఫాస్ట్. మధ్యాహ్నం వేళకు నర్సింహ భార్య, తాము వండుకున్న అన్నం, పావులీటర్ పాలు, ఓ గుడ్డూ టామీ పళ్లెంలో వేస్తుంది. ఆడుతూ పాడుతూ దాని ఇష్టం వచ్చినపుడు టామీ అన్నం ప్లేటు ఖాళీ చేస్తుంది. నర్సింహ లాగే అదీ గేటు మీద ఓ కన్నువేసి ఉంచుతుంది. సందర్శకులెవరైనా వచ్చి అవతలివైపు నుండి గేటు తట్టితే, గేటు ఇవతల టామీ మొరుగుతుంది. అంటే నర్సింహను పిలవడం అన్నమాట. ఫ్లాట్ ఓనర్స్ వస్తే చడీచప్పుడు చేయదు. ఆ ఫ్లాట్‌లోని స్కూలు పిల్లలు ఫ్లాట్స్‌కు తిరిగివస్తే, దాని సంరంభం ఇంతా, అంతా కాదు. పిల్లల చుట్టూ గెంతుతుంది. త్వరగా పాలు తాగివచ్చేయండి. మనందరం ‘టాట్-లాట్’లో ఆడుకుందాం అని దాని అరుపులకు అర్థం. వాళ్లూ, టామీని జంతువులా చూడరు. టామీ పిల్లల్తో బాటు ఊయల ఊగుతుంది. ‘జారుడుబండ’ జారుతుంది.
టామీ గేటు దాటి బయటకు అస్సలు వెళ్లదు. ఒకట్రెండు సార్లు ఉత్సకతతో రోడ్డుపైన ఏముందో చూడాలని ప్రయత్నించి, కార్లూ స్కూటర్లూ, పాదచారుల మధ్య ‘చావు తప్పి కన్ను లొట్ట పోయినంత’ పనయింది దానికి. సాయంత్రం చీకటిపడి, పిల్లలు వాళ్ల వాళ్ల ఫ్లాటుల్లోకి వెళ్లాక, టామీ కాస్త దిగులుతో గేటు వైపే దృష్టి ఉంచుతుంది. ఆ కాంప్లెక్సులో ఉన్న పది కార్లలో గోపీనాథ్ కారు శబ్దం దానికి తెలుసు. గేటు అవతల హారన్ వినపడగానే, తోకాడిస్తూ, గేటు తియ్యమని నర్సింహను తొందర పెడుతుంది. గోపీనాథ్ టామీని ఎత్తుకున్నాక, ఇద్దరూ ఆ రాత్రికి డిన్నర్ సరంజామా, షాపింగ్ వస్తువులు పట్టుకుని ఐదవ అంతస్తు చేరుతారు. గోపీనాథ్ దాన్ని ముద్దు చేస్తూ, సంభాషిస్తాడు. ‘‘ఏమే అన్నం గుడ్డూ తిన్నావా? ఆడుకున్నావా? నర్సింహ ఏమన్నాడు’’ ఇలా ఉంటాయి ఆయన ప్రశ్నలు.
లిఫ్టు అయిదవ అంతస్తు చేరగానే వాళ్ళ ఫ్లాట్ డోరు ముందు ఆయన వళ్ళోంచి కిందికి దూకి, తాళం తీసేవరకు వాళ్ళ కాళ్ళకు తన వీపు రాచుకుంటూ తన ప్రేమను ప్రకటిస్తుంది. డోరు తీయగానే ఒక్కసారి ఫ్లాట్ అంతా సర్వేచేసి తనకు కేటాయించబడ్డ, మెత్తని, కాళ్ళు తుడుచుకునే కార్పెటు మీద, తన వెనక కాళ్ళ మీద కూర్చుంటుంది. గోపీనాథ్ స్నానం కానించుకుని ల్యాప్‌టాప్ తెరచి తన పనిలో తాను మునిగిపోతాడు. ఆమె డిన్నర్ తయారీలో ‘బిజీ’ అవుతుంది. ఆయన కంప్యూటర్ ముందు కూర్చున్నంత సేపూ టామీ ఆయన ఒళ్ళో కూర్చుంటుంది.
