ప్యాంగ్‌యాంగ్ : ఉత్తరకొరియాలో శనివారం ఉదయం 3.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇది నిజంగా వచ్చిన భూకంపమేనా.. లేక మరో అణ్వాయుధాన్ని ఉత్తర కొరియా పరీక్షించిందా అన్న అనుమానం ఏర్పడింది. ఈ భూపంకంపై చైనా భూకంప విభాగం వివరణ ఇస్తూ.. ఈ ప్రకంపనలు భారీ విస్ఫోటనం వల్ల వచ్చి ఉంటాయన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. శనివారం ఉదయం 11.30 గంటలకు ఉత్తర కొరియాలో 3.4 తీవ్రతతో భూప్రకంనలు సంభవించినట్లు చైనా భూకంప విభాగం ప్రకటించింది.
సెప్టెంబర్ 3న ఉత్తర కొరియా శక్తివంతమైన అణుబాంబును పరీక్షించిన సమయంలోనూ ఇటువంటి ప్రకంపనలు వచ్చినట్లు చైనా అధికారులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంపై హైడ్రోజన్ బాంబును పరీక్షిస్తామని ఉత్తర కొరియా శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో.. తాజా ప్రకంపనలపై ప్రపంచ దేశాలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.