అణుబాంబు విలయానికి 75 ఏళ్లు | Hiroshima Bomb Explosion Completed 75 Years | Sakshi
Sakshi News home page

వెయ్యి సూరీళ్లు ఒక్కసారి ప్రకాశిస్తే ఎలా ఉంటుంది?

Published Sun, Aug 9 2020 10:33 AM | Last Updated on Sun, Aug 9 2020 11:22 AM

Hiroshima Bomb Explosion Completed 75 Years - Sakshi

సెకను కాలంలో శరీరం అయిపులేకుండా కాలి బూడిదైంది ఎప్పుడు? ఏళ్లు గడుస్తున్నా ఆ ఒక్క రోజు నాటి స్మృతులు చెరిగిపోనిది ఎక్కడ?  ఈ మూడు ప్రశ్నలకు సమాధానం భూమ్మీద రెండే చోట్ల తెలుస్తాయి. అవే హిరోషిమా, నాగసాకి! జపాన్‌లోని ఈ నగరాల్లో అణుబాంబు విలయం సంభవించి 75 ఏళ్లు అవుతోంది! మానవాళిపై చెరగని మచ్చగా మిగిలిన ఆ మహోత్పాతం ఆనుపాను మరోసారి.... 

రెండో ప్రపంచ యుద్ధం పరిసమాప్తం కావడానికి హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన అణుబాంబులు కారణమయ్యాయని చరిత్ర చెబుతోంది. 1945  ఆగస్టు ఆరున హిరోషిమాపై ఆ తరువాత మూడు రోజులకు అంటే ఆగస్టు తొమ్మిదిన నాగసాకిపై అణుబాంబులు పడ్డాయి. ఈ రెండు ఘటనల్లో అక్కడికక్కడ మరణించిన వారి సంఖ్య సుమారు 1.40 లక్షలు అని అంచనా. బాంబు పడ్డ ప్రాంతాల నుంచి కిలోమీటర్‌ చుట్టుపక్కల ఉన్న వారందరూ సెకన్ల వ్యవధిలో మాడి మసైపోగా రేడియోధార్మికత ప్రభావం కారణంగా కేన్సర్ల బారినపడ్డవారు.. తరతరాలుగా ఇతర సమస్యలు అనుభవిస్తున్న వారు కోకొల్లలు. ఆగస్టు తొమ్మిదిన ఉదయం 11.02 గంటలకు ఫ్యాట్‌మ్యాన్‌ పేరుతో నేలజారిన అణుబాంబు దాదాపు 6.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భవనాలన్నింటినీ నేలమట్టం చేసిందంటే 22 కిలోటన్నుల అణుబాంబు సృష్టించే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. (లిటిల్‌ బాయ్‌ విధ్వంసం.. టార్గెట్‌ హిరోషిమానే ఎందుకు?)

బాంబు పడిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు నాలుగు వేల డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా.. కొన్ని రోజుల పాటు ఆ ప్రాంతంలో రేడియో ధారి్మకత వర్షంలా కురిసింది. నాగసాకిలో అణుబాంబు తాకిడికి వైద్యులు, నర్సులు ప్రాణాలు కోల్పోవడంతో కొంత కాలంపాటు ఆ ప్రాంతంలో గాయపడ్డ వారికి చికిత్స అందించే వారు కూడా కరువయ్యారు. దాడి తరువాత తమవారిని వెతుక్కునేందుకు సంఘటన స్థలానికి వచ్చిన వారిలోనూ అత్యధికులు రేడియోధార్మికత బారినపడ్డారు. కనీస చికిత్స లేకుండానే చాలామంది మరణించారు కూడా. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రేడియో ధార్మికత ప్రభావంతో ఆ ప్రాంతంలో కొన్నేళ్లపాటు రక్త కేన్సర్ల బారిన పడే వారి సంఖ్య ఎక్కుంది.

దశాబ్దకాలం తరువాత మిగిలిన వారిలో థైరాయిడ్, ఊపిరితిత్తులు, రొమ్ము కేన్సర్ల బారిన పడగా.. చాలామంది గర్భిణులకు గర్భస్రావం జరిగింది. రేడియోధార్మికత బారినపడ్డ పసిపిల్ల శారీరక, మానసిక ఎదుగుదల సమస్యలతో బాధపడ్డారు. ఇప్పటికీ వాటి దుష్ఫలితాలను అనుభవిస్తున్నారు కూడా. అయితే ఈ అణు విధ్వంసం మంచి విషయానికి పునాది వేసింది. ప్రపంచంలో ఏమూలనైనా ఇలాంటి ఉత్పాతం మరొకటి చోటు చేసుకోకుండా అణ్వ్రస్తాలపై నిషేధానికి కారణమైంది. ఆనాటి విధ్వంసాన్ని గుర్తు చేసుకునే లక్ష్యంతో ఏటా ఆగస్టు ఆరవ తేదీని హిరోషిమా డేగానూ, తొమ్మిదవ తేదీని నాగసాకి డేగానూ ఆచరిస్తున్నారు.

ఆ నగరాల ఎంపికకు కారణం... 
అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపైనే అణుబాంబులు కురిపించేందుకు ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. 1945 జూలై 16న అమెరికా ‘మాన్‌హాట్టన్‌ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన తొలి అణుబాంబును విజయవంతంగా పరీక్షించింది. న్యూ మెక్సికోలోని అలొమోగోర్డో ప్రాంతంలోని ‘ట్రినిటీ’ పరీక్ష కేంద్రంలో అణు పరీక్ష విజయవంతం కావడం.. రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తమ సత్తాను ప్రదర్శించేందుకు ఇదే సరైన సమయమని అమెరికా భావించడం అణు విధ్వంసానికి కారణమయ్యాయి. శాంతికి జపాన్‌ రాజు నిరాకరించడం.. యుద్ధంలో తమ సైనికుల మరణాలను తగ్గించేందుకు అణుబాంబులు ప్రయోగించడం మేలని అమెరికా భావించింది. ముందుగా కోకురా, హిరోషిమా, యుకోహామా, నీగటా, క్యోటో నగరాలపై బాంబులు వేయాలన్నది అమెరికా ప్రణాళిక. జపాన్‌ మిలటరీ కేంద్రంగా ఉన్న హిరోషిమా ఈ జాబితాలో ఉండగా.. నౌకాశ్రయ నగరమైన నాగసాకి  మాత్రం లేదు.

సాంస్కృతికంగా జపాన్‌కు క్యోటో చాలా ప్రధానమైన నగరం కావడం, అప్పటి అమెరికా యుద్ధ మంత్రి హెన్రీ స్టైమ్‌సన్‌కు ఆ నగరంపై మక్కువ ఉండటంతో చివరి క్షణాల్లో క్యోటో పేరు తొలగిపోయి నాగసాకి వచ్చి చేరింది. 1920 ప్రాంతంలో హెన్రీ స్టైమ్‌సన్‌ క్యోటో నగరాన్ని సందర్శించారని అక్కడే తన హనీమూన్‌ జరుపుకున్నారని అందుకే ఆయన  అణుబాంబు దాడి నుంచి క్యోటోను మినహాయించాలని అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్‌ను విజ్ఞప్తి చేశారని ఒక కథనం ప్రచారంలో ఉంది. 1945 జూలై 24న జపాన్‌పై అణుబాంబు దాడికి అధికారిక ఉత్తర్వులు వెలువడగా ఒక రోజు తరువాత క్యోటో పేరును కొట్టివేసి చేతితో నాగసాకి పేరు రాసినట్లు దస్తావేజులు చెబుతున్నాయి.  

నాగసాకిపైకి ‘ఫ్యాట్‌మ్యాన్‌’ను జారవిడిచిన బీ–29 సూపర్‌ఫోర్ట్‌ట్రెస్‌ పేరు బాక్‌స్కార్‌. హిరోషిమా కంటే కనీసం ఏడు కిలోటన్నుల ఎక్కువ సామర్థ్యమున్న బాంబును ప్రయోగించినప్పటికీ నాగసాకిలో జరిగిన విధ్వంసం సాపేక్షంగా తక్కువే. నగరం చుట్టూ పర్వత ప్రాంతాలు ఉండటంతో ఉరకామి లోయ ప్రాంతానికే నష్టం పరిమితమైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఆగస్టు తొమ్మిదిన నాగసాకిపై కాకుండా కోకురా నగరంపై దాడి జరగాల్సి ఉంది. మేజర్‌ ఛార్లెస్‌ స్వీనీ నడుపుతున్న బాక్‌స్కార్‌ కోకురాపై మూడుసార్లు చక్కర్లు కొట్టింది కూడా. అయితే బాగా మబ్బుపట్టి ఉండటం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో స్వీనీ మిగిలిన ఒకే ఒక్క లక్ష్యమైన నాగసాకిపై బాంబు జారవిడిచారు. 

