atom bomb
-
‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరగుతున్న యుద్ధాన్ని అమెరికా రిపబ్లిక్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం రెండో ప్రప్రంచ యుద్ధంతో అభివర్ణించారు. అమెరికా.. జపాన్‌పై బాంబులు వేసి యుద్ధం ముగించటం అప్పట్లో గొప్ప నిర్ణయమని అన్నారు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్‌కు సైతం అమెరికా బాంబులు ఇస్తే హమాస్‌తో యుద్ధాన్ని ముగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. లిండ్సే గ్రాహం మొదటి నుంచి ఇజ్రాయెల్ మద్దతుదారు.ఇజ్రాయెల్‌కు 3000 భారీ బాంబులు అందజేయటాన్ని నిలిపివేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పెరల్ హార్బర్‌కు సంబంధించి అమెరికా జర్మనీ, జపాన్‌లతో యుద్ధం చేయాల్సి వచ్చింది. దీంతో అమెరికా జపాన్‌లోని హిరోషిమా, నాగాసాకిలపై అణుబాంబుపై విసిరి ఆ యుద్ధాన్ని ముగించింది. అది అప్పుడు చాలా గొప్ప నిర్ణయం. అదే విధంగా ఇజ్రాయెల్‌కు కూడా బాంబులు అందజేస్తే.. హమాస్‌తో యుద్ధం ముగిస్తుంది. ఇజ్రాయెల్ ఇంకా నష్టాన్ని భరించే స్థితిలో లేదు. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి ఏమైనా చేయవచ్చు’’ అని గ్రహం అన్నారు.ఇక.. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్‌పై బాంబు వేయటం సరైన నిర్ణయమే అయితే.. ప్రస్తుతం ఇజ్రాయెల్ బాంబులు వేస్తే కూడా సరైన నిర్ణయమే అవుతుందని జోబైడెన్‌ను విమర్శించారు.ఇక.. రఫాలో యుద్ధం కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్ సైన్యానికి ఇటీవల అమెరికా 3000 భారీ బాంబుల అందజేతను నిలిపివేసిన విషయం తెలిసిందే. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో గాజాలో యుద్ధం విషయంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బైడెన్ ఇజ్రాయెల్‌కు బాంబులు అందించడాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. -
అంతకన్నా పాక్ మీద అణుబాంబులు వేయండి: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను దొంగల చేతిలో పెట్టడం కంటే.. అణు బాంబులు వేసి పాకిస్థాన్‌ను నాశనం చేయడం మంచిదని వ్యాఖ్యానించారు. శుక్రవారం బనిగల నివాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. షెహ్బాజ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. దొంగలు పాక్‌ను పాలించడం ఆశ్చర్యం కలిగించే విషయమని, అంతకంటే దేశాన్ని ఒక అణు బాంబు వేసి పాక్‌ను నాశనం చేయడం ఉత్తమం అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కొందరు.. గతంలో ప్రతీ వ్యవస్థను నాశనం చేసి అవినీతికి పాల్పడ్డారని, ఇప్పుడు వాళ్లను ఎవరు విచారిస్తారని అన్నారు. ఇతరులపై ఆరోపణలు చేయడం మాని.. ముందు ప్రభుత్వ పని తీరును చక్కబర్చాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉద్దేశించి హితవు పలికారు. పాక్ నిజమైన స్వాతంత్ర్యం కోసం ఈ నెల 20వ తేదీన 20 లక్షల మందితో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారాయన. దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రజల్లో తన ప్రసంగాల ద్వారా విషం నింపుతున్నారంటూ ప్రధాని షెహబాజ్, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ పై మండిపడుతున్నారు. -
అణుబాంబు విలయానికి 75 ఏళ్లు
సెకను కాలంలో శరీరం అయిపులేకుండా కాలి బూడిదైంది ఎప్పుడు? ఏళ్లు గడుస్తున్నా ఆ ఒక్క రోజు నాటి స్మృతులు చెరిగిపోనిది ఎక్కడ? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం భూమ్మీద రెండే చోట్ల తెలుస్తాయి. అవే హిరోషిమా, నాగసాకి! జపాన్‌లోని ఈ నగరాల్లో అణుబాంబు విలయం సంభవించి 75 ఏళ్లు అవుతోంది! మానవాళిపై చెరగని మచ్చగా మిగిలిన ఆ మహోత్పాతం ఆనుపాను మరోసారి.... రెండో ప్రపంచ యుద్ధం పరిసమాప్తం కావడానికి హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన అణుబాంబులు కారణమయ్యాయని చరిత్ర చెబుతోంది. 1945 ఆగస్టు ఆరున హిరోషిమాపై ఆ తరువాత మూడు రోజులకు అంటే ఆగస్టు తొమ్మిదిన నాగసాకిపై అణుబాంబులు పడ్డాయి. ఈ రెండు ఘటనల్లో అక్కడికక్కడ మరణించిన వారి సంఖ్య సుమారు 1.40 లక్షలు అని అంచనా. బాంబు పడ్డ ప్రాంతాల నుంచి కిలోమీటర్ చుట్టుపక్కల ఉన్న వారందరూ సెకన్ల వ్యవధిలో మాడి మసైపోగా రేడియోధార్మికత ప్రభావం కారణంగా కేన్సర్ల బారినపడ్డవారు.. తరతరాలుగా ఇతర సమస్యలు అనుభవిస్తున్న వారు కోకొల్లలు. ఆగస్టు తొమ్మిదిన ఉదయం 11.02 గంటలకు ఫ్యాట్‌మ్యాన్ పేరుతో నేలజారిన అణుబాంబు దాదాపు 6.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భవనాలన్నింటినీ నేలమట్టం చేసిందంటే 22 కిలోటన్నుల అణుబాంబు సృష్టించే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. (లిటిల్ బాయ్ విధ్వంసం.. టార్గెట్ హిరోషిమానే ఎందుకు?) బాంబు పడిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు నాలుగు వేల డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా.. కొన్ని రోజుల పాటు ఆ ప్రాంతంలో రేడియో ధారి్మకత వర్షంలా కురిసింది. నాగసాకిలో అణుబాంబు తాకిడికి వైద్యులు, నర్సులు ప్రాణాలు కోల్పోవడంతో కొంత కాలంపాటు ఆ ప్రాంతంలో గాయపడ్డ వారికి చికిత్స అందించే వారు కూడా కరువయ్యారు. దాడి తరువాత తమవారిని వెతుక్కునేందుకు సంఘటన స్థలానికి వచ్చిన వారిలోనూ అత్యధికులు రేడియోధార్మికత బారినపడ్డారు. కనీస చికిత్స లేకుండానే చాలామంది మరణించారు కూడా. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రేడియో ధార్మికత ప్రభావంతో ఆ ప్రాంతంలో కొన్నేళ్లపాటు రక్త కేన్సర్ల బారిన పడే వారి సంఖ్య ఎక్కుంది. దశాబ్దకాలం తరువాత మిగిలిన వారిలో థైరాయిడ్, ఊపిరితిత్తులు, రొమ్ము కేన్సర్ల బారిన పడగా.. చాలామంది గర్భిణులకు గర్భస్రావం జరిగింది. రేడియోధార్మికత బారినపడ్డ పసిపిల్ల శారీరక, మానసిక ఎదుగుదల సమస్యలతో బాధపడ్డారు. ఇప్పటికీ వాటి దుష్ఫలితాలను అనుభవిస్తున్నారు కూడా. అయితే ఈ అణు విధ్వంసం మంచి విషయానికి పునాది వేసింది. ప్రపంచంలో ఏమూలనైనా ఇలాంటి ఉత్పాతం మరొకటి చోటు చేసుకోకుండా అణ్వ్రస్తాలపై నిషేధానికి కారణమైంది. ఆనాటి విధ్వంసాన్ని గుర్తు చేసుకునే లక్ష్యంతో ఏటా ఆగస్టు ఆరవ తేదీని హిరోషిమా డేగానూ, తొమ్మిదవ తేదీని నాగసాకి డేగానూ ఆచరిస్తున్నారు. ఆ నగరాల ఎంపికకు కారణం... అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపైనే అణుబాంబులు కురిపించేందుకు ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. 1945 జూలై 16న అమెరికా ‘మాన్హాట్టన్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన తొలి అణుబాంబును విజయవంతంగా పరీక్షించింది. న్యూ మెక్సికోలోని అలొమోగోర్డో ప్రాంతంలోని ‘ట్రినిటీ’ పరీక్ష కేంద్రంలో అణు పరీక్ష విజయవంతం కావడం.. రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తమ సత్తాను ప్రదర్శించేందుకు ఇదే సరైన సమయమని అమెరికా భావించడం అణు విధ్వంసానికి కారణమయ్యాయి. శాంతికి జపాన్ రాజు నిరాకరించడం.. యుద్ధంలో తమ సైనికుల మరణాలను తగ్గించేందుకు అణుబాంబులు ప్రయోగించడం మేలని అమెరికా భావించింది. ముందుగా కోకురా, హిరోషిమా, యుకోహామా, నీగటా, క్యోటో నగరాలపై బాంబులు వేయాలన్నది అమెరికా ప్రణాళిక. జపాన్ మిలటరీ కేంద్రంగా ఉన్న హిరోషిమా ఈ జాబితాలో ఉండగా.. నౌకాశ్రయ నగరమైన నాగసాకి మాత్రం లేదు. సాంస్కృతికంగా జపాన్‌కు క్యోటో చాలా ప్రధానమైన నగరం కావడం, అప్పటి అమెరికా యుద్ధ మంత్రి హెన్రీ స్టైమ్సన్కు ఆ నగరంపై మక్కువ ఉండటంతో చివరి క్షణాల్లో క్యోటో పేరు తొలగిపోయి నాగసాకి వచ్చి చేరింది. 1920 ప్రాంతంలో హెన్రీ స్టైమ్సన్ క్యోటో నగరాన్ని సందర్శించారని అక్కడే తన హనీమూన్ జరుపుకున్నారని అందుకే ఆయన అణుబాంబు దాడి నుంచి క్యోటోను మినహాయించాలని అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ను విజ్ఞప్తి చేశారని ఒక కథనం ప్రచారంలో ఉంది. 