ఆగస్టు 6.. ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం. జపాన్ వాసులైతే ఈ తేదీని అంత తేలికగా మరిచిపోలేరు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా అగ్రరాజ్యం అమెరికా అణుదాడికి బలైన నగరాలు హిరోషిమా, నాగసాకి. హిరోషిమాలో లిటిల్ బాయ్ విధ్వంసానికి నేటికి సరిగ్గా 73 ఏళ్లు. 1945 ఆగస్టు 6న ఉదయం దాదాపు ఎనిమిదన్నర గంటల ప్రాంతం (జపాన్ స్థానిక కాలమానం ప్రకారం)లో హిరోషిమా గగనతలంలో చక్కర్లు కొట్టింది అమెరికన్ బాంబర్ బి–29. దానికి లిటిల్ బాయ్ అని అమెరికా పేరు పెట్టింది. భూతలానికి కొన్ని మీటర్ల ఎత్తులో ఉండగానే లిటిల్ బాయ్ పేలాడు. కొన్ని సెకన్లలో హిరోషిమా శ్మశానంలా మారిపోయింది.
64 కేజీల యురేనియం గొలుసుకట్టు చర్య జరిగి ఒక ట్యూమర్ కణంలా పెరుగుతూ 67 టన్నుల జౌల్స్ శక్తిని విడుదల చేసింది. క్షణంలో 70 వేలమంది ఉన్న చోటే చచ్చి పడిపోయారు!. అనంతరం మరో 70 వేల మంది మృత్యువాత పడ్డారు. కార్బన్ రియాక్షన్ జరిగి బాంబు సమీపంలో ఉన్న వాళ్ల శరీరాలు కార్బన్ బొమ్మలుగా మారిపోయాయి. చుట్టుపక్కల నుండి చూస్తే నేల మీద ఒక 50వేల అడుగుల పుట్టగొడుగు ఆకారపు మేఘంలా ఉందా విధ్వంసం. క్షణాల్లో నగరం ఆవిరైపోయింది. ఎక్కడ చూసినా కూలిన భవంతులు. శవాల దిబ్బలు. వేల మంది గాయాలపాలై తీవ్ర అనారోగ్యానికి సైతం గురయ్యారు. ఆపై కెమికల్స్ వల్ల పుట్టుకొచ్చిన భయానక వ్యాధులతో లక్షల మంది మృత్యువాత పడ్డారు. అయితే అంత వినాశనం జరిగినా ఒకే ఒక్క భవనం జన్‌బకూ డోమ్ అనే ఒకే ఒక్క భవనం మాత్రం ఆ దుర్ఘటనకు సాక్ష్యంలా నిలిచింది. 73 ఏళ్ల క్రితం విధ్వంసాన్ని తట్టుకున్న భవనమే ప్రస్తుతం హిరోషిమా శాంతి చిహ్నంగా గుర్తింపు పొందుతోంది.
చివరగా ఆ విధ్వంసాన్ని చూసి, శత్రువులైన అమెరికన్లే కన్నీరు పెట్టారు. భారీ విస్ఫోటనం అక్కడి జీవాల్ని మాత్రమే మాయం చేయగలిగింది... జీవాన్ని కాదు! రెండేళ్ల తరువాత బూడిదమయమై వున్న ఆ నగరంలో మొలకలు రావడం వారిలో ఆశల్ని చిగురింప చేసింది. యురేనియం ఆనవాళ్లు మెల్లగా చెరిగిపోయినా.. దాని తాలూకు దుష్పరిణామాలు అలాగే ఉన్నాయి. ఆ పేలుడులో బతికిన వారి జీవితాన్ని నరకంగా మార్చేందుకు డిసీజ్ ఎక్స్ అనే రోగం పుట్టుకొచ్చింది. ఒంటినిండా మచ్చలు వచ్చి రక్తపు వాంతులతో ప్రాణాలని మింగేస్తుందా రోగం. 6 లక్షలమంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. అది రాబోయే తరాలని పీడించకుండా ఉండాలని ఎన్నో ప్రయోగాలకు వ్యాధిగ్రస్తులు తమ శరీరాలనే అప్పగించారు. ఆ ప్రయోగాలు వారిని శారీరకంగానే కాక, మానసికంగానూ బాధించేవి. ఫలితంగా ఇప్పుడు హిరోషిమాలో రేడియేషన్ కారక వ్యాధులు ఎంతో తక్కువ. గత తరాల త్యాగాల ప్రతిఫలమే నేటి హిరోషిమా.