అణు పరిజ్ఞానంతో ప్రయోజనాలు ఎన్నో..
టెక్నాలజీ రెండువైపులా పదును ఉన్న కత్తి అని అంటారు. అణుశాస్త్ర పరిజ్ఞానం కూడా ఇందుకు అతీతమేమీ కాదు. హిరోషిమా, నాగసాకిలపై బాంబుల ద్వారా విధ్వంసం సృష్టించిన అణు పరిజ్ఞానంతో భూమ్మీద పలు చోట్ల చీకట్లను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కనీసం 30 దేశాల్లో అణుశక్తి ద్వారా నిరంతర విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం కారణంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని శాంతియుత ప్రయోజనాలకు ఎవరైనా వాడుకునే వీలేర్పడింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఆహార భద్రతతోపాటు, మానవ ఆరోగ్యం, పర్యావరణం వంటి అనేక రంగాల్లో అణుశక్తి వినియోగం జరుగుతోంది.

వ్యవసాయ దిగుబడులను పెంచేందుకు మాత్రమే కాకుండా.. ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో జంతువ్యాధులను గుర్తించేందుకు అణుశక్తిని ఉపయోగిస్తున్నారు. పంట దిగుబడుల నిల్వకు భారతదేశంలోని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అణుశక్తి కేంద్రాల వ్యర్థాలను సమర్థంగా వాడుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా.. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సాయంతో కేన్సర్లతోపాటు పలు ఇతర వ్యాధుల చికిత్సలో అణుధారి్మక పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఎబోలా వంటి ప్రాణాంతక వైరస్‌ల గుర్తింపునకూ అణుశక్తి అక్కరకొస్తోంది. సముద్రజలాల కాలుష్యాన్ని గుర్తించేందుకు    మహా సముద్రాల ఆమ్లీకరణను నియంత్రించేందుకు కూడా అణువులను ఉపయోగిస్తున్నారు. హిరోషిమా, నాగసాకి అణుబాంబుల కారణంగా మరణించిన వారి సంఖ్య  1,50,000 – 2,46,000 నాగసాకిపై పడిన అణుబాంబు ‘ఫ్యాట్‌మ్యాన్‌’ ప్లుటోనియంతో తయారైంది.

యురేనియంతో తయారైన ‘లిటిల్‌బాయ్‌ హిరోషిమా విధ్వంసానికి కారణం.  లిటిల్‌ బాయ్‌ సామర్థ్యం 15 కిలోటన్నులు కాగా ఫ్యాట్‌మ్యాన్‌ ఇంకో ఏడు కిలోటన్నులు అధిక శక్తి గలది.  అమెరికా తొలి ప్రణాళిక ప్రకారం జపాన్‌లోని ఐదు నగరాలపై అణుదాడి జరగాల్సి ఉంది. ఇందులో నాగసాకి లేనే లేదు. అణు బాంబులతో దాడి చేస్తున్నట్లు అమెరికా ప్లాంప్లెట్ల ద్వారా ఇరు నగరాలను ముందే హెచ్చరించింది.  నాగసాకి ఉదంతం లాంటిది మరోటి జరగక్కుండా నిరోధించేందుకు ఐక్యరాజ్యసమితి అణ్వాయుధాలపై నిషేధం విధించింది.  అణ్వాయుధ దాడి తరువాత హిరొషిమాలో విరబూసిన తొలి పువ్వు ఓలియాండర్‌. ఈ కారణంగానే ఆగస్టు ఆరున హిరోషిమా డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఓలియాండర్‌ మొక్కలను నాటుతారు. అణుదాడి తరువాత హిరోషిమాలోని ఓ పార్కులో వెలిగించిన శాంతి జ్యోతి 1964 వరకూ అఖండంగా వెలిగింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement