ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రదాడి ద్వారా 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పేందుకు భారత్ ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో పాక్ మీద కోపంతో ఆ దేశానికి టమాటాల ఎగుమతిని నిలిపివేశారు భారత వ్యాపారులు. నష్టం వచ్చిన పర్వాలేదు.. ఇక్కడి ప్రజలకే ఉచితంగా పంపిణీ చేస్తాం.. కానీ పాకిస్తాన్‌కు మాత్రం పంపేది లేదని స్పష్టం చేశారు. వ్యాపారులు తీసుకున్న నిర్ణయం తర్వాత భారత్ పాక్ బోర్డర్‌లో పెద్ద ఎత్తున టమాటా లారీలు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు టమాటాలు ఎగుమతి చేయని భారత్ మీద ఏకంగా ఆటం బాంబ్ వేయాలంటూ ఓ పాకిస్తాన్ టీవీ జర్నలిస్ట్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో పాకిస్తాన్ సీ42 అనే చానల్‌కు చెందిన జర్నలిస్ట్ ఒకరు మాట్లాడుతూ.. ‘మా దేశానికి ఇండియా టమాటాలు పంపించకపోవడం నీచమైన నిర్ణయం. ఆ టమాటాలను మోదీ, రాహుల్ గాంధీ ముఖం మీద కొడతాం. టమాటాలను ఆపి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇందుకు ఆటంబాంబుతో సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చింది’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
"Tamatar ka jawab atom bomb se de gay." So much trash on our tv channels #TaubaTaubapic.twitter.com/2myeGCvECw
— Naila Inayat नायला इनायत (@nailainayat) February 23, 2019
సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ వీడియోను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ‘మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించాడం’టూ కొందరు.. ‘భారత్‌ను ఆటం బాంబు నుంచి కాపాడేందుకు ఆ బికారి పాకిస్తాన్‌కు 3కిలోల టమాటాలు పంపించండిరా బాబూ’ అని మరి కొందరు ట్వీట్ చేస్తున్నారు. పుల్వామా ఉగ్ర దాడి అనంతరం పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచే క్రమంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద ట్యాక్స్‌ను 200శాతానికి పెంచింది. దీంతో దిగుమతులు తగ్గిపోయాయి. మరోవైపు భారత రైతులు కూడా తమ ఉత్పత్తులను పాక్‌కు ఎగుమతి చేయకుడదని నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment