అణుబాంబూ ఏమీ చేయలేకపోయింది!
మిరకెల్
ఈ ఫొటోలో కనిపిస్తున్న బోన్సాయ్ చెట్టు వయసు 390 సంవత్సరాలు. చెట్లు సుదీర్ఘకాలం జీవించడం సహజమే కదా! ఇందులో విశేషం ఏముందంటారా..? బోన్సాయ్ చెట్లు కొత్తేమీ కాదని అంటారా..? నిజమే! వృక్షాల ఆయుర్దాయం శతాబ్దాల తరబడి ఉండటంలో వింతేమీ లేదు. మహావృక్షజాతులను వామనవృక్షాలుగా మార్చి కుండీల్లో పెంచుకోవడమూ కొత్త కాదు. అయితే, జపాన్‌లోని ఈ బోన్సాయ్ చెట్టు అణుబాంబును తట్టుకుంది. దాదాపు డెబ్బయ్యేళ్ల కిందట అమెరికా ప్రయోగించిన అణుబాంబులు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
అణుబాంబుల తాకిడికి మనుషులతో పాటు జంతువులు, పెనువృక్షాలు సైతం మలమల మాడిపోయాయి. అప్పట్లో ఈ బోన్సాయ్ చెట్టు హిరోషిమాలో ఉండేది. అణుబాంబు ధాటికి అన్నీ నాశనమైనా, అణుబాంబు పడిన ప్రదేశానికి కేవలం రెండు మైళ్ల దూరంలోని యమాకీ నర్సరీలో ఉన్న ఈ చెట్టు మాత్రం బతికే ఉంది. దీని యజమాని మసరు యమాకీ ఈ బుజ్జివృక్షాన్ని 1976లో అమెరికాకు కానుకగా ఇచ్చాడు. ఇప్పుడిది అమెరికాలో ఇంకా పచ్చగా కళకళలాడుతూ ఉంది. వైట్‌పైన్ జాతికి చెందిన ఈ బోన్సాయ్ చెట్టు తన సహజ ఆయుర్దాయానికి మించి ఇంకా జీవించి ఉండటంపై శాస్త్రవేత్తలు సైతం అబ్బురపడుతున్నారు.