1945 జూలై 24న జపాన్‌పై అణుబాంబు దాడికి అధికారిక ఉత్తర్వులు వెలువడగా ఒక రోజు తరువాత క్యోటో పేరును కొట్టివేసి చేతితో నాగసాకి పేరు రాసినట్లు దస్తావేజులు చెబుతున్నాయి. నాగసాకిపైకి ‘ఫ్యాట్‌మ్యాన్’ను జారవిడిచిన బీ–29 సూపర్ఫోర్ట్ట్రెస్ పేరు బాక్స్కార్. హిరోషిమా కంటే కనీసం ఏడు కిలోటన్నుల ఎక్కువ సామర్థ్యమున్న బాంబును ప్రయోగించినప్పటికీ నాగసాకిలో జరిగిన విధ్వంసం సాపేక్షంగా తక్కువే. నగరం చుట్టూ పర్వత ప్రాంతాలు ఉండటంతో ఉరకామి లోయ ప్రాంతానికే నష్టం పరిమితమైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఆగస్టు తొమ్మిదిన నాగసాకిపై కాకుండా కోకురా నగరంపై దాడి జరగాల్సి ఉంది. మేజర్ ఛార్లెస్ స్వీనీ నడుపుతున్న బాక్స్కార్ కోకురాపై మూడుసార్లు చక్కర్లు కొట్టింది కూడా. అయితే బాగా మబ్బుపట్టి ఉండటం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో స్వీనీ మిగిలిన ఒకే ఒక్క లక్ష్యమైన నాగసాకిపై బాంబు జారవిడిచారు. అణు పరిజ్ఞానంతో ప్రయోజనాలు ఎన్నో.. టెక్నాలజీ రెండువైపులా పదును ఉన్న కత్తి అని అంటారు. అణుశాస్త్ర పరిజ్ఞానం కూడా ఇందుకు అతీతమేమీ కాదు. హిరోషిమా, నాగసాకిలపై బాంబుల ద్వారా విధ్వంసం సృష్టించిన అణు పరిజ్ఞానంతో భూమ్మీద పలు చోట్ల చీకట్లను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కనీసం 30 దేశాల్లో అణుశక్తి ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం కారణంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని శాంతియుత ప్రయోజనాలకు ఎవరైనా వాడుకునే వీలేర్పడింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఆహార భద్రతతోపాటు, మానవ ఆరోగ్యం, పర్యావరణం వంటి అనేక రంగాల్లో అణుశక్తి వినియోగం జరుగుతోంది. వ్యవసాయ దిగుబడులను పెంచేందుకు మాత్రమే కాకుండా.. ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో జంతువ్యాధులను గుర్తించేందుకు అణుశక్తిని ఉపయోగిస్తున్నారు. పంట దిగుబడుల నిల్వకు భారతదేశంలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అణుశక్తి కేంద్రాల వ్యర్థాలను సమర్థంగా వాడుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా.. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సాయంతో కేన్సర్లతోపాటు పలు ఇతర వ్యాధుల చికిత్సలో అణుధారి్మక పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఎబోలా వంటి ప్రాణాంతక వైరస్ల గుర్తింపునకూ అణుశక్తి అక్కరకొస్తోంది. సముద్రజలాల కాలుష్యాన్ని గుర్తించేందుకు మహా సముద్రాల ఆమ్లీకరణను నియంత్రించేందుకు కూడా అణువులను ఉపయోగిస్తున్నారు. హిరోషిమా, నాగసాకి అణుబాంబుల కారణంగా మరణించిన వారి సంఖ్య 1,50,000 – 2,46,000 నాగసాకిపై పడిన అణుబాంబు ‘ఫ్యాట్‌మ్యాన్’ ప్లుటోనియంతో తయారైంది. యురేనియంతో తయారైన ‘లిటిల్‌బాయ్ హిరోషిమా విధ్వంసానికి కారణం. లిటిల్ బాయ్ సామర్థ్యం 15 కిలోటన్నులు కాగా ఫ్యాట్‌మ్యాన్ ఇంకో ఏడు కిలోటన్నులు అధిక శక్తి గలది. అమెరికా తొలి ప్రణాళిక ప్రకారం జపాన్‌లోని ఐదు నగరాలపై అణుదాడి జరగాల్సి ఉంది. ఇందులో నాగసాకి లేనే లేదు. అణు బాంబులతో దాడి చేస్తున్నట్లు అమెరికా ప్లాంప్లెట్ల ద్వారా ఇరు నగరాలను ముందే హెచ్చరించింది. నాగసాకి ఉదంతం లాంటిది మరోటి జరగక్కుండా నిరోధించేందుకు ఐక్యరాజ్యసమితి అణ్వాయుధాలపై నిషేధం విధించింది. అణ్వాయుధ దాడి తరువాత హిరొషిమాలో విరబూసిన తొలి పువ్వు ఓలియాండర్. ఈ కారణంగానే ఆగస్టు ఆరున హిరోషిమా డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఓలియాండర్ మొక్కలను నాటుతారు. అణుదాడి తరువాత హిరోషిమాలోని ఓ పార్కులో వెలిగించిన శాంతి జ్యోతి 1964 వరకూ అఖండంగా వెలిగింది. -
హిరోషిమా బాంబులకన్నా వేడెక్కిన సముద్రాలు
సాక్షి, న్యూఢిల్లీ : 2019లో మానవ జాతి చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ప్రపంచంలోని సముద్రాలన్నీ వేడెక్కాయని ‘చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ లీజింగ్ చెంగ్ బందం వెల్లడించింది. ప్రపంచంలోని సముద్రాల సరాసరి ఉష్ణోగ్రత 0.135 ఫారిన్‌హీట్‌లకు పెరిగిందని, ఇది 360 కోట్ల హిరోషిమా బాంబు పేలుళ్ల నుంచి వెలువడే వేడికి సమానమైనదని ఆయన పేర్కొన్నారు. గత 25 సంవత్సరాల్లోనే సముద్ర జలాల వేడి బాగా పెరిగిందని, భూతాపోన్నతికి ఇది మరో ఉదాహరణని ఆయన తెలిపారు. లీజింగ్ చెంగ్‌తో పాటు ఈ బందంలో చైనా, అమెరికాలకు చెందిన 11 సంస్థల పరిశోధకులు పాల్గొన్నారు. ప్రపంచ సముద్రాల్లోకెల్లా అట్లాంటిక్, దక్షిణ సముద్రాలు బాగా వేడెక్కాయని, సముద్రం ఉపరితలంపైనే కాకుండా ఉపరితలానికి 6,500 అడుగుల లోతులో కూడా సముద్ర జలాలు వేడెక్కాయని ఆయన చెప్పారు. 