
‘టామి’అందరికీ నచ్చుతుంది
డా. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో బాబూ పిక్చర్స్ పతాకంపై సీనియర్ నిర్మాత, రాజకీయవేత్త చేగొండి హరిబాబు, బోనం చినబాబు నిర్మించిన చిత్రం ‘టామి’. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కినేని అమలకు ఈ చిత్రం ప్రివ్యూ చూపించారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ - ‘‘పెంపుడు కుక్కలు తమ యజమానుల పట్ల కనబర్చే విశ్వాసం ఎలాంటిదో చూపించే చిత్రం ఇది. పిల్లలు, పెద్దలూ అందరూ చూడాల్సిన చిత్రం. మూగజీవాల పట్ల మనుషులు చూపించాల్సిన ఆదరణ గురించి చెప్పిన ఈ చిత్రానికి ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇస్తే బాగుంటుంది. ఈ విషయాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలను కుంటున్నాను’’ అని చెప్పారు. ఈ చిత్రంలో భూగీ అనే శిక్షణ పొందిన శునకం నటించిందనీ, త్వరలోనే ప్రచార చిత్రాలను విడుదల చేయాలనుకుంటున్నామని దర్శక, నిర్మాతలు తెలిపారు.