చిన్న పాండూరు పీహెచ్‌సీలో వింత ఘటన
వైద్యాధికారిని సెలవు అడిగిన అటెండర్ పుష్ప
డాక్టర్ వర్సెస్ సిబ్బందిగా మారిన వివాదం
డాక్టర్ లావణ్యపై శ్రీసిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సిబ్బంది
వరదయ్యపాళెం: మండలంలోని చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి లావణ్య, సిబ్బంది నడుమ వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. దీంతో అటెండర్ పుష్ప, ల్యాబ్ టెక్నీషియన్ నీరజ మంగళవారం వైద్యాధికారిణి లావణ్యపై శ్రీసిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనారోగ్య కారణాలతో లీవ్ కోసం అటెండర్ పుష్ప విన్నవించుకోగా పట్టించుకోక పోవడంతో తన భర్త ద్వారా టెలిఫోన్‌లో వైద్యాధికారిణిని మరోమారు విన్నవించే ప్రయత్నం చేశారు.
అయితే అటెండర్ పుష్ప వ్యక్తిగత విషయాల గురించి ఆమె భర్తకు వైద్యాధికారిణి లావణ్య చెడుగా చెప్పడంతో కుటుంబంలో వివాదం తలెత్తింది. దీంతో మూడు రోజుల క్రితం పుష్ప భర్త, భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు పంపేశాడు. ఈ విషయమై ఆధారాలతో సహా పోలీసులకు అందజేసి న్యాయం కోసం అటెండర్ పుష్ప ఫిర్యాదు చేసింది.
అలాగే హాస్పిటల్‌లోని ల్యాబ్ టెక్నీషియన్ నీరజతో కూడా దురుసుగా ప్రవర్తించడం, తరచూ విధుల నిర్వహణలో తన పట్ల భేదాభిప్రాయంతో వ్యవహరిస్తోందని, వీరిద్దరూ శ్రీసిటీ పోలీస్ స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్‌ఐ గౌస్‌పీర్‌ను వివరణ కోరగా పీహెచ్‌సీ డాక్టర్‌పై రెండు ఫిర్యాదులు అందాయని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment