70 ఏళ్ల క్రితం విసిరిన బాంబు అది. ఇన్నేళ్ల తరువాత పేలింది. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి పేలకుండా ఉన్న ఒక బాంబు బుధవారం పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మరో 18 మంది గాయపడ్డారు.
బ్యాంకాక్ లో ఒక ఇంటిని నిర్మాణం చేస్తూండగా ఈ భారీ బాంబు దొరికింది. ఆ స్థలం యజమాని దీన్ని పాత సామాన్ల వ్యాపారికి అమ్మేశాడు. ఆ వ్యాపారి దీన్ని తన గోడౌన్ లోకి తీసుకువెళ్లి, తెరిచేందుకు ప్రయత్నించాడు. దానికోసం గ్యాస్ కట్టర్ ని ఉపయోగించాడు. అంతే ... ఆ బాంబు హఠాత్తుగా పేలింది. ఈ సంఘటనలో భారీ నష్టం సంభవించింది. పరిసరాల్లో ఉన్న ఇతర భవనాలు కూడా పగుళ్లు చూపాయి.
'ఇన్నేళ్లయిపోయింది కదా.. ఈ బాంబు పేలుతుందని అనుకోలేదు.' అన్నాడు తుక్కు కంపెనీ యజమాని.
రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబులు, ఆయుధాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దొరుకుతూ ఉంటాయి. రెండేళ్ల క్రితం జర్మనీకి చెందిన ఒక టన్ను బరువున్న పేలని బాంబు ఫ్రాన్స్ అడవుల్లో దొరికింది.