ఇంతలో గోపీనాథ్ భార్య డిన్నరు రెడీ చేస్తుంది. టేబుల్‌పైన దంపతులు, కింద వాళ్ళ కాళ్ళ మధ్య టామీ. గోపీనాథ్ దంపతులు టామీని ఓ పసిపిల్లగా భావిస్తారు. నర్సింహ దగ్గర వదిలి వెళ్తుంటే,‘క్రెష్’లో ఉంచి వెళ్తున్నట్లుగా బాధపడతారు. టామీ సంరక్షణకు నర్సింహ దంపతులకు కొంత డబ్బు ముడుతుంది. ఈ నలుగురికీ టామీ పైనా, టామీకి ఈ నలుగురిపైనా ఎంతో ప్రేమ.
‘వాచ్మెన్’ నర్సింహ ఆరేళ్ళ నుండీ నమ్మకంగా అక్కడే పనిచేస్తున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా. కాంప్లెక్సు నిర్మాణంలో రోజు కూలీగా చేరి, బిల్డర్ నమ్మకాన్ని గెలుచుకుని వాచ్మెన్ అయ్యాడు. రోజు కూలీగా చేరినప్పుడు బ్రహ్మచారి. నాలుగేళ్ళ క్రితం పెళ్ళయింది. వాళ్ళకింకా సంతానం కలుగలేదు. నర్సింహ, ఆయన భార్యా ఆ కాంప్లెక్సులో ‘గెరాజు’లోని చిన్న గదిలో ఉంటారు. ఒకే ఒక్క గది. అయినా సౌకర్యంగా ఉంటుంది. గది గోడలకు షెల్పులు వేయడం వల్ల సామానంతా షెల్పుల్లో చేరి గది విశాలంగా కనిపిస్తుంది. కట్టుబట్టల్తో వచ్చిన నర్సింహకు నేడు గ్యాసు కనెక్షను, ఓ డబుల్కాటు, టీవీ, బయట డ్యూటీ చేస్తున్నప్పుడు ‘బోర్’ కొట్టకుండా చిన్న రేడియో, మిక్సీ, వంటపాత్రలు వగైరా సమకూరాయి. ఇవన్నీ ఫ్లాటుల్లో ఉండేవాళ్ళు ఖాళీ చేసేటప్పుడు నర్సింహకు వదిలి వెళ్ళిన వస్తువులు! మరో ఉడెన్ మంచం, అద్దం బిగించిన డ్రెస్సింగ్ టేబులుకు లోన జాగా లేక బయట గేరేజ్‌లోనే ఉంచాడు. ఎవరైనా గెస్టులు వస్తే ఆ మంచాన్ని వాడుతారు.
నర్సింహకు వాళ్ళ ఊళ్ళో సెంటు పొలం లేదు. ఓ పాత ఇల్లు ఉంటే అన్నకు ఉదారంగా తన వాటా కూడా వదిలి వచ్చానని చెబుతాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కాలం చేశారట. నాలుగో తరగతి చదివాడు. తెలుగు అక్షరాలు చదవడం రాయడం వచ్చు. ఇంగ్లిషు అక్షరాల్ని కూడబలుక్కుని చదువుతాడు.
ఎవరైనా వస్తే ‘ఇంటర్కాం’లో సంబంధిత ఫ్లాట్ యజమానితో మాట్లాడి, వాళ్ళు ‘‘సరే! పంపించు’’ అంటే ‘విజిటర్స్ బుక్’లో వివరాలు రాసుకుని పంపిస్తాడు. పొద్దుటే లేచి, కాంప్లెక్సు కారిడార్లూ, గేరేజ్ ఊడుస్తాడు. పంపు వేసి బోరులోంచి నీటిని పైకి ఎక్కిస్తాడు. గోపీనాథ్ లాంటి ‘ఓనర్’ల కార్లు తుడిచి శుభ్రం చేస్తాడు. ఇది అదనపు ఆదాయం. లిఫ్టులోనో, ఫ్యూజుల్లోనో ఏదైనా సమస్యవస్తే, ఆయా మెకానిక్‌లను రప్పించడం, కరెంటుగానిపోతే ‘జనరేటర్’ ఆన్ చేయడం లాంటివి చేస్తాడు. న్యూస్ పేపరు వాళ్ళు, పాల ప్యాకెట్ల వాళ్ళు, ఆ కాంప్లెక్సులో పనిచేసే పనిమనుషుల పైనా ఓ కన్నేసి ఉంచుతాడు. ఒక్కోసారి నర్సింహ చలాయించే ఆధిపత్యం గమనిస్తే కాంప్లెక్సు అంతా ఈ నర్సింహదే కాబోలు అనిపిస్తుంది.
నర్సింహ భార్య గేటు ముందు ఊడ్చి, ముగ్గువేస్తుంది. ఆమెకు ముగ్గు బహు సొగసుగా వేయటం వచ్చు. కాంప్లెక్సులోని నాలుగైదు ఫ్లాట్లలో ‘పాచి’ పని చేస్తుంది. వాళ్ళు ఇచ్చే అన్నం కూర చారుల వల్ల ఒక్కోరోజు నర్సింహ ఇంట్లో వండాల్సిన అవసరమే ఉండదు.
ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర దాకా ఆ కాంప్లెక్సులో హడావుడి ఉంటుంది. ఆ తరువాత నర్సింహ భోం చేసి ఓ కునుకు తీస్తాడు. రాత్రిళ్లు ఒక్కోసారి నాలుగైదుసార్లు ఆయన లేచి గేటు తీయాల్సి వస్తుంది. అందుకని ఆ గంటా గంటన్నర కునుకు అత్యవసరం. ఆయన కునుకు తీస్తున్నంత సేపూ నర్సింహ భార్య గేటు మీద ఓ కన్నేసి ఉంచుతుంది. సాయంత్రం నాలుగు వరకు కాంప్లెక్సు స్తబ్దుగా ఉంటుంది. తిరిగి స్కూలు పిల్లల రాకతో ‘టాట్-లాట్’లో ఆటలు, పెద్దల ‘ఈవినింగ్ వాక్’లతో కాంప్లెక్సు సందడిగా మారుతుంది. చీకటవగానే గేరేజ్‌లో, కారిడార్‌లో లైట్లు వేస్తాడు. పదకొండు గంటలకు నిద్రపోతాడు.
ఈ దినచర్య కాకుండా నెలనెలా ‘మెయింటెనెన్స్’ వసూలు చేయడం, కాంప్లెక్సు సొసైటీ ప్రెసిడెంట్‌కు లెక్క అప్పచెప్పడం, పండుగలప్పుడు కారిడార్లని, గేరేజ్ని కడగటం, అప్పుడప్పుడు ఓవర్‌హెడ్ నీళ్ళట్యాంకులు శుభ్రపరచడం వంటివి చేస్తూ, ఎవరి వద్దనుండీ సొసైటీ ప్రెసిడెంటుకు కంప్లయింట్ రాకుండా చూసుకుంటాడు నర్సింహ. ఒకరకంగా, కూలీనాలీ చేసుకునే నర్సింహ జీవితంలో కాంప్లెక్సు ఉద్యోగం ఒక ‘మహర్దశ’.
