ఐఎస్‌పై బహుపరాక్!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఆఖరి దశ పోలింగ్ సమయంలో ఆ రాష్ట్ర రాజధాని లక్నోలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్ ఉదంతం సంచలం సృష్టించింది. అంతకు ముందు రోజు పొరుగునున్న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి సమీపంలో ప్యాసింజర్ రైలులో బాంబు పేలి 10మంది గాయపడిన ఘటనతో ప్రమేయమున్నదని చెబుతున్న ఉగ్రవాది సైఫుల్లా ఈ ఉదంతంలో హతమయ్యాడు. లక్నో ఎన్‌కౌంటర్ మంగళ వారం మధ్యాహ్నం మొదలై దాదాపు 11 గంటలు కొనసాగి బుధవారం తెల్లారు జామున ముగిసింది.
ఇంత సుదీర్ఘంగా ఎన్‌కౌంటర్ జరగడంవల్ల మాత్రమే కాదు.. మరణించిన సైఫుల్లాకు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో సంబంధాలుండవచ్చునన్న ఊహాగానాలు రావడం వల్ల, మరో ముగ్గురు పోలీసుల అదుపులో ఉండటం వల్ల కూడా లక్నో ఉదంతానికి ప్రాముఖ్యత ఏర్పడింది. ఎన్‌కౌంటర్ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. ఈ ఉదంతానికి ముందు యూపీలోనే వేర్వేరుచోట్ల మరో ముగ్గురు అరెస్టయ్యారు. సైఫుల్లా నేపథ్యం గురించి మీడియాకు వెల్లడించింది యూపీ పోలీసులే. ఇదే నిజమైతే దేశంలో ఆ సంస్థ జాడలున్నాయన్న అంచనాకు రాక తప్పదు. నిజానికి ఇరాక్‌లో ఐఎస్ ఇప్పుడు క్షీణ దశలో ఉన్నదన్న కథనాలు వెలువడుతున్నాయి. సంస్థ అధినేత అబూ బకర్ అల్ బగ్దాదీ ఓటమిని అంగీకరిస్తూ ‘స్వస్థలాలకైనా పొండి... చావనైనా చావండి’ అని శ్రేణులకు పిలుపునిచ్చాడని కూడా చెబుతున్నారు.
అలాంటి దశలో ఉన్న సంస్థ గురించి యూపీ పోలీసులు అతిగా చెబుతున్నారని కేంద్ర హోంశాఖ భావిస్తున్నట్టు మీడియా కథనాలు అంటున్నాయి. ఇందుకు యూపీ పోలీసుల్ని మాత్రమే తప్పుబట్టి ప్రయోజనం లేదు. వారికన్నా ముందు మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ కూడా ఆ మాదిరే చెప్పారు. రైలు బోగీలో జరిగిన పేలుడులో ఐఎస్ ప్రమేయంపై సాక్ష్యాధారాలు లభించాయని ఆయన ప్రకటించారు. ఆ రాష్ట్ర పోలీసులు మాత్రం కోర్టుకు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో పట్టుబడిన ముగ్గురూ సిమి, ఐఎస్ ఉగ్రవాద సంస్థలతో ప్రభావితమైనట్టు తెలిపారు. సైఫుల్లాకు ఐఎస్‌తో నేరుగా ప్రమేయం ఉండక పోవ చ్చునని, దానికి అనుబంధంగా ఉన్న ఖురసాన్‌లో పనిచేశాడని మరో కథనం. దీన్ని ఐఎస్ ఇరాన్‌లో నడుపుతోంది. మనదేశంలో దాని పేరు వినబడటం ఇదే తొలిసారి.
ఐఎస్ సంస్థ గురించి ఇంతగా ఆందోళన పడటానికి ఆ సంస్థ ఇరాక్, సిరి యాల్లో సాగించిన దుర్మార్గాలే కారణమని అందరికీ తెలుసు. సంస్థ అధినేత అబూ బకర్ అల్ బగ్దాదీ తన శ్రేణులకు పిలుపునిస్తూ ఈమధ్య విడుదల చేసిన వీడియోలో పశ్చిమ దేశాలపైనా, అరబ్ దేశాలపైనా దాడులకు పూనుకోమని చెప్పాడంటు న్నారు. అంతక్రితం భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అలవాటున్న బగ్దాదీ ఈసారి అందుకు భిన్నంగా చెప్పిన నేపథ్యంలో యూపీ పోలీసుల అంచనా తప్పు కావచ్చునని కేంద్రం ఆశిస్తున్నట్టుంది. మన దేశంలో ఇంతవరకూ ఐఎస్ కార్యకలా పాల జాడ లేదు. అయితే ఆ సంస్థ కార్యకలాపాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభావితులవుతున్న యువకులను వివిధ చోట్ల అడపా దడపా అరెస్టు చేస్తున్నారు. పోలీసుల కన్నుగప్పి దేశం దాటి వెళ్లిన వారూ ఉన్నారు. వారిలో కొందరు నిరాశానిస్పృహలకు లోనై వెనక్కి కూడా వచ్చారు. ఏ రకంగా చూసినా మన దేశాన్ని ఇంతవరకూ ఐఎస్ రిక్రూట్‌మెంట్ కేంద్రంగా మాత్రమే పరిగణించింది. ఇరాక్‌లోనూ, సిరియాలోనూ సాగించే పోరా టానికి వారిని తరలించింది. తాజా ఉదంతం నేపథ్యంలో ఇప్పుడు అందుకు భిన్న మైన వైఖరి తీసుకుందా అన్నది తేలాల్సి ఉంది.
ఉజ్జయిని ఉదంతంతో ప్రమేయమున్నవారు నేరుగా ఐఎస్‌తో సంబంధాలు పెట్టుకున్నారా లేక దానికి ప్రభావితమైనారా అన్నది పక్కనబెడితే ఆ యువకులు ఉగ్రవాద దాడికైతే పాల్పడగలిగారు. మన నిఘా సంస్థలు, శాంతిభద్రతల యంత్రాంగం తగినంత అప్రమత్తతతో లేవని రుజువుచేశారు. సక్రమంగా తనిఖీలు జరిగి ఉంటే వారి పథకం పారేది కాదు. నిజానికి ఉజ్జయిని, ఇండోర్‌లు సిమి సంస్థకు గట్టి పట్టున్న ప్రాంతాలని పేరు. అలాంటిచోట కూడా ఉదాసీనంగా వ్యవ హరించడం ప్రమాదకర సంకేతాలనిస్తుంది. పైగా ఉజ్జయినిలో ఉపయోగించిన బాంబును లక్నోలో సైఫుల్లా మరణించిన ఇంట్లోనే తయారుచేశారంటున్నారు. ఇంతక్రితం ఐఎస్‌తో ప్రభావితులైనవారు ఒకరిద్దరుగా పట్టుబడేవారు. ఈసారి ఏడెనిమిదిమంది అరెస్టయ్యారు. ఇదంతా పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఒకపక్క ఈ ఉగ్రవాదుల నేపథ్యంపై ఇన్ని అనుమానాలుండగా సైఫుల్లాను పోలీసులు సజీవంగా పట్టుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
మొదట ఆ స్థావరంలో ఇద్దరు యువకులున్నారని పోలీసులు చెప్పారు. కానీ అక్కడున్నది సైఫుల్లా ఒక్కడే అని తేలింది. అతన్ని లొంగదీసుకోవడానికి అతని సోదరుడితో ఫోన్ చేయిం చామని పోలీసులు చెబుతున్నారు. అది ఫలించకపోగా ఎదురుదాడికి దిగాడని అందువల్లే మట్టుబెట్టవలసి వచ్చిందని వారంటున్నారు. అయితే ప్రతి ఎన్‌కౌంటర్ ఉదంతంలోనూ వచ్చిన ఆరోపణలే ఈ ఎన్‌కౌంటర్‌పైనా వచ్చాయి. ఘటనాస్థలికి సమీపంగా ఉన్నవారు ఇరుపక్షాలమధ్యా అసలు కాల్పులే చోటుచేసుకోలేదని చెబుతున్నారు. నిజానికి మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆ ఇంటిపై పోలీసులు దాడిచేసి మరో గంటకు లోపలకు ప్రవేశించారన్నది వారి కథనం. ఆ తర్వాత కొద్దిసేపటికే కాల్పుల శబ్దం వినిపించిందని అంటున్నారు. ఇందుకు భిన్నంగా సాయంత్రం మొదలుకొని రాత్రంతా కాల్పులు ఎడతెగకుండా సాగా యని పోలీసులు చెబుతున్నారు.
ఏదేమైనా చెదురుమదురుగానే కావొచ్చుగానీ ఇటీవలికాలంలో రైళ్లను లక్ష్యంగా చేసుకున్న ఉదంతాలు ఎక్కువయ్యాయి. ఈ ఏడాది తొలి 40 రోజుల్లో 18 ఘటనలు జరిగాయి. అదృష్టవశాత్తూ ఎక్కడా ప్రాణనష్టం లేదు. మంగళవారం ఉజ్జయిని ఉదంతంతోపాటు కేరళలోని కన్నూరు జిల్లాలో పట్టాలకు దగ్గర్లో 13 నాటుబాంబులు లభ్యమయ్యాయి. మన నిఘా సంస్థలు, తనిఖీ బృందాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని... రైల్వే శాఖ తన భద్రతా వ్యవస్థను తక్షణం కట్టుదిట్టం చేసుకోవాల్సిన అగత్యాన్ని ఇవన్నీ తెలియజెబుతున్నాయి.