
అణుబాంబు తయారుచేస్తున్న ఐఎస్ఐఎస్?
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఇప్పుడు ఏకంగా అణుబాంబు తయారు చేయడానికే ఆ సంస్థ సిద్ధమవుతోంది. ఇందుకోసం గతంలో ఇరాక్, సిరియాలలో దాడులు చేసినప్పుడు ఆస్పత్రులు, పరిశోధన సంస్థల నుంచి భారీ మొత్తంలో రేడియోధార్మిక పదార్థాలను సేకరించిందని, త్వరలోనే వాళ్లు పెద్ద 'డర్టీ బాంబు' చేయొచ్చని ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి జూలీ బీషప్ హెచ్చరించారు.
భారీస్థాయిలో ప్రాణనష్టాన్ని కలిగించే ఆయుధాలు రూపొందించాలన్నది తమ లక్ష్యమని గతంలోనే ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. అవసరమైతే పాకిస్థాన్ నుంచి అణ్వాయుధాలను స్మగుల్ చేసుకుని ఏడాదిలోగా అమెరికా మీద దాడి చేసేందుకు ఐఎస్ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రేడియోధార్మిక పదార్థాల చోరీపై నాటో కూడా ఆలోచిస్తోందని బిషప్ చెప్పారు. బ్యాంకుల నుంచి సొమ్ము దొంగిలించడంతోనే వాళ్లు ఆగిపోలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విషవాయువులతో కూడిన ఆయుధాలను కూడా ఐఎస్ఐఎస్ తయారుచేసే ప్రమాదం ఉందని ఆమె గతవారంలో పెర్త్లో చేసిన ప్రసంగంలో హెచ్చరించారు.