Bonsai tree
-
పొట్టి మొక్కతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా!
జీవితంలో నువ్వు గొప్ప వాడివి కావాలంటే డబ్బు సంపాదించాలి.. అయితే ఇది అనుకున్న సులభమైతే కాదు, కానీ మనిషి అనుకుంటే అసాధ్యం మాత్రం కాదు. ఇప్పుడు కంపెనీలు ప్రారంభించాలా అని సందేహం రావొచ్చు.. అవేమీ అవసరం లేకుండానే మొక్కలు పెంచి కూడా నీదైన మెలకువలతో తప్పకుండా సక్సెస్ సాధించవచ్చు. ఈ కథనంలో బోన్సాయ్ మొక్కలు పెంచి లక్షలు ఎలా సంపాదించాలో వివరంగా తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా నర్సరీకి లేదా గార్డెన్ వంటి వాటికి వెళ్ళినప్పుడు చిన్నగా.. ఎంతో ముద్దుగా కనిపించే 'బోన్సాయ్' (Bonsai) మొక్కలు పెంచి తప్పకుండా లాభాలను పొందవచ్చు. జపనీస్ కళాకృతి మాదిరిగా ఉండే మొక్కలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఎంతోమందిని ఆకర్షిస్తాయి. వీటిని ఇంట్లో ఓ మూల కుండీలో ఉంచి కూడా సులభంగా పెంచుకోవచ్చు. మార్కెట్లో ధర.. ప్రపంచ వ్యాప్తంగా గ్రీనరీని ఇష్టపడే చాలామంది ఈ మొక్కలను ఎంతో ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్లో వీటి ధర రూ. 200 నుంచి రూ. 2500 వరకు ఉన్నాయి. వీటి పెంపకం సాధారణ మొక్కల పెంపకం కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. అయితే దీని పెంపకం గురించి కొంత అవగాహనా కలిగి మొదలు పెడితే చాలా సులభంగా పెంచుకోవచ్చు. బోన్సాయ్ మొక్కలు పెంపకానికి ప్రధానంగా కావలసింది మట్టిని ఎంచుకోవమే. మొక్క నాటడం, చిగురించే ప్రక్రియ, పొడవు వంటివన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. వీటిని పువ్వులు వచ్చే వారకు సాగు చేయాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కావున కొంత ఓపిక అవసరం. పెంపకం విధానం.. ఈ మొక్కల పెంపకం ప్రారంభించాలనుకునే వారు కొంత భూమి కలిగి నీటి వసతి కూడా సరైన విధంగా ఉండేలా చూసుకోవాలి. భూమిలేని వారు కూడా 100 నుంచి 150 చదరపు అడుగుల టెర్రస్ ఉన్నా చేసుకోవచ్చు. దీనికి మట్టి కుండలు లేదా గాజు కుండలు, శుభ్రమైన గులకరాళ్లు, నీటిని చల్లడానికి ఒక స్ప్రే బాటిల్ వంటివి సమకూర్చుకోవాలి. ఒక చిన్న షెడ్ మాదిరిగా నిర్మించాలనుకుంటే నెట్ కూడా అవసరం ఉంటుంది. ఇదీ చదవండి: నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి! తక్కువ పెట్టుబడితో కూడా బోన్సాయ్ మొక్కల పెంపకం ప్రారభించవచ్చు. కానీ లాభం పొందటానికి కనీసం రెండు నుంచి ఐదు సంవత్సరాల సమయం పడుతుంది. మొక్క కొంత పెరిగిన తరువాత సుమారు 30 నుంచి 50 శాతం అధిక ధరకు విక్రయించవచ్చు. గతంలో ఓ బోన్సాయ్ మొక్క ఏకంగా రూ. 9 కోట్లకు అమ్ముడైంది అంటే దీనికున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! సగటు ఖర్చు.. ఒక మొక్కను మూడు సంవత్సరాలు సాగు చేయడానికి సగటున రూ. 240 ఖర్చు అవుతుంది. అయితే ఈ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా ఒక్కో మొక్కకు రూ. 120 అందిస్తుంది. ఇందులో కూడా మీకు 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సబ్సిడీలు అందిస్తాయి. ఉదాహరణకు మీరు వంద మొక్కలు పెంచడానికి రూ. 24000 ఖర్చవుతుంది. ప్రభుత్వం మొక్కకు 120 అందిస్తుంది కావున వంద మొక్కలకు 12000 అందిస్తుంది. ఇందులో మీకు సబ్సిడీ రూ. 6000 లభిస్తుంది. ఈ లెక్కన మీకు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని స్పష్టమవుతుంది. ఈ సబ్సిడీలను పూర్తిగా ముందుగానే తెలుసుకుంటే మంచిది. కొంత మంది రైతులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఒక హెక్టారులో 3 x 2.5 మీటర్ల విస్తీరణంలో 1500 నుంచి 2500 చెట్లను పెంచవచ్చు. మొక్కల మధ్య ఖాళీ స్థలంలో కూడా మరో పంట పండించుకోవచ్చు. మొత్తం మీద నెలకు సుమారు రూ. 3.5 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు సంపాదించవచ్చు. రీప్లాంటేషన్ కూడా పెద్దగా అవసరం ఉండదని చెబుతున్నారు. -
కడియం నర్సరీలో ఖరీదైన మొక్కలు
కడియం నుంచి అంబానీ పార్కుకు రెండు చెట్లు తరలించారా.. ఒక్కో దాని ఖరీదు పాతిక లక్షల రూపాయలట.. రెండు రోజుల నాటి ఈ వార్త అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. మొక్కల్లో ఇంత ఖరీదైనవి ఉంటాయా? అని ఒక్కసారిగా దీనిపై చర్చ మొదలైంది. తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలోకి ఒక్కసారి తొంగిచూస్తే ఇలాంటి విశేషాలున్న మొక్కలు లేదా చెట్లు ఎన్నో కనిపిస్తాయి. ఆనందాన్ని.. ఆశ్చర్యాన్ని పంచుతాయి. రూపంతో పాటు, ధరలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి మరి.. ఈ తరహా ప్రత్యేక మొక్కలను కడియం ప్రాంత నర్సరీ రైతులు దేశ విదేశాల నుంచి తీసుకువస్తున్నారు. అక్కడి వాతావరణాన్ని ఇక్కడ కృత్రిమంగా కల్పించి మరీ పెంచి అభివృద్ధి చేస్తున్నారు. విలాసవంతమైన ఈ మొక్కలను అభివృద్ధి చేయడం అందరి రైతులు వల్లా సాధ్యం కాదండోయ్.. ఆసక్తి, స్థోమత ఉన్న రైతులు మాత్రమే వీటిని అభివృద్ది చేస్తున్నారు. సంపన్నులే వీటిని కొనుగోలు చేస్తుంటారు. కడియం నర్సరీలో ఇలాంటి కొన్ని మొక్కల గురించి తెలుసుకుందామా.. లక్కీ.. ఆలివ్ ఇటీవల అంబానీ పార్క్‌కు కడియం నుంచి తరలించిన చెట్టు పేరు ఆలివ్. పాశ్చాత్య దేశాల్లో అదృష్టాన్ని తెచ్చేదిగా దీన్ని భావిస్తుంటారు. వందల ఏళ్ల వయసున్న ఈ చెట్టును పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. స్పెయిన్ నుంచి తీసుకువచ్చిన ఆలివ్ ప్లాంట్స్ కడియం నర్సరీలో లభిస్తున్నాయి. 150 నుంచి 210 సంవత్సరాల వరకు వయసున్న వీటిని అమ్మకానికి పెట్టారు. ధర రూ.25 లక్షల వరకూ ఉంటుంది. మన దేశంలో ఆవునెయ్యికి ఎంత ప్రాధాన్యం ఉందో. ఆలివ్ మొక్కల నుంచి తీసిన నూనెకు కూడా కొన్ని దేశాల్లో అంతే ప్రాధాన్యం ఇస్తారని వీటిని అభివృద్ధి చేస్తున్న రైతులు చెబుతున్నారు. (చదవండి: ఒక్కో మొక్క రూ.25 లక్షలు!) ఆకారమే అందం ఫైకస్ కుటుంబానికే చెందిన ఈ మొక్క రూపు చూడగానే హత్తుకుంటుంది. ఆకర్షణీయంగా ముచ్చటగొలుపుతుంది. ఆసియా దేశాలైన చైనా, తైవాన్, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో వీటిని పెంచుతుంటారు. కడియంలోని రైతులు వీటిని దిగుమతి చేసుకుంటున్నారీ మధ్య. మరింతగా అభివృద్ధి పరుస్తున్నారు. మొక్క వయస్సును బట్టి ధరలు ఉంటాయి. 15 ఏళ్ల వయసుంటే రూ.లక్ష వరకు ఉంటుంది. (చదవండి: ప్రపంచ పటంలో ఉలవపాడు మామిడి..) కొమ్మకొమ్మకో గుబురు ఫైకస్ కుటుంబానికే చెందిన మరో రకం మొక్క మల్టీహెడ్ బోన్సాయ్.. సాధారణంగా మొక్క ఒకే గుబురుగా ఎదుగుతుంది. ఈ మొక్క మాత్రం ప్రతి కొమ్మకూ ఒక గుబురుగా ఉంటుంది. అదే దీని ప్రత్యేకత. చూపరులను కట్టి పడేస్తుంది. దీని ధర కూడా దాదాపు రూ.లక్ష వరకు ఉంటుంది. ఈ తరహా బోన్సాయ్ కూడా మన కడియం నర్సరీలో దొరుకుతుంది. ఇంపోర్టెడ్ ఫైకస్ కండలు తిరిగిన దేహం మాదిరిగానే కన్పించే ఈ మొక్కను ఇంపోర్టెడ్ ఫైకస్ అని వ్యవహరిస్తున్నారు. ఇది కూడా విదేశీ అతిధే. ఎంతో నైపుణ్యంతో అల్లినట్లు కొమ్మలను ఒకదానికొకటి అతుక్కుని అందంగా కనువిందు చేస్తుంది. ఈ మొక్క ఫైకస్ కుటుంబానికి చెందినదే. పదేళ్ల వయసున్న మొక్కల నుంచి మన కడియం ప్రాంత నర్సరీల్లో లభ్యమవుతున్నాయి. వీటి ధర కూడా రూ.3 లక్షల నుంచి ప్రారంభమతుంది. వయసును బట్టి ధర పెరుగుతుంది. ఇవే కాకుండా బోన్సాయ్ వృక్షాలు, కజిరినా వంటి మంచు ప్రాంత మొక్కలు, బిస్మార్కియా వంటి ప్రత్యేక మొక్కలు కూడా కడియంలో కొలువుతీరాయి. మోరింగా.. మజాకా.. మునగ జాతికి చెందిన ‘మోరింగా’ మొక్క కూడా ఆఫ్రికా ఖండం నుంచి ఇక్కడకు వచ్చింది. ఆఫ్రికా ప్రాంతంలో ఈ మొక్క ఆకుల్లో ఔషధ గుణాలున్నాయని భావిస్తారు. వీటి పొడిని ఆహారంలో కూడా తీసుకుంటారు. ప్రస్తుతం అలంకరణ మొక్కల జాబితాలోనే ఈ మొక్కను మనవాళ్లు పరిగణిస్తున్నారు. ఇప్పుడిప్పుడే దీనికి డిమాండ్ పెరుగుతోంది. దాని ఎత్తే గమ్మత్తు ఏదో నియమం పెట్టుకున్నట్టు ఏడాదికి ఒకే ఒక సెంటీ మీటర్ మాత్రమే ఎత్తు పెరుగుతుందీ మొక్క. దాని పేరు యూకా రోస్ట్రేటా. అంతే కాకుండా బంగారు వర్ణంలో మొదలు భాగం మెరిసిపోతుంది. ఆకులు మాత్రం వెండి రంగులో ఉండి ఆకట్టుకుంటాయి. ఎడారి జాతికి చెందిన ఈ మొక్క ఎటువంటి వాతావరణంలోనైనా బతికేస్తుందని నర్సరీ రైతులంటున్నారు. స్పెయిన్‌కు చెందిన ఈ రకం మొక్కలను కూడా కడియం తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ధర రూ.50 వేల నుంచి ప్రారంభమవుతుంది. -
బోన్సాయ్ హాయ్ హాయ్..
తగరపువలస (భీమిలి): విశాఖ జిల్లా భీమిలి మండలం పాతమూలకుద్దు సమీపంలో గోస్తనినదీ తీరంలో 400కు పైగా స్వదేశీ, విదేశీ రకాలకు చెందిన బోన్సాయ్ మొక్కలు ఒకేచోట కొలువుతీరి ఉన్నాయి. విశాఖకు చెందిన దువ్వి కిశోర్ అలియాస్ బోన్సాయ్ కిశోర్ కుటుంబం 22 ఏళ్లుగా వీటిని కంటిపాపల్లా సాకుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో కలెక్షన్ కలిగిన బోన్సాయ్ మొక్కలు ఇక్కడే ఉండటం ప్రత్యేకం. గతంలో విశాఖలో కిశోర్ ఇంటి టెర్రాస్ 50–60 మొక్కలకే నిండిపోవడంతో పుష్కలంగా నీరు, స్వచ్ఛమైన గాలి ఉన్న గోస్తని నది తీర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఉద్యోగ రీత్యా ముంబై వెళ్లిన కిశోర్ బోన్సాయ్ ప్రదర్శన చూసి ముగ్ధుడై వీటి పెంపకాన్ని ప్రవృత్తిగా ఎంచుకోవడమే కాకుండా 22 ఏళ్లుగా ఇందులో నైపుణ్యం సాధించారు. కేవలం బోన్సాయ్ మొక్కల పెంపకమే కాకుండా ఔత్సాహికులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం, విద్యార్థులకు బోటానికల్ టూర్‌గా విజ్ఞానాన్ని అందించడం, వధూవరులకు ప్రీ వెడ్డింగ్ షూట్ స్పాట్‌గా అందుబాటులో ఉంచడం, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫొటోగ్రఫీ, జర్నలిజం పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు ప్రయోగశాలగా విశాలమైన ప్రదేశంలో ఈ బోన్సాయ్ వనాన్ని తీర్చిదిద్దారు. ప్రతి ఏటా ఔత్సాహికులకు బోన్సాయ్ మొక్కల పెంపకంపై పోటీలు నిర్వహించి విజేతలకు వీటినే బహుమతులుగా ఇస్తుంటారు. అమ్మా బోన్సాయ్గా పరిచయం బోన్సాయ్ వనాన్ని తీర్చిదిద్దడంలో కిశోర్ తల్లి పద్మావతి కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఆయన వృత్తి రీత్యా బిజీగా ఉన్న సమయంలో ఆమే ఈ మొక్కల సంరక్షణ మొత్తం చూసుకుంటారు. రీ పాటింగ్, ప్రూనింగ్, నీరు పెట్టడం వంటివి చేస్తుంటారు. అందుకే ఈ గార్డెన్‌ను అమ్మా బోన్సాయ్ గార్డెన్‌గా అందరికీ పరిచయం చేస్తుంటారు. ఈ గార్డెన్లో వివిధ దేశాలకు చెందిన ఖరీదైన పక్షి జాతులు, కుక్కపిల్లలు, చేపలను కూడా పెంచుతున్నారు. వీటికోసం ఫిష్పాండ్లు, కేజ్‌లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఒక కుటుంబంలో సభ్యుల వేర్వేరు అభిరుచులకు అనుగుణంగానే వీటికి స్థానం కలించారు. వయ్యారాలు ఒలకబోసేలా.. బోన్సాయ్ మొక్కలను తీర్చిదిద్దడం ఒక అద్భుతమైన కళ. దీనికి తగినంత ఓర్పుతో పాటు నేర్పు అవసరం. మహావృక్షాన్ని సైతం చిన్నతొట్టెలో ఒదిగించే కళ ఈ బోన్సాయ్ మొక్కలకే ఉంది. పెద్ద వృక్షాలను చిన్నగా చూడడమే కాదు రెండు నుంచి మూడు అడుగులు పొడవుతోనే వృక్షాలుగా కనిపిస్తాయి. సాధారణ చెట్ల మాదిరిగానే ఈ బోన్సాయ్లు ఫలాలు దిగుబడినిస్తున్నాయి. ఇంటీరియల్ డెకరేషన్లో ప్రధాన భాగమైన వీటిని ఆరోగ్యంగా పెంచుకోవడానికి మెలకువలు అవసరం. వీటి స్టైల్, వయసు, మొక్కను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.2లక్షల వరకు ధరలు పలుకుతుంటాయి. చూపు మరల్చుకోలేని కలెక్షన్ ఈ బోన్సాయ్ మొక్కల పొదరింట్లో ఇప్పటి తరం వారికి అంతగా పరిచయం లేని స్వదేశీ రకాలైన రావి, మర్రి, జువ్వి, బోగన్విల్లా, మామిడి, కామిని, బోధి, సపోటా, దానిమ్మ, సీమచింత, చింత, చెర్రీస్, ఆరెంజ్, సుబాబుల్, అత్తి, కంటి, మినీలోటస్ వంటి వందకు పైగా రకాలు ఉన్నాయి. అలాగే విదేశీ రకాలైన ఆఫ్రికన్ తులిప్, అర్జున, బాటిల్ బ్రష్, చైనీస్ ఇఎల్ఎమ్, బొబాబ్, దివిదివి, బ్రెజిలిన్ రెయిన్‌ట్రీ, పోర్షియా, పౌడర్ పఫ్, రబ్బర్, సాండ్ పేపర్, షూ ఫ్లవర్, సిల్వర్ ఓక్, ఉడ్ యాపిల్, చైనా తులసి, చైనీస్ పెప్పర్, కాపర్ పాడ్, నోడా, డ్వార్ఫ్, ఫైకస్ లాంగ్ ఇస్ల్యాండ్, గోల్డెన్ షవర్, గుల్మొహర్, జకరండా, కామిని, కేండిల్ ట్రీ, ఇండోనేషియా బ్రయా, ఆస్ట్రేలియా సరుగుడు, బార్బడోస్ చెర్రీ, పోడ్ కార్పన్, ఆస్ట్రేలియన్ ఫైకస్, దివి అవండి, టైగర్ ఫైకస్, లుసీడా, వెలగ, సెబు కేసికర్, బుంజింగి, జాక్వెనియా, కవ, గమిలన్ ట్రయాంగల్ ఫైకస్ వంటి 300 రకాలు ఉన్నాయి. చిన్నారులు మొబైల్స్‌కు అలవాటు పడిపోయిన ప్రస్తుత కాలంలో చెట్ల విలువ తెలపడానికి బోధి చెట్టు–బుద్ధుడు, నేరేడు–దత్తాత్రేయుడు, జమ్మి–పాండవులు, మర్రి–త్రిమూర్తులు మధ్య సంబంధాలు తెలిసేలా ఆయా పొట్టివృక్షాల కింద వీరి ప్రతిమలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళ కూడా తిలకించేందుకు వీటికి విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. మొక్కల విలువ తెలిసింది కోవిడ్ పరిచయం కారణంగా ప్రతి ఒక్కరూ మొక్కల విలువ గుర్తించారు. కాలు ష్యం లేకుండా చెట్ల మధ్య ఉన్నవారికి కరోనా సోకలేదు. చెట్ల పెంపకానికి స్థల సమస్య ఉన్నవారికి బోన్సాయ్ మొక్కలు పెంపకం చక్కటి పరిష్కారం. బాల్కనీ, టెర్రస్, హాలులో, గోడపై కలిపి ఏభై వరకు ఈ మొక్కలను పెంచుకోవచ్చు. నీటివనరులు, కాలుష్యరహిత వాతావరణం, సారవంతమైన భూమి అందుబాటులో ఉండటంతోనే మూలకుద్దులో ఈ బోన్సాయ్ గార్డెన్ ఏర్పాటు చేశాం. – దువ్వి పద్మావతి అమ్మ వల్లనే... బోన్సాయ్ మొక్కల పెంపకం డబ్బుతో కూడుకున్నదన్నది ఒట్టి భ్రమే. మన చుట్టూ ఉన్న పాత భవనాలు, నూతుల నుంచి వీటిని సేకరించుకోవచ్చు. లోతు తక్కువ కలిగిన పాత్రలకు పెయింట్ చేసి అందులో పెంచుకోవచ్చు. స్వచ్ఛమైన గాలిని అందించే మొక్కలే మనకు మంచి నేస్తాలు. అమ్మ పద్మావతి వలనే నాకు బోన్సాయ్ మొక్కల పెంపకంపై ఆసక్తి పెరిగింది. ఆసక్తి కలిగిన వారికి వీటి పెంపకంపై శిక్షణ ఇస్తాను. వివరాలకు 79956 79999లో సంప్రదించవచ్చు. –దువ్వి కిశోర్, మూలకుద్దు, భీమిలి మండలం -
మాజీ డీజీపీ ‘సారూ’ దొరికింది
బంజారాహిల్స్: మాజీ డీజీపీ అప్పారావు ఇంటి ముందు పెంచుకుంటున్న ఖరీదైన, అరుదైన బోన్సాయ్ మొక్కను దొంగిలించిన కేసులో నిందితుడిని జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 18 లో నివసించే మాజీ డీజీపీ అప్పారావు, శ్రీదేవి దంపతులకు బోన్సాయ్ మొక్కల పెంపకంపై ఆసక్తి. కొన్నేళ్లుగా వీరు తమ ఇంటి ఆవరణలో అరుదైన బోన్సాయ్ మొక్కలను పెంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఎస్పీఆర్హిల్స్, ఓంనగర్‌కు చెందిన గొల్లపూడి ప్రసన్నాంజనేయులు తరచూ వాటిని చూస్తుండేవాడు. వీటి ప్రత్యేకతను తెలుసుకున్న అతను ఖరీదైన వాటిని అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఆశించాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడు అభిషేక్‌తో కలిసి గతంలో రెండుసార్లు ఇంటి ముందున్న బోన్సాయ్ మొక్కలను దొంగిలించి అమ్ముకున్నాడు. ఒక్కో మొక్క రూ. 25 వేల వరకు ధర పలికాయి. దీంతో వారు మరోసారి ఇంకో మొక్కను దొంగి లించి అమ్ముకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 10న ఉదయం ఇద్దరూ బైక్‌పై వచ్చి ‘సారూ’ జాతికి చెందిన బోన్సాయ్ మొక్కను దొంగిలించారు.(చదవండి: జ్యువెలరీ షాపులో భారీ చోరీ) దీంతో ఉదయం మొక్క కనిపించకపోవడంతో అప్పారావు భార్య శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని సీసీ టీవీలను పరిశీలించారు. ఈ క్రమంలో యూసుఫ్‌గూడ వైపు నుంచి బైక్‌పై మొక్క తీసుకుని వెళ్తున్న నిందితులను గుర్తించారు. రెండు రోజుల గాలింపు అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆంజనేయులు గతంలోను ఇక్కడ బోన్సాయ్ మొక్కలు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు అభిషేక్‌ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు డీఐ రమేష్ తెలిపారు. -
400 ఏళ్లనాటి చెట్టు చోరీ
టోక్యో: అప్పుడప్పుడూ విచిత్రమైన దొంగతనాలు జరుగుతుంటాయి. జపాన్ రాజధాని టోక్యోలో కూడా అలాంటిదే ఓ చోరీ జరిగింది. ఇంతకీ దొంగలు ఏం ఎత్తుకెళ్లారో తెలుసా? 400 సంవత్సరాలనాటి ఓ చెట్టు! ఆశ్చర్యంగా ఉంది కదూ.. మీరు చదువుతోంది నిజమే. అయితే అది సాధారణ చెట్టుకాదు.. బోన్సాయ్ వృక్షం. సీజి ఇమురా, ఆయన భార్య ఈ చోరీ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగుచూసింది. తమ తోట నుంచి ఏడు బోన్సాయ్ వృక్షాలను ఎవరో అపహరించారని, దయచేసి వాటిని తిరిగి ఇచ్చేయాల్సిందిగా దంపతులిద్దరూ సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు. తెచ్చి ఇచ్చేదాకా వాటిని ఎలా సంరక్షించాలో కూడా వివరించారు. ఆ చెట్లు ఎంతో అపురూపమైనవని, డబ్బులతో వాటిని వెల కట్టలేమని, తమ బాధను అర్థం చేసుకొని వాటిని అప్పగించాలని వేడుకున్నారు. కాగా దొంగిలించిన బోన్సాయ్ చెట్లలో షింపాకు జూనిపర్ చెట్టుకు చాలా డిమాండ్ ఉంది. ఈ ఒక్క చెట్టు విలువే దాదాపు రూ. 65 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. మిగతా అన్ని చెట్ల విలువ కలిపితే దాదాపు కోటి రూపాయలు దాటవచ్చని చెబుతున్నారు. -
ప్రేమగా నీళ్లు పోయండి!
