హిరోషిమాపై అణుదాడికి నేటితో 80 ఏళ్లు
జపాన్‌లోని హిరోషిమా నగరంపై 1945 ఆగస్టు 6న, నాగసాకిపై ఆగస్టు 9న అమెరికా జారవిడిచిన అణుబాంబులు సుమారు 2 లక్షలకుపైగా పౌరులను బలి తీసు కున్నాయి. ఇవి చరిత్రలో మాయని మచ్చలు, అతిపెద్ద దుస్సంఘటనలు. అయినా దేశాలు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. ఒక్క క్షణంలో ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుధాలను పోగేస్తూనే ఉన్నాయి.
‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (సిప్రి) 2024 నివేదిక, అమెరికా వద్ద 5,044 అణ్వా యుధాలు ఉన్నట్టు తెలిపింది. అదే నివేదిక ప్రకారం, రష్యా దగ్గర 5,580, ఫ్రాన్స్ దగ్గర 290, చైనా దగ్గర 500, బ్రిటన్ దగ్గర 225, భారత్ దగ్గర 172 అణ్వాయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ కూడా అణుసంపత్తిని కలిగి ఉన్నాయి. పైగా ఈ దేశాలన్నీ తమ అణ్వాయుధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. చైనా దగ్గర గతేడాది 410 ఉండగా, ఇప్పుడది 500కు చేరింది. యుద్ధాల కారణంగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, రాజకీయ దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో అణ్వస్త్రాల పాత్ర ప్రముఖంగా మారిందని ‘సిప్రి’ రిపోర్ట్ పేర్కొన్నది.
అణ్వాయుధాలతో పాటు ఆయుధాలు కూడా ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేవే. ప్రపంచంలో ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాలలో అమెరికా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉన్నది. భారత్ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా రష్యా కొనసాగుతున్నది. భారత దిగుమతులలో రష్యా వాటా 36 శాతం. ఆయుధాల దిగుమతుల్లో మొదటి ఐదు స్థానాల్లో ఇండియా, సౌదీ అరేబియా, ఖతార్, ఉక్రెయిన్, పాకిస్తాన్ ఉన్నాయి. రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయిల్–పాలస్తీనా యుద్ధాలు కొనసాగుతున్న వేళ అణ్వాయుధాల భయం మళ్లీ పెరిగింది. ఆయా దేశాలు రక్షణ పేరుతో ఆయుధాలు పెంచుకుంటూ పోవడం ఆయుధ పోటీకి దారి తీస్తున్నది. – నర్సింగు కోటయ్య, మిర్యాలగూడ
Comments
Please login to add a commentAdd a comment