టామీ ‘ఎద’కు వచ్చింది. ఆహారం, నిద్రలాగా ‘అదీ’ టామీ దేహావసరం. ఇదివరలో కాంపౌండు గోడ బయట ఏ మగ కుక్క అరుపువిన్నా, టామీ జవాబుగా అరిచేది. అది ఓ పలకరింపులా కాకుండా, గద్దింపులా ఉండేది. ఇప్పుడు మాత్రం ఊరకుక్కల ‘పిలుపు’లకు టామీ గోడ ఇవతలి నుండి జవాబిస్తోంది. ఆ జవాబు ‘గద్దింపు’ల్లా కాక ‘పలకరింపు’లా ఉంటోంది. టామీ అలా ఎందుకు అరుస్తోందో నర్సింహకు అర్థం అయింది. ఆయనకు కుక్కల గురించి వివరంగా తెలియకున్నా కొంత తెలుసు. ‘పామినేరియన్’ ఓ ప్రత్యేకమైన ‘బ్రీడు’. వాటిని ఆ జాతి కుక్కలతోనే దాటించాలి. ఒక ట్రెండు సార్లు గోపీనాథ్‌కి సంజ్ఞా పూర్వకంగా చెప్పి చూశాడు నర్సింహ. ఆ జాతి మగకుక్క ఎక్కడ ఉందో తెలుసుకోవడం, జతకట్టించడం లేదా వెటర్నరీ డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళడం అయ్యే పనికాదు. ఎవరి ఉద్యోగ బాధ్యతలు వారికున్నాయి. ఆ బాధ్యతల మధ్య టామీ అవసరం అంత ప్రాముఖ్యమైనదిగా కనిపించలేదు.
టామీ అరుస్తోంది. ఇవతలివైపు నుండి కాంపౌండ్ గోడకు ముందు కాళ్లానించి, వెనక కాళ్ళపై నుంచుని గోడ అవతలి కుక్కతో సంభాషిస్తోంది. అది గమనించిన నర్సింహ దాన్ని గొలుసుతో కట్టేశాడు. మామూలుగా గొలుసుతో కట్టేయాల్సిన అవసరం ఉండేది కాదు. అది ఎక్కుడున్నా ‘టామీ’ అని పిలువగానే దగ్గరకు వచ్చేది. కానీ దాని అవసరం దాన్ని నిలవనీయడంలేదు.
టామీ అసహనంగా గొలుసుకు అటూ, ఇటూ తిరుగుతోంది. అది నోటితో మన భాషలో చెప్పలేదు. కాని దాని చేతల ద్వారా వ్యక్తపరిచే సంతోషం, కోపం, ఉక్రోషం, ఉద్రేకం, బాత్రూం అవసరం లాంటివి నర్సింహ అర్థం చేసుకోగలడు. అది గమనించాడు. గొలుసు విప్పదీశాడు. టామీ ఎంతో ‘రిలీఫ్’ ఫీలయ్యింది. పరుగు పెట్టింది. బాత్రూం వేపుకాదు. ఒక్క గెంతుతో లాఘవంగా కాంపౌండు గోడ అవతలివైపు దూకింది. గోడ అవతల ‘ప్రేమ పిలుపు’ ఇస్తోన్న మరో మగకుక్కతో కలిసి ఎటో పరుగెత్తింది.
నర్సింహ సెల్‌ఫోన్‌కు ఆయన భార్య ఊరి నుండి ‘కాల్’ వచ్చింది. ఇద్దరివీ దగ్గరి దగ్గరి ఊళ్ళే! ఆ కాల్ సారాంశం: ఫలానా రోజు భార్య దగ్గరి బంధువు ఇంట్లో పెళ్ళి, తప్పక రావాలి. నర్సింహకు వెళ్ళాలనే ఉంది. ఊరు వెళ్ళక మూడేళ్ళకు పైనే అయింది.
పెళ్ళికి ఓ రోజు ముందు బయల్దేరి, దోవలో తగిలే అత్తారి ఊళ్ళో ఆ రాత్రి తనూ, భార్యా గడిపి, తెల్లారాక తన ఊరువెళ్ళి, బంధువుల్ని కలిసి, మళ్లీ భార్య ఊరు వచ్చి పెళ్ళి భోజనం, విందూ చూసుకుని అదే రాత్రిగానీ, తెల్లవారిగానీ రావాలని నర్సింహ ఆలోచన.
