నలుగురు హీరోలతో సినిమా అసాధ్యం అన్నారు
‘భలే మంచి రోజు’ వంటి హిట్ చిత్రం తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య టాలీవుడ్‌లో ఓ సంచలనానికి తెరలేపారు. ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ మూవీ తీసేందుకే కొందరు దర్శకులు ఆలోచిస్తుంటే, ఏకంగా నలుగురు హీరోలతో పాటు, ఓ సీనియర్ నటుడితో మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టారు. నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా, డా. రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పాత్రలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వి.ఆనంద్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు శ్రీను వైట్ల క్లాప్ ఇచ్చారు.
నటుడు రాజేంద్రప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నటుడిగా నలభై ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఆనంద్ ప్రసాద్‌గారితో ‘అమ్మాయి నవ్వితే’ సినిమా చేశా. నలుగురు హీరోలున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో నేను కీలకపాత్ర చేస్తున్నా. మేమంతా కలిసి చేస్తున్న ఈ సినిమా గ్యారంటీ హిట్ అవుతుంది’’ అన్నారు. శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఫేస్‌బుక్‌లో ఉద్యోగం చేసే టైమ్‌లో రాసుకున్న తొలి కథ ఇది. ఈ కథ చాలామందికి వినిపించా.
‘నలుగురు హీరోలు కలిసి తెలుగులో సినిమా ఎక్కడ చేస్తారు.. ఇది అసాధ్యం’? అన్నారందరూ. ఈ కథ వినగానే ఆనంద్ ప్రసాద్‌గారు ఎగ్జయిట్ అయ్యి, మనం సినిమా చేద్దామన్నారు. ఇంత మంది హీరోలు తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇది. భారీ మల్టీస్టారర్ చిత్రాలకు మా సినిమా నాంది పలుకుతుంది’’ అన్నారు. ‘‘మార్చి మొదటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అని ఆనంద్ ప్రసాద్ తెలిపారు.