1955 నుంచి 1986 మధ్య కాలంలో పెరిగిన సముద్ర జలాల వేడితో పోలిస్తే 1987 నుంచి 2019 మధ్య 450 శాతం వేడి పెరిగిందని ఆయన తెలిపారు. భూతాపోన్నతిలో 96 శాతం వేడిని సముద్రాలే పీల్చీసుకుంటాయని, నాలుగు శాతం మాత్రమే జంతుజాలం నివసించే భూమి వాతావరణంలో కలుస్తుందని, అందుకు వేడికి తనలో కలిపేసుకునే గుణం సముద్రాలకు ఉండడమేనని ఆయన చెప్పారు. అమెజాన్, కాలిఫోర్నియా, ఆస్ట్రేలియాలో భూతాపోన్నతి ఎక్కువగా పెరుగుతోందని ఆయన తెలిపారు. గత మూడు నెలలుగా ఆస్ట్రేలియాలో అడవులు, పొదలు తగులబడడానికి కారణం కూడా భూతాపోన్నతి పెరగడమే కారణమని భావిస్తున్న విషయం తెల్సిందే. ఇలాగే సముద్ర జలాలు వేడెక్కుతూ పోతే 2300 సంవత్సరం నాటికి సముద్ర మట్టాలు నాలుగు అడుగులు పెరుగుతాయని పరిశోధకులు ఇదివరకే అంచనా వేశారు. తద్వారా అనేక భూభాగాలు నీట మునుగుతాయని, ఆ విపత్తును నివారించడానికి భూతాపోన్నతికి కారణం అవుతున్న ఉద్ఘారాలు తగ్గించాలని పలు ప్రపంచ సదస్సులు తీర్మానించినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లే దు. -
అదే జరిగితే గంటల్లోనే 3.41 కోట్ల మంది మరణిస్తారు!
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్ విషయమై భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయా? ఆ పరిస్థితే వస్తే సంప్రదాయక యుద్ధంలో గెలవలేని పాకిస్థాన్, భారత్‌పైకి అణ్వాయుధాలు ప్రయోగిస్తుందా ? అదే జరిగితే ఏమవుతుంది ? అని ప్రశ్నిస్తున్న వారు, చర్చిస్తున్నవారు లేకపోలేదు. అదే విధంగా ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల మధ్య యుద్ధం జరిగితే, అది అణు యుద్ధానికి దారితీస్తే ఇరువైపుల జరిగే నష్టమెంత ? అన్న అంశంపై అనాదిగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఊహాగానాలే నిజమై నిజంగా అమెరికా, రష్యా దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే నష్టం ఎంతో తేల్చడానికి ‘కంప్యూటర్ సిములేషన్’ విధానాన్ని నిపుణులు అనుసరించారు. అంటే ఏ దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి ? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ? అవి ఎంత దూరం ప్రయాణించగలవు? లక్ష్యాలను కచ్చితంగా పేల్చగలవా ? పేలిస్తే వాటి ప్రభావం ఎంత ? అన్న నిజమైన లెక్కలు తీసుకొని యుద్ధం జరిగితే ఎంత నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని నిపుణులు తేల్చి చెప్పారు. ‘ప్రిన్సిటన్ యూనివర్శిటీ ఆఫ్ కాలేజెస్’కు చెందిన ‘ఇంజనీరింగ్ అండ్ ఇంటర్నేషనల్ అఫేర్స్’ నిపుణుడు అలెక్స్ గ్లాసర్ సిములేషన్ (అనుకరణ) విధానంలో ప్రయోగం జరిపి నాలుగు నిమిషాల నిడివిగల వీడియోను రూపొందించారు. ఆ ప్రయోగం ప్రకారం కొన్ని గంటల్లోనే ఇరుదేశాల మధ్య 3.41 కోట్ల మంది ప్రజలు మరణిస్తారు. 5.59 కోట్ల మంది గాయపడతారు. మొదటి మూడు గంటల్లోనే 26 లక్షల మంది మరణిస్తారు లేదా గాయపడతారు. ఆ తర్వాత 90 నిమిషాల్లోగా ఇరు దేశాల్లోని కీలక నగరాలపై ఒకరికొకరు ఐదు నుంచి పది అణ్వాయుధాలు ప్రయోగించుకుంటారు. వీటి వల్ల 8.87 కోట్ల మంది మరణిస్తారు లేదా గాయపడతారు. ముందుగా వ్యూహాత్మక లక్ష్యాలపైనే ఇరు దేశాలు అణ్వాయుధాల దాడులను ప్రారంభించినా ఆ తర్వాత అనతి కాలంలోనే ప్రధాన నగరాల లక్ష్యంగా దాడులకు దిగుతాయి. అణ్వాయుధాల వల్ల అప్పటికప్పుడే జరిగే ప్రాణ నష్టాన్ని మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత అణ్వాయుధాల పేలుడు ప్రభావం వల్ల ఎంత మంది ప్రజలు చనిపోతారు, భూవాతావరణంపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాలను ఇక్కడ నిపుణులు పరిగణలోకి తీసుకోలేదు. ఇక అణ్వాయుధాల ప్రభావం ఒక్క మనుషులపైనే కాకుండా సమస్త జీవజాలంపై ఉంటుంది. కొన్ని తరాల వరకు పంటలు కాదుగదా, గడ్డి కూడా నేలపై మొలవదు. ప్రయోగించిన అణ్వాయుధాన్ని ఎలా డిజైన్ చేశారు ? అప్పుడు వాతావరణం ఎలా ఉంది ? పేలుడు జరిగిన చోట ప్రకృతి ఎలా ఉంది ? అన్న అంశాలపై కూడా నష్టం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అణు బాంబు పేలినప్పడు దానిలో 35 శాతం శక్తి ‘హీట్’గా బయటకు వస్తుంది. ఒక మెగా టన్ను అణు బాంబు పేలితే అది పగలు 13 మైళ్ల వరకు, అదే రాత్రిపూట అయితే 50 మైళ్ల వరకు కనిపిస్తుంది. పేలుడు వల్ల పరిసర వాయువుల్లో ఏర్పడే ఒత్తిడి వల్లనే పరిసరాల్లోని అనేక భవనాలు కూలిపోతాయి. పేలుడు స్థలానికి 3.7 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు గాలులు గంటకు 158 మీటర్ల వేగంతో వీస్తాయి. మధ్యలో వచ్చే ఇళ్లు, భవనాలే కాకుండా వాహనాలు, చెట్లు చేమలు పల్లాల్లా గాలిలో తిరుగుతాయి. ఈ విషయాలను పక్కన పెడితే అమెరికాను హెచ్చరించడంలో భాగంగా రష్యా తన తొలి అణ్వాయుధాన్ని నల్ల సముద్రం సమీపంలోని కలినిన్‌గ్రాడ్ వద్ద అణ్వాయుధ కేంద్రం నుంచి వార్నింగ్ షాట్ విడుదల చేస్తుంది. అందుకు ప్రతీకారంగా అమెరికా లేదా నాటో ఏకైక వ్యూహాత్మక అణ్వాయుధాన్ని ప్రయోగిస్తుంది. అంతే యూరప్ అంతట అణ్వాయుధ యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. ఆ వెంటనే అన్ని నాటో అణ్వాస్త్రాలు లక్ష్యంగా రష్యా విమానాల ద్వారా గానీ, క్షిపణుల ద్వారాగానీ దాదాపు 300 అణుబాంబులను ప్రయోగిస్తుంది. అప్పుడు అంతర్జాతీయ సైనిక కూటమి స్పందిస్తుంది. అప్పుడు రష్యా అణ్వాయుధ కేంద్రాలను లక్ష్యంగా పెట్టుకొని నాటో కూటమి దాదాపు 600 అణు బాంబులను ప్రయోగిస్తుంది. ఆ తర్వాత ఇరు దేశాలు చెరి 30 నగరాలు లక్ష్యంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తాయి. దీంతో 3.41 లక్షల మంది ప్రజలు మరణిస్తారు. తొలిదశ యుద్ధం ముగిసేప్పటికీ ఇరు దేశాల మధ్య దాదాపు పది కోట్ల మంది మరణిస్తారు లేదా గాయపడతారు. భారత్, పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను, వాటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఇదే ‘సిములేషన్’ విధానం ద్వారా ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే జరిగే నష్టం ఎంతో కూడా అంచనా వేయవచ్చు. ఇరుదేశాల అణ్వాయుధాలకు సంబంధించి ఇప్పటి వరకు వెలువడిన పలు అంతర్జాతీయ నివేదికల ప్రకారం భారత్ వద్ద దాదాపు వంద అణ్వాయుధాలు ఉంటే పాకిస్థాన్ వద్ద 125 వరకు అణ్వాయుధాలు ఉన్నాయి. అంటే మనకన్నా పాతిక ఆయుధాలు ఎక్కువ. సామర్థ్యం విషయంలో భారత అణ్వాయుధాలకు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. -
‘టమాటాలు ఆపేస్తారా.. ఆటం బాంబు వేస్తాం’
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రదాడి ద్వారా 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పేందుకు భారత్ ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో పాక్ మీద కోపంతో ఆ దేశానికి టమాటాల ఎగుమతిని నిలిపివేశారు భారత వ్యాపారులు. నష్టం వచ్చిన పర్వాలేదు.. ఇక్కడి ప్రజలకే ఉచితంగా పంపిణీ చేస్తాం.. కానీ పాకిస్తాన్‌కు మాత్రం పంపేది లేదని స్పష్టం చేశారు. వ్యాపారులు తీసుకున్న నిర్ణయం తర్వాత భారత్ పాక్ బోర్డర్లో పెద్ద ఎత్తున టమాటా లారీలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు టమాటాలు ఎగుమతి చేయని భారత్ మీద ఏకంగా ఆటం బాంబ్ వేయాలంటూ ఓ పాకిస్తాన్ టీవీ జర్నలిస్ట్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో పాకిస్తాన్ సీ42 అనే చానల్‌కు చెందిన జర్నలిస్ట్ ఒకరు మాట్లాడుతూ.. ‘మా దేశానికి ఇండియా టమాటాలు పంపించకపోవడం నీచమైన నిర్ణయం. ఆ టమాటాలను మోదీ, రాహుల్ గాంధీ ముఖం మీద కొడతాం. టమాటాలను ఆపి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇందుకు ఆటంబాంబుతో సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చింది’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. "Tamatar ka jawab atom bomb se de gay." So much trash on our tv channels #TaubaTaubapic.twitter.com/2myeGCvECw — Naila Inayat नायला इनायत (@nailainayat) February 23, 2019 సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ వీడియోను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ‘మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడం’టూ కొందరు.. ‘భారత్‌ను ఆటం బాంబు నుంచి కాపాడేందుకు ఆ బికారి పాకిస్తాన్‌కు 3కిలోల టమాటాలు పంపించండిరా బాబూ’ అని మరి కొందరు ట్వీట్ చేస్తున్నారు. పుల్వామా ఉగ్ర దాడి అనంతరం పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచే క్రమంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద ట్యాక్స్‌ను 200శాతానికి పెంచింది. దీంతో దిగుమతులు తగ్గిపోయాయి. మరోవైపు భారత రైతులు కూడా తమ ఉత్పత్తులను పాక్‌కు ఎగుమతి చేయకుడదని నిర్ణయం తీసుకున్నారు. -
ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం!