నాటి విధ్వసానికి సజీవ సాక్ష్యంలా నిలిచిన డోమ్ భవనం (కుడి ఫొటో ప్రస్తుతం)
జపాన్ లొంగిపోయేలోపే దారుణం
రెండో ప్రపంచ యుద్ధ సమయం (1945)లో సోవియట్ యూనియన్ అధినేత స్టాలిన్, అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్, గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి విన్‌స్టన్ చర్చిల్ (చర్చిల్ తర్వాత క్లెమెంట్ అట్లీ) జర్మనీలో సమావేశమయ్యారు. యుద్ధానికి తెర దించడంపై ఆ ఏడాది జూలై 27 నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు చర్చించారు. జపాన్ బేషరతుగా లొంగిపోవాలన్నది డిమాండ్. అప్పటి జపాన్ అంత సామర్థ్యం, అధికార బలం లేనిది కనుక బేషరతుగా లొంగిపోవడానికి సిద్ధమైంది. జపాన్ తమ అంగీకారం తెలిపేలోపే.. తాము తయారుచేసిన అణు బాంబులను వాడే అవకాశం మళ్లీ రాకపోవచ్చునని అమెరికా భావించింది. ఈ కారణంగా ఆగస్టు 6న హిరోషిమాపై లిటిల్ బాయ్ అనే అణుబాంబును ప్రయోగించిన అమెరికా.. దాని నుంచి తేరుకునేలోగా నాగసాకి పట్టణంపై ఫ్యాట్ మ్యాన్ అనే మరో అణుబాంబును ప్రయోగించి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించింది.
శాంతికి చిహ్నంగా మారిన హిరోషిమా
జపాన్‌లోని హొన్షు దీవిలో ఉన్న హిరోషిమా పెద్ద నగరం. హిరోషిమా అంటే జపాన్ భాష జపనీస్‌లో విశాలమైనది అనే అర్థం వస్తుంది. ఇప్పటికీ జపాన్ ఆర్థిక నిర్మాణంలో అతి ముఖ్యమైన నగరమే. దేశ విదేశాల నుండి ఇప్పటికీ ఎందరో వ్యాపారుల రాకపోకలతో కొత్త జీవితాన్ని గడుపుతోంది హిరోషిమా. అత్యాధునిక సదుపాయాలు, అధునాతన రహదారులు, ఆకాశాన్ని తాకే భవనాల నడుమ రాత్రిపూట నియాన్ దీపాల వెలుగులో నక్షత్రాల దీవిలా కనిపిస్తుంది హిరోషిమా. ప్రపంచశాంతికి చిహ్నంగా మారి, శాంతి కపోతాన్ని స్వేచ్ఛగా ఎగరవేస్తోంది హిరోషిమా. అణువిధ్వంసం అనంతరం శాంతి చేకూరాలని 1949లో హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్‌ను నిర్మించారు. కొన్నేళ్లపాటు శ్రమించి ఏర్పాటు చేసిన హిరోషిమా పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని 1955లో ప్రారంభించారు. అణ్వాయుధాల పూర్తి నిర్మూలన కొరకు హిరోషిమా మెమోరియల్ పార్క్‌లో 1964లో వెలిగించిన శాంతి జ్యోతి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. అణ్వాయుధాలు పూర్తిగా నిషేధం కావాలని మరెన్నో దేశాలు ఆకాంక్షిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment