ముచ్చటగా మూడు ప్రారంభోత్సవాలు
జపాన్‌లో 1925 నుంచి 1937 మధ్య జీవించిన ఓ పెంపుడు కుక్క యధార్థ కథ ఆధారంగా బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిరామ జోగయ్య, బోనం చినబాబు నిర్మిస్తున్న ‘టామీ’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో 72 రకాల విన్యాసాలు చేసే శునకం ఓ కీలక పాత్ర చేస్తోంది. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి నటుడు కృష్ణంరాజు కెమెరా స్విచాన్ చేయగా, దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. కోడి రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కథ వినగానే మరో ఆలోచనకు తావివ్వకుండా అంగీకరించానని రాజేంద్రప్రసాద్ చెప్పారు.
సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. తమిళ నటుడు శరత్‌కుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. సుదర్శన్ సలేంద్ర దర్శకుడు, దేపా శ్రీకాంత్‌రెడ్డి నిర్మాత. సాయిరామ్‌శంకర్‌కి ఈ సినిమా మేలిమలుపు అవుతుందని, జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఐ మార్టిన్ జో, సంగీతం: మహత్ నారాయణ, సమర్పణ: యర్రం వంశీధరరెడ్డి.
‘స్వామి రారా’ చిత్రాన్ని నిర్మించిన లక్ష్మీ నరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నుంచి మరో సినిమా రాబోతోంది. సుధీర్‌బాబు హీరో. ఎ.ఎన్.బోసు దర్శకుడు. చక్రి చిగురుపాటి నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ‘స్వామి రారా’ తరహాలోనే వినోదాత్మకంగా ఉంటుందని, అయితే ఇది ‘స్వామి రారా’కి సీక్వెల్ కాదని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వేగేశ్న సతీశ్, సహ నిర్మాత: బి.ఎస్.వర్మ, సమర్పణ: శంకర్ చిగురుపాటి.