ఆగస్టు 6.. ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం. జపాన్ వాసులైతే ఈ తేదీని అంత తేలికగా మరిచిపోలేరు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా అగ్రరాజ్యం అమెరికా అణుదాడికి బలైన నగరాలు హిరోషిమా, నాగసాకి. హిరోషిమాలో లిటిల్ బాయ్ విధ్వంసానికి నేటికి సరిగ్గా 73 ఏళ్లు. 1945 ఆగస్టు 6న ఉదయం దాదాపు ఎనిమిదన్నర గంటల ప్రాంతం (జపాన్ స్థానిక కాలమానం ప్రకారం)లో హిరోషిమా గగనతలంలో చక్కర్లు కొట్టింది అమెరికన్ బాంబర్ బి–29. దానికి లిటిల్ బాయ్ అని అమెరికా పేరు పెట్టింది. భూతలానికి కొన్ని మీటర్ల ఎత్తులో ఉండగానే లిటిల్ బాయ్ పేలాడు. కొన్ని సెకన్లలో హిరోషిమా శ్మశానంలా మారిపోయింది. 64 కేజీల యురేనియం గొలుసుకట్టు చర్య జరిగి ఒక ట్యూమర్ కణంలా పెరుగుతూ 67 టన్నుల జౌల్స్ శక్తిని విడుదల చేసింది. క్షణంలో 70 వేలమంది ఉన్న చోటే చచ్చి పడిపోయారు!. అనంతరం మరో 70 వేల మంది మృత్యువాత పడ్డారు. కార్బన్ రియాక్షన్ జరిగి బాంబు సమీపంలో ఉన్న వాళ్ల శరీరాలు కార్బన్ బొమ్మలుగా మారిపోయాయి. చుట్టుపక్కల నుండి చూస్తే నేల మీద ఒక 50వేల అడుగుల పుట్టగొడుగు ఆకారపు మేఘంలా ఉందా విధ్వంసం. క్షణాల్లో నగరం ఆవిరైపోయింది. ఎక్కడ చూసినా కూలిన భవంతులు. శవాల దిబ్బలు. వేల మంది గాయాలపాలై తీవ్ర అనారోగ్యానికి సైతం గురయ్యారు. ఆపై కెమికల్స్ వల్ల పుట్టుకొచ్చిన భయానక వ్యాధులతో లక్షల మంది మృత్యువాత పడ్డారు. అయితే అంత వినాశనం జరిగినా ఒకే ఒక్క భవనం జన్‌బకూ డోమ్ అనే ఒకే ఒక్క భవనం మాత్రం ఆ దుర్ఘటనకు సాక్ష్యంలా నిలిచింది. 73 ఏళ్ల క్రితం విధ్వంసాన్ని తట్టుకున్న భవనమే ప్రస్తుతం హిరోషిమా శాంతి చిహ్నంగా గుర్తింపు పొందుతోంది. చివరగా ఆ విధ్వంసాన్ని చూసి, శత్రువులైన అమెరికన్లే కన్నీరు పెట్టారు. భారీ విస్ఫోటనం అక్కడి జీవాల్ని మాత్రమే మాయం చేయగలిగింది... జీవాన్ని కాదు! రెండేళ్ల తరువాత బూడిదమయమై వున్న ఆ నగరంలో మొలకలు రావడం వారిలో ఆశల్ని చిగురింప చేసింది. యురేనియం ఆనవాళ్లు మెల్లగా చెరిగిపోయినా.. దాని తాలూకు దుష్పరిణామాలు అలాగే ఉన్నాయి. ఆ పేలుడులో బతికిన వారి జీవితాన్ని నరకంగా మార్చేందుకు డిసీజ్ ఎక్స్ అనే రోగం పుట్టుకొచ్చింది. ఒంటినిండా మచ్చలు వచ్చి రక్తపు వాంతులతో ప్రాణాలని మింగేస్తుందా రోగం. 6 లక్షలమంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. అది రాబోయే తరాలని పీడించకుండా ఉండాలని ఎన్నో ప్రయోగాలకు వ్యాధిగ్రస్తులు తమ శరీరాలనే అప్పగించారు. ఆ ప్రయోగాలు వారిని శారీరకంగానే కాక, మానసికంగానూ బాధించేవి. ఫలితంగా ఇప్పుడు హిరోషిమాలో రేడియేషన్ కారక వ్యాధులు ఎంతో తక్కువ. గత తరాల త్యాగాల ప్రతిఫలమే నేటి హిరోషిమా. నాటి విధ్వసానికి సజీవ సాక్ష్యంలా నిలిచిన డోమ్ భవనం (కుడి ఫొటో ప్రస్తుతం) జపాన్ లొంగిపోయేలోపే దారుణం రెండో ప్రపంచ యుద్ధ సమయం (1945)లో సోవియట్ యూనియన్ అధినేత స్టాలిన్, అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్, గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ (చర్చిల్ తర్వాత క్లెమెంట్ అట్లీ) జర్మనీలో సమావేశమయ్యారు. యుద్ధానికి తెర దించడంపై ఆ ఏడాది జూలై 27 నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు చర్చించారు. జపాన్ బేషరతుగా లొంగిపోవాలన్నది డిమాండ్. అప్పటి జపాన్ అంత సామర్థ్యం, అధికార బలం లేనిది కనుక బేషరతుగా లొంగిపోవడానికి సిద్ధమైంది. జపాన్ తమ అంగీకారం తెలిపేలోపే.. తాము తయారుచేసిన అణు బాంబులను వాడే అవకాశం మళ్లీ రాకపోవచ్చునని అమెరికా భావించింది. ఈ కారణంగా ఆగస్టు 6న హిరోషిమాపై లిటిల్ బాయ్ అనే అణుబాంబును ప్రయోగించిన అమెరికా.. దాని నుంచి తేరుకునేలోగా నాగసాకి పట్టణంపై ఫ్యాట్ మ్యాన్ అనే మరో అణుబాంబును ప్రయోగించి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించింది. శాంతికి చిహ్నంగా మారిన హిరోషిమా జపాన్‌లోని హొన్షు దీవిలో ఉన్న హిరోషిమా పెద్ద నగరం. హిరోషిమా అంటే జపాన్ భాష జపనీస్‌లో విశాలమైనది అనే అర్థం వస్తుంది. ఇప్పటికీ జపాన్ ఆర్థిక నిర్మాణంలో అతి ముఖ్యమైన నగరమే. దేశ విదేశాల నుండి ఇప్పటికీ ఎందరో వ్యాపారుల రాకపోకలతో కొత్త జీవితాన్ని