భార్య కూడా సరేనంది. సిటీ జీవితం అంతా ముచ్చట్లు ముచ్చట్లుగా తమ వాళ్ళింట్లో చెప్పాలి. ఏవైనా ఫంక్షన్లప్పుడు కాంప్లెక్సు వాళ్ళిచ్చిన సిల్కు చీరల్లాంటి ఖరీదైన, నాజూకు చీరలు ఊళ్ళో వారందరూ తన వంటి మీద చూడాలి. ఇదీ ఆమె ఆలోచన!
నర్సింహులు కాంప్లెక్సు ప్రెసిడెంటును కలిశాడు. మూడు రోజులు సెలవు అడిగాడు.
వాచ్మెన్ ఉద్యోగం. పొద్దున్నే నీళ్ళు చూసుకోవాలి. కరెంటుపోతే జనరేటర్ వేయాలి. కొత్త వారినెవర్నీ వివరాలు తెలియకుండా పైకి పంపరాదు. ఇవన్నీ ముఖ్యమైన పనులు. ఇవి కాకుండా, ఏవేవో అనుకోని పనులు తగుల్తుంటాయి. ‘ససేమిరా’ అన్నాడు కాంప్లెక్సు ప్రెసిడెంటు.దానికి తక్షణ జవాబుగా నర్సింహ, ‘‘అయ్యా ఇన్నేళ్ళు పని చేశాక కూడా మూడు రోజులు సెలవు దొరక్కపోతే ఎలా? ఏవో అవసరాలుంటాయి. అవసరాలకు వెళ్ళలేని ఈ ఉద్యోగం చేసి ఏం లాభం? మరోటి చూసుకుంటా’’ అన్నాడు.
ప్రెసిడెంటుకు బుర్ర తిరిగిపోయింది. ఆరేళ్ళుగా, నమ్మకంగా నర్సింహ పనిచేస్తున్నాడు. మరొకడ్ని చూసుకోవడం అంటే మాటలా! మరొకడ్ని చూసుకున్నాక, ఆ వచ్చేవాడు ఇంత నమ్మకంగా పనిచేయకపోతే! ఇలాంటి పెళ్లి, చావు, అవసరాలు ఆ వచ్చే వాడికైనా తప్పవు. సెక్యూరిటీ సర్వీసెస్ వారు బాగానే ఉంటారు. కాని రెట్టింపు జీతం. ప్రస్తుతం వసూలు చేస్తున్న మెయింటెనెన్సు చాలదు.
అర్జంటుగా ఆయన సెక్రటరీని సంప్రదించాడు. మూడు రోజులు ఎలాగోలా సర్దుకునేందుకు ఒప్పందం కుదిరింది. ప్రయాణం ఖర్చులు, పెళ్ళి ఖర్చులకు గాను నర్సింహకు ఐదువందలు అడ్వాన్సు ముట్టింది.
లంచ్ అవర్‌లో తన సెల్ఫోన్లో ‘మిస్డ్కాల్స్’ చూసుకున్నాడు గోపీనాథ్. అది తన ఊరి నుండి తమ్ముడి నుంచి వచ్చింది. 5-6 సార్లు ప్రయత్నించినట్లుంది. వెంటనే తమ్ముడికి ఫోను కలిపాడు. తండ్రి పోయాడనీ, ఇంటికి పెద్ద కొడుకుగా తను అర్జంటుగా రావాలనీ, వచ్చాకే శవసంస్కారం మొదలవుతుందనీ, తల్లి బాగా ఏడుస్తోందనీ చెప్పాడు తమ్ముడు. గోపీనాథ్‌కు దిగులేసింది. కొద్దిరోజులుగా తండ్రి ఒంట్లో బావుండటం లేదు. తల్లిదండ్రుల్ని కనిపెట్టుకుని ఉంటున్న తమ్ముడు వారం రోజుల క్రితమే ఫోను చేశాడు. అవసరమైన మొత్తం తమ్ముడికి మెయిల్ ట్రాన్స్ఫర్ చేసి, తనకు రావటం కుదరడంలేదనీ, జిల్లా వైద్యశాలకు తీసుకెళ్లి మంచి వైద్యం చేయించమనీ చెప్పాడు. అప్పుడప్పుడూ అమ్మతో మాట్లాడుతూనే ఉన్నాడు. ‘నాన్నకు ఏమీ కాదని, తప్పకుండా కోలుకుంటాడని’ ధైర్యం చెబుతూనే ఉన్నాడు.