ఇది నా బిడ్డ..దీని పేరు షిమ్‌పకూ..వయస్సు నాలుగొందల ఏళ్లు..మా పూర్వీకుల కాలం నుంచీ అపురూపంగా పెంచుకుంటున్నాం.. దీన్ని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేదు.. అలాంటిదాన్ని మీరు పట్టుకెళ్లిపోయారు.. దొంగతనం చేస్తే చేశారు.. కానీ.. దానికి ప్రేమగా నీళ్లు పోయండి.. జాగ్రత్తగా చూసుకోండి.. ఎందుకంటే.. అది నా ప్రాణం.. తమ ఇంట్లోంచి అరుదైన జానిపర్స్ బోన్సాయ్ చెట్లను ఎత్తుకెళ్లిన దొంగలను ప్రాధేయపడుతూ జపాన్‌లోని టోక్యోకు చెందిన మహిళ ఫుయుమీ ఈమూరా ఫేస్బుక్లో ఈ మేరకు పోస్టు పెట్టింది.. ఆమె దిగులుకు ఓ అర్థం కూడా ఉంది. ఎందుకంటే.. దొంగలు ఎత్తుకెళ్లిన ఏడు బోన్సాయ్ చెట్ల ధర రూ.83 లక్షలు పైమాటే.. అందులో ఈ షిమ్‌పకూ ధరే రూ.40 లక్షలకు పైగా ఉంటుందట. ఈమూరా భర్త సీజీ ఈమూరా కుటుంబం బోన్సాయ్ మొక్కల పెంపకంలో ఐదవతరానికి చెందినవారు. ఐదవ బోన్సాయ్ మాస్టర్ అన్నమాట. ఈ మొక్కని కూడా 400 ఏళ్ళ క్రితం పర్వతప్రాంతం నుంచి తీసుకొచ్చారు. క్రమంగా ఆ మొక్కని బోన్సాయ్గా మార్చడానికి ఈ కుటుంబం వందల ఏళ్ళు కష్టపడింది. ఇప్పుడిది మూడడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పు ఉంది. త్వరలో జరగబోయే బోన్సాయ్ ఫెయిర్ కోసం వీటిని సిద్ధం చేసి.. ఫొటోలు గట్రా తీయించారు కూడా.. ఇంతలో ఇలా జరిగిపోయింది.. పిల్లల్లా పెంచుకుంటున్న బోన్సాయ్‌లను దొంగిలించడంతో అల్లాడిపోయిన ఆ కుటుంబం చివరికి ఫేస్బుక్లో పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ దొంగలంటే తనకెంతో కోపంగా ఉందని.. అయితే.. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని.. సరిగా చూసుకోకపోతే.. అవి చనిపోతాయని.. ఇది తనకెంతో బాధను కలిగిస్తుందని ఈమూరా అంటున్నారు. ఈమూరా కుటుంబం తమ తోటలోని బోన్సాయ్‌లను చూసేందుకు అందరినీ అనుమతించేవారని.. సీసీటీవీలు వంటి భద్రత ఏర్పాట్లు కూడా లేవని.. దీంతో దొంగల పని సులువైందని పోలీసులు అంటున్నారు. ఈ దొంగతనం ఒక్కరోజులో జరిగిందని తాము భావించడం లేదని.. రోజుకొకటి చొప్పున తీసుకెళ్లి ఉండొచ్చని చెబుతున్నారు. దొంగతనం నేపథ్యంలో ఈమూరా ఇప్పుడు తమ బొన్సాయ్ గార్డెన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం!! -
బోన్సాయ్ మొక్కలపై ప్రచారం చేయాలి: తలసాని
సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రాచుర్యం పొందిన బోన్సాయ్ మొక్కల పెంపకంవల్ల కలిగే ప్రయోజనాలు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పుణేలో బోన్సాయ్ అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంట్లో బోన్సాయ్ మొక్కలు పెంచడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చన్నారు. ఇలాంటి సదస్సును హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తే ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు. 14 శాతం ఉన్న పచ్చదనాన్ని 30 శాతంకు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి కోట్లాది మొక్కలు నాటినట్లు వివరించారు. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన బోన్సాయ్ మొక్కల ప్రదర్శనకు 3వేల రకాల మొక్కలు వచ్చాయి. జర్మనీ, చైనా, ఫ్రాన్స్ తదితర 14 దేశాల నుండి ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి వీకే సింగ్, మహారాష్ట్ర ఆర్థిక, అటవీ శాఖ మంత్రి సునీల్ మంగత్వార్, స్వామి గోవింద దేవగిరి, అల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ ఎలియస్, పుణే మేయర్ ముక్తా తిలక్ తదితరులు పాల్గొన్నారు. -
గాల్లోకి లేస్తాయి.. గిరగిరా తిరుగుతాయి!!