గడుపుతోంది హిరోషిమా. అత్యాధునిక సదుపాయాలు, అధునాతన రహదారులు, ఆకాశాన్ని తాకే భవనాల నడుమ రాత్రిపూట నియాన్ దీపాల వెలుగులో నక్షత్రాల దీవిలా కనిపిస్తుంది హిరోషిమా. ప్రపంచశాంతికి చిహ్నంగా మారి, శాంతి కపోతాన్ని స్వేచ్ఛగా ఎగరవేస్తోంది హిరోషిమా. అణువిధ్వంసం అనంతరం శాంతి చేకూరాలని 1949లో హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్‌ను నిర్మించారు. కొన్నేళ్లపాటు శ్రమించి ఏర్పాటు చేసిన హిరోషిమా పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని 1955లో ప్రారంభించారు. అణ్వాయుధాల పూర్తి నిర్మూలన కొరకు హిరోషిమా మెమోరియల్ పార్క్‌లో 1964లో వెలిగించిన శాంతి జ్యోతి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. అణ్వాయుధాలు పూర్తిగా నిషేధం కావాలని మరెన్నో దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. -
కిమ్ మళ్లీ భూకంపంలాంటి బాంబు పేల్చారా !
ప్యాంగ్యాంగ్ : ఉత్తరకొరియాలో శనివారం ఉదయం 3.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇది నిజంగా వచ్చిన భూకంపమేనా.. లేక మరో అణ్వాయుధాన్ని ఉత్తర కొరియా పరీక్షించిందా అన్న అనుమానం ఏర్పడింది. ఈ భూపంకంపై చైనా భూకంప విభాగం వివరణ ఇస్తూ.. ఈ ప్రకంపనలు భారీ విస్ఫోటనం వల్ల వచ్చి ఉంటాయన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. శనివారం ఉదయం 11.30 గంటలకు ఉత్తర కొరియాలో 3.4 తీవ్రతతో భూప్రకంనలు సంభవించినట్లు చైనా భూకంప విభాగం ప్రకటించింది. సెప్టెంబర్ 3న ఉత్తర కొరియా శక్తివంతమైన అణుబాంబును పరీక్షించిన సమయంలోనూ ఇటువంటి ప్రకంపనలు వచ్చినట్లు చైనా అధికారులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంపై హైడ్రోజన్ బాంబును పరీక్షిస్తామని ఉత్తర కొరియా శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో.. తాజా ప్రకంపనలపై ప్రపంచ దేశాలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. -
నాడు అణుబాంబులు.. నేడు పుష్పగుచ్ఛాలు
కాలంతోపాటు గాయం మానిపోతుందంటారు. చరిత్రలోనే అత్యంత హేయమైన నరమేధాన్ని ఎదుర్కొన్న జపాన్ కూడా 'ఎన్నటికీ మర్చిపోలేని' గాయాన్ని మాన్పుకోవాలనుకుంటోంది. నాటి శత్రుదేశాలతో స్నేహం కోరుకుంటోంది. జీ7(గ్రూప్ ఆఫ్ సెవెన్) కూటమి ద్వారా ఆ ప్రక్రియకు గతంలోనే బీజాలు పడినప్పటికీ సోమవారం చోటుచేసుకున్న పరిణామంతో అది చారిత్రక మలుపుతిరిగింది. నాడు హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులు కురిపించిన అమెరికా నేడు పుష్పగుచ్ఛాలతో అణుబాంబు మృతుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ సహా జీ7 దేశాల మంత్రుల బృందం సోమవారం హిరోషిమాలోని అణుబాంబు మృతుల స్మారక స్థూపాన్ని సందర్శించింది. నాటి విధ్వంసంలో మరణించిన లక్షలాదిమందికి నివాళులు అర్పించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక అమెరికా విదేశాంగ మంత్రి హిరోషిమాను సందర్శించడం ఇదే మొదటిసారి కావటంతో జాన్ కెర్రీ పర్యటనపై సర్వత్రా ఆసక్తినెలకొంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ చేరుకున్న జాన్ కెర్రీ ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఇటలీ, కెనడా దేశాల మంత్రులతో కలిసి జపాన్ తో చర్చలు జరుపుతారు. పలు అభివృద్ధి అంశాలు, ఆర్థిక ఒప్పందాలపై అవగాహన కుదుర్చుకుంటారు. జపాన్ లో అడుగుపెట్టకముందు అమెరికాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కెర్రీ హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసినందుకు జపాన్ కు క్షమాపణలు చెప్పబోయేదిలేదని కుండబద్దలు కొట్టారు. దాదాపు మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన నాటి సంఘటనపట్ల విచారం వ్యక్తచేస్తామేతప్ప క్షమాపణలు కోరమని కెర్రీ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా 1945, ఆగస్టు 6న జపాన్ లోని పారిశ్రామిక నగరం హిరోషిమాపై అమెరికా యుద్ధవిమానాలు అణుబాంబు వేశాయి. మూడు రోజుల తర్వాత (ఆగస్టు 9న) తీర పట్టణం నాగసాకిపై మరో అణుబాబు పడింది. రెండు ఘటనల్లో దాదాపు మూడు లక్షల మంది చనిపోగా, 30 ఏళ్లపాటు రేడియేషన్ ఎఫెక్ట్ కొనసాగింది. -
అణుబాంబూ ఏమీ చేయలేకపోయింది!
