గాల్లోకి లేస్తాయి.. గిరగిరా తిరుగుతాయి!!
బోన్సాయ్‌కి ఉన్న క్రేజ్ మనకు తెలిసిందే. ఈ మరుగుజ్జు చెట్లను పెంచడం ఓ కళ.. మరి దీనికి టెక్నాలజీ తోడైతే.. నాటి విఠలాచార్య సినిమాల్లోలాగా చెట్లు గాల్లోకి లేస్తాయి! అంతేకాదు.. గిరగిరా తిరుగుతాయి కూడా!! ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది అలాంటి ఎయిర్ బోన్సాయ్‌ల గురించే.. జపాన్‌కు చెందిన హోషించు అనే కంపెనీ ఈ ఎయిర్ బోన్సాయ్‌ల సృష్టికర్త. ఇంట్లో బోన్సాయ్ ఉంటే దాని అందమే వేరు. మరి ఇలా గాల్లో వేలాడుతూ.. తిరిగే బోన్సాయ్ చెట్టు ఉంటే ఇంటి అందం మరింత పెరుగుతుందని హోషించు ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఎయిర్ బోన్సాయ్‌లో రెండింటి పాత్ర కీలకం.
ఒకటి గాల్లో వేలాడుతున్న మట్టితో కూడిన లిటిల్ స్టార్, రెండోది కింద ఉన్న ఎనర్జీ బేస్. ఎనర్జీ బేస్‌ను జపాన్ పింగాణీతో తయారుచేశారు. ఎయిర్ బోన్సాయ్ అయస్కాంత శక్తి ఆధారంగా పనిచేస్తుంది. రెండింటిలోనూ అయస్కాంతం ఉండటం వల్ల అవి వికర్షించుకుంటూ బోన్సాయ్ చెట్టు ఉండే లిటిల్ స్టార్ గాల్లో తేలుతున్నట్లు అవుతుంది. కింద ఉన్న ఎనర్జీ బేస్‌కు ఏసీ అడాప్టర్ ఉంటుంది. దాన్ని కనె క్ట్ చేస్తే.. లిటిల్ స్టార్ గిరగిరా తిరుగుతుంది. ఆ మధ్య మార్కెట్లోకి వచ్చిన ఓమ్/వన్ స్పీకర్లలో ఇలాంటి టెక్నాలజీనే వాడారు. ప్రస్తుతం హోషించు కంపెనీ నిధుల సేకరణ బాటలో ఉంది. పెట్టుబడులు పూర్తిగా సమకూరితే.. ఆగస్టు నుంచి ఎయిర్ బోన్సాయ్‌లను మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది. లిటిల్ స్టార్, ఎనర్జీ బేస్ ప్రాథమిక ధర రూ. 15,000. బోన్సాయ్ చెట్టు మాత్రం మీరే కొనుక్కోవాల్సి ఉంటుంది.