బోన్సాయ్కి ఉన్న క్రేజ్ మనకు తెలిసిందే. ఈ మరుగుజ్జు చెట్లను పెంచడం ఓ కళ.. మరి దీనికి టెక్నాలజీ తోడైతే.. నాటి విఠలాచార్య సినిమాల్లోలాగా చెట్లు గాల్లోకి లేస్తాయి! అంతేకాదు.. గిరగిరా తిరుగుతాయి కూడా!! ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది అలాంటి ఎయిర్ బోన్సాయ్ల గురించే.. జపాన్‌కు చెందిన హోషించు అనే కంపెనీ ఈ ఎయిర్ బోన్సాయ్ల సృష్టికర్త. ఇంట్లో బోన్సాయ్ ఉంటే దాని అందమే వేరు. మరి ఇలా గాల్లో వేలాడుతూ.. తిరిగే బోన్సాయ్ చెట్టు ఉంటే ఇంటి అందం మరింత పెరుగుతుందని హోషించు ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఎయిర్ బోన్సాయ్లో రెండింటి పాత్ర కీలకం. ఒకటి గాల్లో వేలాడుతున్న మట్టితో కూడిన లిటిల్ స్టార్, రెండోది కింద ఉన్న ఎనర్జీ బేస్. ఎనర్జీ బేస్‌ను జపాన్ పింగాణీతో తయారుచేశారు. ఎయిర్ బోన్సాయ్ అయస్కాంత శక్తి ఆధారంగా పనిచేస్తుంది. రెండింటిలోనూ అయస్కాంతం ఉండటం వల్ల అవి వికర్షించుకుంటూ బోన్సాయ్ చెట్టు ఉండే లిటిల్ స్టార్ గాల్లో తేలుతున్నట్లు అవుతుంది. కింద ఉన్న ఎనర్జీ బేస్‌కు ఏసీ అడాప్టర్ ఉంటుంది. దాన్ని కనె క్ట్ చేస్తే.. లిటిల్ స్టార్ గిరగిరా తిరుగుతుంది. ఆ మధ్య మార్కెట్లోకి వచ్చిన ఓమ్/వన్ స్పీకర్లలో ఇలాంటి టెక్నాలజీనే వాడారు. ప్రస్తుతం హోషించు కంపెనీ నిధుల సేకరణ బాటలో ఉంది. పెట్టుబడులు పూర్తిగా సమకూరితే.. ఆగస్టు నుంచి ఎయిర్ బోన్సాయ్‌లను మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది. లిటిల్ స్టార్, ఎనర్జీ బేస్ ప్రాథమిక ధర రూ. 15,000. బోన్సాయ్ చెట్టు మాత్రం మీరే కొనుక్కోవాల్సి ఉంటుంది. -
అణుబాంబూ ఏమీ చేయలేకపోయింది!
మిరకెల్ ఈ ఫొటోలో కనిపిస్తున్న బోన్సాయ్ చెట్టు వయసు 390 సంవత్సరాలు. చెట్లు సుదీర్ఘకాలం జీవించడం సహజమే కదా! ఇందులో విశేషం ఏముందంటారా..? బోన్సాయ్ చెట్లు కొత్తేమీ కాదని అంటారా..? నిజమే! వృక్షాల ఆయుర్దాయం శతాబ్దాల తరబడి ఉండటంలో వింతేమీ లేదు. మహావృక్షజాతులను వామనవృక్షాలుగా మార్చి కుండీల్లో పెంచుకోవడమూ కొత్త కాదు. అయితే, జపాన్‌లోని ఈ బోన్సాయ్ చెట్టు అణుబాంబును తట్టుకుంది. దాదాపు డెబ్బయ్యేళ్ల కిందట అమెరికా ప్రయోగించిన అణుబాంబులు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అణుబాంబుల తాకిడికి మనుషులతో పాటు జంతువులు, పెనువృక్షాలు సైతం మలమల మాడిపోయాయి. అప్పట్లో ఈ బోన్సాయ్ చెట్టు హిరోషిమాలో ఉండేది. అణుబాంబు ధాటికి అన్నీ నాశనమైనా, అణుబాంబు పడిన ప్రదేశానికి కేవలం రెండు మైళ్ల దూరంలోని యమాకీ నర్సరీలో ఉన్న ఈ చెట్టు మాత్రం బతికే ఉంది. దీని యజమాని మసరు యమాకీ ఈ బుజ్జివృక్షాన్ని 1976లో అమెరికాకు కానుకగా ఇచ్చాడు. ఇప్పుడిది అమెరికాలో ఇంకా పచ్చగా కళకళలాడుతూ ఉంది. వైట్‌పైన్ జాతికి చెందిన ఈ బోన్సాయ్ చెట్టు తన సహజ ఆయుర్దాయానికి మించి ఇంకా జీవించి ఉండటంపై శాస్త్రవేత్తలు సైతం అబ్బురపడుతున్నారు.