బాస్‌ని చూడాలని మెసేజ్ పంపితే, గంట తరువాత అనుమతి వచ్చింది. బాస్ సెలవు ఇవ్వనన్నాడు. పైగా ‘నీది బాధ్యతాయుతమైన ఉద్యోగం. రెండు ప్రాజెక్టులు, సుమారు ఇరవైమంది పనిచేస్తున్న టీముకు లీడర్‌వి నువ్వు. ఎట్లా శాంక్షన్ చేస్తాననుకున్నావు? అనే ఎదురు ప్రశ్న వేశాడు. గోపీనాథ్ ఊరు సిటీకి ఎంతో దూరంలేదు. రెండున్నర గంటల ప్రయాణం. వెళ్ళి, కార్యక్రమాన్ని ముగించుకుని ఏ రాత్రికైనా సిటీకి చేరి తెల్లారి ఆఫీసుకు వస్తానన్నాడు. అదీ కుదరదన్నాడు బాసు. గోపీనాథ్ మరేదో చెప్పబోతూంటే ‘‘డోన్ట్ బాదర్ మీ విత్ దిస్ ఇష్యూ. యు కెన్ గో’’ అన్నాడు.
నీరసం ఆవహించగా, సీటు మీద కూలబడి భార్యకు ఫోను కలిపాడు గోపీనాథ్. ఆమె కూడా, నీది బాధ్యతాయుత ఉద్యోగం అంది. రెండు నెలల్లో ప్రమోషన్ వచ్చే అవకాశాన్ని పాడుచేసుకోవద్దంది. ఈ సమయంలో బాసు మాట ఖాతరు చేయకపోతే ‘ఇన్సబార్డినేషన్’ (పై అధికారుల ఎడ చూపాల్సిన గౌరవం చూపకపోవడం) అని రాసి పర్సనల్ రికార్డు పాడు చేస్తాడంది. ఒకవేళ గోపీనాథ్ ఉద్యోగం కాని ఊడితే, తన ఒక్క శాలరీతో, కారు వాయిదా, ఇంటి ఇన్స్టాల్మెంటు, ఫ్రిజ్, ఏసీ, సోఫాసెట్టు వాయిదాలకు సరిపోదు అంది. ‘మనసుతో కాకుండా మెదడుతో ఆలోచించ’మంది. ‘సెంటిమెంటుకు పోయి బతుకును బజార్న పడేసుకుంటానా’ అన్న సందేహం కలిగింది గోపీనాథ్‌కు.
దీనంగా తన వేపే చూస్తున్న అమ్మ ముఖం ఊహల్లోకి వచ్చింది. ‘నవమాసాలు మోసి కన్న తనకూ, చేయిపట్టి ఆడించి తన కనీసావసరాలు కూడా త్యాగం చేసి పెంచిన నాన్నకూ ఇచ్చే గౌరవం ఇదా’ అని నిలదీసినట్లనిపించింది. గోపీనాథ్ మెదడు మొద్దుబారిపోయింది. కాస్సేపటికి ఒక నిర్ణయానికి వచ్చాడు. బాధనో, రిలీఫో తెలియని ఫీలింగు ఆయన్ని ఆవహిస్తుంటే, తమ్ముడికి ఫోను కలిపాడు. తాను రాలేకపోతున్నాననీ, శవసంస్కారం నీవే జరిపించమనీ, అమ్మను ఏమీ అనుకోవద్దనీ, కార్యక్రమ నిర్వహణకు కావల్సిన డబ్బును మెయిల్ ట్రాన్స్ఫర్ చేస్తాననీ చెప్పి... తమ్ముడి నుండి జవాబు రాకముందే ఫోన్ పెట్టేశాడు.