మిరకెల్ ఈ ఫొటోలో కనిపిస్తున్న బోన్సాయ్ చెట్టు వయసు 390 సంవత్సరాలు. చెట్లు సుదీర్ఘకాలం జీవించడం సహజమే కదా! ఇందులో విశేషం ఏముందంటారా..? బోన్సాయ్ చెట్లు కొత్తేమీ కాదని అంటారా..? నిజమే! వృక్షాల ఆయుర్దాయం శతాబ్దాల తరబడి ఉండటంలో వింతేమీ లేదు. మహావృక్షజాతులను వామనవృక్షాలుగా మార్చి కుండీల్లో పెంచుకోవడమూ కొత్త కాదు. అయితే, జపాన్‌లోని ఈ బోన్సాయ్ చెట్టు అణుబాంబును తట్టుకుంది. దాదాపు డెబ్బయ్యేళ్ల కిందట అమెరికా ప్రయోగించిన అణుబాంబులు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అణుబాంబుల తాకిడికి మనుషులతో పాటు జంతువులు, పెనువృక్షాలు సైతం మలమల మాడిపోయాయి. అప్పట్లో ఈ బోన్సాయ్ చెట్టు హిరోషిమాలో ఉండేది. అణుబాంబు ధాటికి అన్నీ నాశనమైనా, అణుబాంబు పడిన ప్రదేశానికి కేవలం రెండు మైళ్ల దూరంలోని యమాకీ నర్సరీలో ఉన్న ఈ చెట్టు మాత్రం బతికే ఉంది. దీని యజమాని మసరు యమాకీ ఈ బుజ్జివృక్షాన్ని 1976లో అమెరికాకు కానుకగా ఇచ్చాడు. ఇప్పుడిది అమెరికాలో ఇంకా పచ్చగా కళకళలాడుతూ ఉంది. వైట్‌పైన్ జాతికి చెందిన ఈ బోన్సాయ్ చెట్టు తన సహజ ఆయుర్దాయానికి మించి ఇంకా జీవించి ఉండటంపై శాస్త్రవేత్తలు సైతం అబ్బురపడుతున్నారు. -
అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తాం: పాక్
ఇస్లామాబాద్: తమ దేశ మనుగడ కోసం అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ అన్నారు. 'అణుబాంబులను ఉపయోగించడం మాకు ఉన్న ఐచ్ఛికాల్లో ఒకటి. వాటిని కేవలం ప్రదర్శన కోసం ఉంచడం లేదు. అవసరమైతే కచ్చితంగా అణుబాంబులను ఉపయోగిస్తాం. కానీ, ఆ అవసరం ఉత్పన్నం కాకూడదని ప్రార్థిస్తున్నాం' అని ఓ వార్తా చానల్‌తో పేర్కొన్నారు. ఉగ్రవాదం పేట్రేగిపోతుండటం భారత్, పాక్‌ల మధ్య పరోక్ష యుద్ధానికి దారి తీస్తోందన్నారు. -
అణుబాంబు తయారుచేస్తున్న ఐఎస్ఐఎస్?
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఇప్పుడు ఏకంగా అణుబాంబు తయారు చేయడానికే ఆ సంస్థ సిద్ధమవుతోంది. ఇందుకోసం గతంలో ఇరాక్, సిరియాలలో దాడులు చేసినప్పుడు ఆస్పత్రులు, పరిశోధన సంస్థల నుంచి భారీ మొత్తంలో రేడియోధార్మిక పదార్థాలను సేకరించిందని, త్వరలోనే వాళ్లు పెద్ద 'డర్టీ బాంబు' చేయొచ్చని ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి జూలీ బీషప్ హెచ్చరించారు. భారీస్థాయిలో ప్రాణనష్టాన్ని కలిగించే ఆయుధాలు రూపొందించాలన్నది తమ లక్ష్యమని గతంలోనే ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. అవసరమైతే పాకిస్థాన్ నుంచి అణ్వాయుధాలను స్మగుల్ చేసుకుని ఏడాదిలోగా అమెరికా మీద దాడి చేసేందుకు ఐఎస్ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రేడియోధార్మిక పదార్థాల చోరీపై నాటో కూడా ఆలోచిస్తోందని బిషప్ చెప్పారు. బ్యాంకుల నుంచి సొమ్ము దొంగిలించడంతోనే వాళ్లు ఆగిపోలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విషవాయువులతో కూడిన ఆయుధాలను కూడా ఐఎస్ఐఎస్ తయారుచేసే ప్రమాదం ఉందని ఆమె గతవారంలో పెర్త్‌లో చేసిన ప్రసంగంలో హెచ్చరించారు.