lucknow encounter
-
ఐఎస్‌పై బహుపరాక్!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఆఖరి దశ పోలింగ్ సమయంలో ఆ రాష్ట్ర రాజధాని లక్నోలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ ఉదంతం సంచలం సృష్టించింది. అంతకు ముందు రోజు పొరుగునున్న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి సమీపంలో ప్యాసింజర్ రైలులో బాంబు పేలి 10మంది గాయపడిన ఘటనతో ప్రమేయమున్నదని చెబుతున్న ఉగ్రవాది సైఫుల్లా ఈ ఉదంతంలో హతమయ్యాడు. లక్నో ఎన్కౌంటర్ మంగళ వారం మధ్యాహ్నం మొదలై దాదాపు 11 గంటలు కొనసాగి బుధవారం తెల్లారు జామున ముగిసింది. ఇంత సుదీర్ఘంగా ఎన్కౌంటర్ జరగడంవల్ల మాత్రమే కాదు.. మరణించిన సైఫుల్లాకు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో సంబంధాలుండవచ్చునన్న ఊహాగానాలు రావడం వల్ల, మరో ముగ్గురు పోలీసుల అదుపులో ఉండటం వల్ల కూడా లక్నో ఉదంతానికి ప్రాముఖ్యత ఏర్పడింది. ఎన్కౌంటర్ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. ఈ ఉదంతానికి ముందు యూపీలోనే వేర్వేరుచోట్ల మరో ముగ్గురు అరెస్టయ్యారు. సైఫుల్లా నేపథ్యం గురించి మీడియాకు వెల్లడించింది యూపీ పోలీసులే. ఇదే నిజమైతే దేశంలో ఆ సంస్థ జాడలున్నాయన్న అంచనాకు రాక తప్పదు. నిజానికి ఇరాక్‌లో ఐఎస్ ఇప్పుడు క్షీణ దశలో ఉన్నదన్న కథనాలు వెలువడుతున్నాయి. సంస్థ అధినేత అబూ బకర్ అల్ బగ్దాదీ ఓటమిని అంగీకరిస్తూ ‘స్వస్థలాలకైనా పొండి... చావనైనా చావండి’ అని శ్రేణులకు పిలుపునిచ్చాడని కూడా చెబుతున్నారు. అలాంటి దశలో ఉన్న సంస్థ గురించి యూపీ పోలీసులు అతిగా చెబుతున్నారని కేంద్ర హోంశాఖ భావిస్తున్నట్టు మీడియా కథనాలు అంటున్నాయి. ఇందుకు యూపీ పోలీసుల్ని మాత్రమే తప్పుబట్టి ప్రయోజనం లేదు. వారికన్నా ముందు మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ కూడా ఆ మాదిరే చెప్పారు. రైలు బోగీలో జరిగిన పేలుడులో ఐఎస్ ప్రమేయంపై సాక్ష్యాధారాలు లభించాయని ఆయన ప్రకటించారు. ఆ రాష్ట్ర పోలీసులు మాత్రం కోర్టుకు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో పట్టుబడిన ముగ్గురూ సిమి, ఐఎస్ ఉగ్రవాద సంస్థలతో ప్రభావితమైనట్టు తెలిపారు. సైఫుల్లాకు ఐఎస్‌తో నేరుగా ప్రమేయం ఉండక పోవ చ్చునని, దానికి అనుబంధంగా ఉన్న ఖురసాన్లో పనిచేశాడని మరో కథనం. దీన్ని ఐఎస్ ఇరాన్లో నడుపుతోంది. మనదేశంలో దాని పేరు వినబడటం ఇదే తొలిసారి. ఐఎస్ సంస్థ గురించి ఇంతగా ఆందోళన పడటానికి ఆ సంస్థ ఇరాక్, సిరి యాల్లో సాగించిన దుర్మార్గాలే కారణమని అందరికీ తెలుసు. సంస్థ అధినేత అబూ బకర్ అల్ బగ్దాదీ తన శ్రేణులకు పిలుపునిస్తూ ఈమధ్య విడుదల చేసిన వీడియోలో పశ్చిమ దేశాలపైనా, అరబ్ దేశాలపైనా దాడులకు పూనుకోమని చెప్పాడంటు న్నారు. అంతక్రితం భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అలవాటున్న బగ్దాదీ ఈసారి అందుకు భిన్నంగా చెప్పిన నేపథ్యంలో యూపీ పోలీసుల అంచనా తప్పు కావచ్చునని కేంద్రం ఆశిస్తున్నట్టుంది. మన దేశంలో ఇంతవరకూ ఐఎస్ కార్యకలా పాల జాడ లేదు. అయితే ఆ సంస్థ కార్యకలాపాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభావితులవుతున్న యువకులను వివిధ చోట్ల అడపా దడపా అరెస్టు చేస్తున్నారు. పోలీసుల కన్నుగప్పి దేశం దాటి వెళ్లిన వారూ ఉన్నారు. వారిలో కొందరు నిరాశానిస్పృహలకు లోనై వెనక్కి కూడా వచ్చారు. ఏ రకంగా చూసినా మన దేశాన్ని ఇంతవరకూ ఐఎస్ రిక్రూట్మెంట్ కేంద్రంగా మాత్రమే పరిగణించింది. ఇరాక్‌లోనూ, సిరియాలోనూ సాగించే పోరా టానికి వారిని తరలించింది. తాజా ఉదంతం నేపథ్యంలో ఇప్పుడు అందుకు భిన్న మైన వైఖరి తీసుకుందా అన్నది తేలాల్సి ఉంది. ఉజ్జయిని ఉదంతంతో ప్రమేయమున్నవారు నేరుగా ఐఎస్‌తో సంబంధాలు పెట్టుకున్నారా లేక దానికి ప్రభావితమైనారా అన్నది పక్కనబెడితే ఆ యువకులు ఉగ్రవాద దాడికైతే పాల్పడగలిగారు. మన నిఘా సంస్థలు, శాంతిభద్రతల యంత్రాంగం తగినంత అప్రమత్తతతో లేవని రుజువుచేశారు. సక్రమంగా తనిఖీలు జరిగి ఉంటే వారి పథకం పారేది కాదు. నిజానికి ఉజ్జయిని, ఇండోర్లు సిమి సంస్థకు గట్టి పట్టున్న ప్రాంతాలని పేరు. అలాంటిచోట కూడా ఉదాసీనంగా వ్యవ హరించడం ప్రమాదకర సంకేతాలనిస్తుంది. పైగా ఉజ్జయినిలో ఉపయోగించిన బాంబును లక్నోలో సైఫుల్లా మరణించిన ఇంట్లోనే తయారుచేశారంటున్నారు. ఇంతక్రితం ఐఎస్‌తో ప్రభావితులైనవారు ఒకరిద్దరుగా పట్టుబడేవారు. ఈసారి ఏడెనిమిదిమంది అరెస్టయ్యారు. ఇదంతా పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఒకపక్క ఈ ఉగ్రవాదుల నేపథ్యంపై ఇన్ని అనుమానాలుండగా సైఫుల్లాను పోలీసులు సజీవంగా పట్టుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొదట ఆ స్థావరంలో ఇద్దరు యువకులున్నారని పోలీసులు చెప్పారు. కానీ అక్కడున్నది సైఫుల్లా ఒక్కడే అని తేలింది. అతన్ని లొంగదీసుకోవడానికి అతని సోదరుడితో ఫోన్ చేయిం చామని పోలీసులు చెబుతున్నారు. అది ఫలించకపోగా ఎదురుదాడికి దిగాడని అందువల్లే మట్టుబెట్టవలసి వచ్చిందని వారంటున్నారు. అయితే ప్రతి ఎన్కౌంటర్ ఉదంతంలోనూ వచ్చిన ఆరోపణలే ఈ ఎన్కౌంటర్పైనా వచ్చాయి. ఘటనాస్థలికి సమీపంగా ఉన్నవారు ఇరుపక్షాలమధ్యా అసలు కాల్పులే చోటుచేసుకోలేదని చెబుతున్నారు. నిజానికి మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆ ఇంటిపై పోలీసులు దాడిచేసి మరో గంటకు లోపలకు ప్రవేశించారన్నది వారి కథనం. ఆ తర్వాత కొద్దిసేపటికే కాల్పుల శబ్దం వినిపించిందని అంటున్నారు. ఇందుకు భిన్నంగా సాయంత్రం మొదలుకొని రాత్రంతా కాల్పులు ఎడతెగకుండా సాగా యని పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా చెదురుమదురుగానే కావొచ్చుగానీ ఇటీవలికాలంలో రైళ్లను లక్ష్యంగా చేసుకున్న ఉదంతాలు ఎక్కువయ్యాయి. ఈ ఏడాది తొలి 40 రోజుల్లో 18 ఘటనలు జరిగాయి. అదృష్టవశాత్తూ ఎక్కడా ప్రాణనష్టం లేదు. మంగళవారం ఉజ్జయిని ఉదంతంతోపాటు కేరళలోని కన్నూరు జిల్లాలో పట్టాలకు దగ్గర్లో 13 నాటుబాంబులు లభ్యమయ్యాయి. మన నిఘా సంస్థలు, తనిఖీ బృందాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని... రైల్వే శాఖ తన భద్రతా వ్యవస్థను తక్షణం కట్టుదిట్టం చేసుకోవాల్సిన అగత్యాన్ని ఇవన్నీ తెలియజెబుతున్నాయి. -
దాడులపై ఇంత అలక్ష్యమా?
అమెరికాలోని భారతీయులపై జాత్యహంకార దాడుల పట్ల లోక్‌సభలో విపక్షాలు ధ్వజం ► ప్రధాని మౌనంపై ప్రశ్నాస్త్రాలు ► వచ్చే వారం ప్రకటన చేస్తామని హోం మంత్రి వెల్లడి న్యూఢిల్లీ: పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. లోక్‌సభ జీరో అవర్‌లో అమెరికాలో భారతీయులపై దాడులను చర్చించారు. అలాగే లక్నో ఎన్కౌంటర్, ఉగ్రవాదుల అరెస్టుపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 12తో ముగుస్తాయి. అమెరికాలో భారతీయులపై వరుసగా జరుగుతున్న జాత్యహంకార దాడులపై లోక్‌సభలో విపక్ష ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీలు ఈ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారంటూ వారు ప్రశ్నించారు.ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాలో విద్వేషపూరిత నేరాలు పెరిగాయంటూ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో విద్వేషపూరిత దాడులపై ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాల్ని స్పీకర్ తిరస్కరించడంతో జీరో అవర్‌లో విపక్ష ఎంపీలు ఆ అంశాన్ని లేవనెత్తారు. ఇలాంటి సందర్భాల్లో పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక ఉందో సభకు వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. అమెరికాతో ఈ అంశంపై చర్చించడంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. దాడుల్ని ఖండించడంలో గాని, అమెరికాతో ఉన్నత స్థాయిలో సమస్య పరిష్కారానికి కృషిచేయడంలో గానీ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ‘మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది. ప్రతి అంశంపై మోదీ వరుస ట్వీట్లు చేస్తారు, ఇంత తీవ్ర అంశంపై ఎందుకు స్పందించడం లేదు’ అని ఖర్గే ప్రశ్నించారు. విదేశీ నేతల్ని కౌగిలించుకుంటూ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో కలసి ఊయల ఊగుతూప్రధాని కనిపిస్తుంటారని వ్యంగ్యా స్ర్తాలు సంధించారు. అమెరికాలోని భారతీయుల ప్రయోజనాల్ని పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ ఆరోపించారు. ఎంతో వాగ్ధాటి గల ప్రధానమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అమెరికాలో సురక్షితం కాని ప్రదేశాల గురించి పేర్కొంటూ సలహాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని, అమెరికా వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక జారీచేయాలని బీజేడీ ఎంపీ భర్తృహరి మహతబ్ కోరారు. వీటికి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానమిస్తూ.. భారతీయులపై దాడుల్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. విదేశాల్లోని భారతీయులు తాము భద్రంగా ఉన్నామని భావించేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అనారోగ్యంతో ఉన్నారని గుర్తుచేస్తూ... ఈ అంశంపై వచ్చేవారం లోక్‌సభలో విస్పష్ట ప్రకటన చేస్తామని చెప్పారు. అంతకుముందు జీరో అవర్‌లో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని, వాటిని పార్లమెంట్‌కు వెల్లడించాలని, అలాగే అమెరికా ప్రభుత్వంతో చర్చించాలని ఆయన కోరారు. మరికొన్ని పార్టీలకు చెందిన ఎంపీలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభ వాయిదా ఇటీవల సిట్టింగ్ ఎంపీ హజీ అబ్దుల్ సలాం మరణించడంతో ఆయనకు నివాళిగా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. మాజీ సభ్యులు రబీరే, పి.శివశంకర్, పి.రాధాకృష్ణ, సయ్యద్ షాబుద్దీన్ ల మృతికి కూడా రాజ్యసభ సంతాపం తెలిపింది. ఎన్ ఐఏకు అనుమానిత ఉగ్ర కేసులు: రాజ్‌నాథ్ లక్నో ఎన్ కౌంటర్‌తో పాటు అనుమానిత ఉగ్రవాద కేసుల్ని ఎన్ ఐఏకు అప్పగించామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బుధవారం లక్నోలో జరిగిన కాల్పుల్లో అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ సైఫుల్లా హతమయ్యాడని, అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో పోలీసులు ఆరుగురు అనుమానితుల్ని అరెస్టు చేశారని ఆయన లోక్‌సభకు తెలిపారు. ఇరు రాష్ట్రాల పోలీసులు సరైన సమయంలో స్పందించి జాతీయ భద్రతకు పెద్ద ముప్పును తప్పించారని పేర్కొన్నారు. ఇదంతా రాష్ట్ర పోలీసులు, కేంద్ర నిఘా సంస్థల మధ్య అద్భుతమైన సహకారంతోనే సాధ్యమైందన్నారు. ‘నా కొడుకు దేశానికి విధేయంగా ఉండకపోతే, మాకెలా విధేయంగా ఉంటాడు’ అని సైఫుల్లా తండ్రి మహమ్మద్ సర్తాజ్ చెప్పడాన్ని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించగా, సభ్యులు బల్లలు చరిచి సంతోషాన్ని వ్యక్తం చేశారు. -
అతని మృతదేహాన్ని తండ్రి తీసుకోలేదు
న్యూఢిల్లీ: భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలు పేలుడు ఘటనలో నిందితుడు మహ్మద్ సైఫురుల్లా మృతదేహాన్ని తీసుకునేందుకు అతని తండ్రి నిరాకరించారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. గురువారం ప్రారంభమైన పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాల్లో రాజ్‌నాథ్.. లక్నో ఎన్‌కౌంటర్‌పై ప్రకటన చేశారు. గురువారం ఉదయం లక్నో శివారులో భద్రత దళాలు.. సైఫురుల్లాను హతమార్చినట్టు చెప్పారు. భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడు ఘటనకు కాన్పూర్‌కు చెందిన సైఫుల్లా కారణమని, మధ్యప్రదేశ్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులను అప్రమత్తం చేశారని రాజ్‌నాథ్ చెప్పారు. నిందితుడు సైఫుల్లా లక్నోలోని ఓ ఇంటిలో తలదాచుకున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారని తెలిపారు. పోలీసులు హెచ్చరించినా సైఫుల్లా లొంగిపోలేదని, దీంతో అతడ్ని మట్టుబెట్టారని చెప్పారు. సైఫుల్లా మృతదేహాన్ని తీసుకునేందుకు అతని తండ్రి నిరాకరించాడని తెలిపారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడు పదార్థాలను పేల్చడంతో 10 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. -
ఇల్లు వదిలి వెళ్లిపోయి.. ఉగ్రవాదులయ్యారు!
మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని ప్యాసింజర్ రైల్లో పేలుడుతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఆ కేసుకు సంబంధించి సైఫుల్లా అనే వ్యక్తిని లక్నోలో పోలీసులు సుదీర్ఘ ఎన్కౌంటర్లో హతమార్చారు. అతడి బంధువులు, స్నేహితులలో ముగ్గురిని అరెస్టు చేశారు. వీళ్లందరికీ ఒకే రకమైన నేపథ్యం ఉంది. అందరూ తల్లిదండ్రుల మీద కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయినవాళ్లే. తాము పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామని తమవాళ్లను మభ్యపెట్టినవాళ్లే. వీళ్లంతా కలిసి ఉగ్రవాదం బాట పట్టారు. ఉగ్రవాద సంస్థల పంచన చేరి.. దేశద్రోహానికి ఒడిగట్టారు. అందుకే ఎన్కౌంటర్లో మరణించిన సైఫుల్లా మృతదేహాన్ని తీసుకోడానికి అతడి తండ్రి సర్తాజ్ ఖాన్ నిరాకరించారు. దేశానికి వ్యతిరేకంగా ఉన్నవాడిని ఈ దేశపు మట్టిలో ఎలా కలుపుతానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి ముఖం చూడటం కూడా తనకు ఇష్టం లేదంటూ వెళ్లిపోయారు. బీకాం చదివిన సైఫుల్లా.. రెండున్నర నెలల క్రితం తండ్రి మీద కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎప్పుడూ వాట్సప్ చూసుకోవడం తప్ప ఏమీ చేయడం లేదని ఆయన తిట్టడమే అందుకు కారణం. దుబాయ్ వెళ్లి అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటానని, అందుకోసం వీసా సంపాదించేందుకు ఢిల్లీ వెళ్తున్నానని సైఫుల్లా చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి అతడి స్నేహితుడు ఆతిఫ్ ముజఫర్ కూడా తాను ఢిల్లీ వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకుంటానంటూ తన తల్లి మీద ఒత్తిడి తెస్తున్నాడు. అతడికి తండ్రి లేరు. అతడిని పంపడానికి తల్లికి ఇష్టం లేదు. అన్నతో కలిసి డెయిరీ వ్యాపారం చూసుకొమ్మని తాను చెప్పానని, కానీ అతడు తన మాట వినకపోగా, తనకు చెప్పకుండా వెళ్లిపోయాడని ఆమె వాపోయారు. నిజానికి వీళ్లిద్దరూ కలిసి వెళ్లింది ఢిల్లీ కాదు.. కాన్పూర్! అక్కడ ఉగ్రవాద సంస్థలతో వీరికి పరిచయం ఏర్పడింది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సైఫుల్లా తెల్లవారుజామునే ఇంట్లోంచి వెళ్లిపోయి అర్ధరాత్రి వచ్చేవాడని, ఇంట్లో ఉన్నా సెల్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ చూసుకుంటూ కూర్చునేవాడని సర్తాజ్ ఖాన్ చెప్పారు. అతడి గాడ్జెట్లను ఎవరైనా ముట్టుకున్నా విపరీతమైన కోపం వచ్చేదని.. పిల్లలను కూడా ముట్టుకోనిచ్చేవాడు కాడని అన్నారు. తనకు మంచి ఉద్యోగం దొరికిందని.. కుటుంబంలో ఎవరూ ఎప్పుడూ ఊహించలేనంత పెద్ద మొత్తం సంపాదిస్తానని ఆ తర్వాత తన అన్నతో సైఫుల్లా చెప్పాడు. సైఫుల్లాకు ఉన్న మరో స్నేహితుడు ఆతిఫ్, అతడి బంధువు డానిష్ తరచు గంగానది ఒడ్డున కలుస్తుండేవారు. వీళ్లందరికీ టీ అంటే ఇష్టం. అక్కడే కూర్చుని పలు కప్పులు తాగేవారు. కానీ టీ తాగేటప్పుడు కూడా ఫోన్లలో వీడియోలు చూస్తూనే ఉండేవారు తప్ప తనవైపు కూడా చూసేవారు కారని అక్కడి టీ దుకాణం యజమాని అన్నారు. వీళ్లలో ఆతిఫ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో డిప్లొమా చదివేవాడు. 2013లో తండ్రి చనిపోవడంతో చదువు మానేశాడు. అతడిని ఎవరైనా ఏమైనా అడిగితే ఇట్టే కోపం వచ్చేసేదని అతడి సోదరుడు తెలిపారు. గత రెండు నెలల్లో ఆతిఫ్ తన తల్లికి ఫోన్ చేసినా, ఆమె మాట్లాడేవారు కారు. చిట్టచివరిసారిగా తన అక్కకు ఫోన్ చేసి, ముంబైలో ఉద్యోగం వచ్చిందని చెప్పాడని, ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేయలేదని అతడి తల్లి తెలిపారు. సుమారు పది నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా ఆతిఫ్ సౌదీ అరేబియాలో హజ్ యాత్రకు వెళ్లాడని అంటున్నారు. అందుకోసం కుటుంబానికి చెందిన భూమిని 22 లక్షల రూపాయలకు అతడు అమ్మేశాడు. ఆతిఫ్, డానిష్లతో పాటు అలీగఢ్ యూనివర్సిటీకి చెందిన వాళ్ల స్నేహితుడు ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. -
లొంగిపోవాలని చెబితే.. మాపై కాల్పులు!
లక్నో: ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో ఆ ఇంట్లో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నారని, అయితే ఐసిస్ తో వీరికి లింక్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని లా అండ్ ఆర్డర్ ఏడీజీ దల్జీత్ చౌదరీ తెలిపారు. ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడారు. నిందితుడు సైఫుల్లా ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడని తెలిపారు. ఉగ్రవాదుల కదలికలపై సమచారం అందుకున్న తమ టీమ్ అక్కడికి చేరుకుని.. లొంగిపోవాలని నిందితులకు ఎంత చెప్పినా వినిపించుకోలేదన్నారు. సైఫుల్లా సోదరుడు ఖలీద్ ఫోన్లో ఏడుస్తూ బతిమాలిడినప్పటికీ అతడి మనసు కరగలేదు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. సుదీర్ఘంగా ఎదురు కాల్పులు జరిగిన తర్వాత.. తెల్లవారుజామున దాదాపు 3 గంటల ప్రాంతంలో అవతలి నుంచి కాల్పులు ఆగిపోయాయని, ఇంట్లోకి వెళ్లి చూడగా సైఫుల్లా మృతదేహం కనిపించిందని, ఇతర నిందితులు పరారయ్యారని ఏడీజీ వెల్లడించారు. పోలీసులు తొలుత టియర్‌గ్యాస్, చిల్లీ పౌడర్ మిక్స్డ్ బాంబులు తదితరమైన ప్రయోగాలు చేశారని, చివరగా ఎదురు కాల్పులు జరిపాల్సి వచ్చిందన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ఇంట్లో 650 రౌండ్ల బుల్లెట్లు, 8 గన్స్, 45 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 3 పాస్ పోర్టులు, 4 కత్తులు, సెల్ ఫోన్లు, టైమర్లు, వైర్లు, బాంబు తయారీ సామాగ్రిని సీజ్ చేసినట్లు దల్జీత్ చౌదరీ వివరించారు. మరణించిన ఉగ్రవాది సైఫుల్లాకు ఉజ్జయిని ప్యాసింజర్ రైలు పేలుడుతో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
‘సోదరుడు వద్దని ఏడుస్తున్నా అతడు వినలేదు’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాజధాని లక్నో శివారు ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకునేందుకు పోలీసులు, బలగాలు తీవ్రంగా ప్రయత్నించారట. కానీ, పోలీసు అధాకారుల, సైనిక బలగాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరో ప్రత్యామ్నాయం లేక కాల్పులు జరపడంతో అతడు చనిపోయాడని అధికారులు చెప్పారు. సొంత సోదరుడితో ఫోన్ చేయించి మాట్లాడించినా అతడు వినకుండా తిరగబడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర చేశారు. రైళ్లను పేల్చి వేసే కుట్రలు చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బలగాలు ఇద్దరు ఉగ్రవాదులు లక్నో శివారులోని ఓ ఇంట్లో తల దాచుకున్నట్లు గుర్తించారు. ఆ ఇద్దరిలో ఒకరు సైఫుల్లా అనే ఉగ్రవాదిగా గుర్తించారు. అతడిని కాన్పూర్ అని తెలుసుకొని ప్రాణాలతో బందించేందుకు దాదాపు పన్నెండుగంటలుపాటు తీవ్రంగా శ్రమించారు. తొలుత అతడిని లొంగిపోవాలని ఆదేశించినా వినకపోవడంతో సోదరుడితో ఫోన్ చేయించి తలుపు కిందంగా ఫోన్ అందించి మాట్లాడించే ప్రయత్నం చేశారు. సైఫుల్లా సోదరుడు ఖలీద్ ఫోన్లో ఏడుస్తూ బతిమాలిడినప్పటికీ అతడి మనసు కరగలేదు. దీంతో పోలీసులు తొలుత టియర్‌గ్యాస్, చిల్లీ పౌడర్ మిక్స్డ్ బాంబులు తదితరమైన ప్రయోగాలు చేశారు. దీంతో చివరకు పోలీసుల కాల్పుల్లో అతడు మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు కూడా నిరాకరించారు. అతడు ఎంతటి దుర్మార్గపు పనులో చేశాడు తమకు నిన్న సాయంత్రమే తెలిసిందని, తాము చెప్పిన మాట వినకుండా దుశ్చర్యలకు పాల్పడిన అతడి మృతదేహం తమకు వద్దని చెప్పారు. అతడి వద్ద పెద్ద మొత్తంలో బాంబులు, రైలు రాకపోకల వివరాలకు సంబంధించిన టైమ్ టేబుల్ స్వాధీనం అయింది. దీని ప్రకారం పెద్ద మొత్తంలో రైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. లక్నోలో ఇద్దరు ఉగ్రవాదులు ఒక చోట నక్కి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) బృందం రంగంలోకి దిగి ఎదురు కాల్పులకుదిగింది. అంతకుముందు వారిని ప్రాణాలతో పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసి చివరకు తుదముట్టించింది. -
పెట్టినవి పైపు బాంబులు.. సిరియాకు ఆ ఫొటోలు!
భారతదేశంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం వేళ్లూనుకోడానికి ప్రయత్నిస్తోందన్న సూచనలు ఇప్పటికే వచ్చాయి. వాటిని బలపరిచేలా మరిన్ని అంశాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. భోపాల్ - ఉజ్జయిని ప్యాసింజర్ రైల్లో పేలుడు కోసం ఉగ్రవాదులు ఉపయోగించినవి పైపు బాంబులని, వాటి ఫొటోలను వాళ్లు సిరియాకు కూడా పంపారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అదృష్టవశాత్తు అది ఎవరికీ కనపడకుండా ఉండాలని వాళ్లు పై బెర్తులో పెట్టడంతో బాంబు పేలుడు వల్ల రైలు పైకప్పు మాత్రం ధ్వంసమైందని, అదే లోయర్ బెర్తు కింద పెట్టి ఉంటే చాలా పెద్ద నష్టమే సంభవించి ఉండేదని చౌహాన్ అన్నారు. కాన్పూర్, కనౌజ్ల నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఇక్కడ బాంబులు పెట్టిన వెంటనే లక్నో వెళ్లిపోదామని ప్లాన్ చేసుకున్నారని, వాళ్లు లక్నో నుంచి మధ్యప్రదేశ్‌కు పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చారని సీఎం చౌహాన్ వివరించారు. వాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల మీద 'ఐసిస్.. మేం ఇండియాలో ఉన్నాం' అని రాసి ఉందని తెలిపారు. ఉగ్రవాదులు తాము రైల్లో పెట్టిన పైపు బాంబు ఫొటోలు తీసి, వాటిని సిరియాకు పంపారని కూడా ఆయన వివరించారు. దాన్ని బట్టి చూసినా.. వాళ్లు ఐసిస్‌కు చెందినవారేనని స్పష్టం అవుతోందన్నారు. ఉదయం 7.30 గంటల సమయంలో వాళ్లు బాంబు పెట్టి, రెండు గంటల తర్వాత పేలేలా టైం సెట్ చేశారని, మధ్యప్రదేశ్ ఏటీఎస్ బృందాలు కేంద్ర నిఘా సంస్థలను సంప్రదించి, ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పట్టుకున్నాయని ఆయన తెలిపారు. అతీఫ్ ముజఫర్ అనే వ్యక్తి కుట్రకు సూత్రధారి అని, అతడితో పాటు మహ్మద్ డానిష్, సయ్యద్ మీర్ హుస్సేన్ అనే ఇద్దరిని కూడా పోలీసులు పట్టుకున్నారన్నారు. పేలుడు సంభవించిన కొద్దిసేపటి తర్వాత ఈ ముగ్గురినీ పిపారియా బస్ స్టాప్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. రైల్లోకి అనుమానిత వస్తువులతో వీళ్లు ప్రవేశిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాళ్ల వద్ద రైలు టికెట్లతో పాటు పేలుడుకు సంబంధించిన వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇదే పేలుడుకు సంబంధించి మరో ఉగ్రవాది సైఫుల్లా లక్నోలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. -
భారత్‌లో ఐసిస్ తొలి పంజా?
ముగిసిన లక్నో ఎన్కౌంటర్ 12 గంటల పాటు ఉగ్రవాదితో పోరు సైఫుల్లా అనే ఉగ్రవాది హతం మైక్రోట్యూబ్ కెమెరాలతో పరిశీలన లక్నో: ఇరాక్, సిరియా దేశాల్లో చావుదెబ్బ తిన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ వేరే దేశాల వైపు చూస్తోందా? ఉగ్రవాద చర్యలకు తరచు టార్గెట్ అవుతున్న భారతదేశం దానికి ఇప్పుడు స్థావరం కాబోతోందా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఐఎస్ చెరలో ఉండి, ఇటీవలే దాని బారి నుంచి బయటపడిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన డాక్టర్ కొసనం రామ్మూర్తి కూడా ఇదే విషయం చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ సంస్థ భారతదేశాన్ని తన తదుపరి టార్గెట్‌గా చేసుకోవాలనుకుంటోందని ఆయన తెలిపారు. తాను వాళ్ల చెరలో ఉన్నప్పుడు వాళ్ల మాటలను బట్టి ఆ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు. ఇప్పుడు తాజాగా లక్నోలో జరిగిన ఘటన చూస్తే.. ఇస్లామిక్ స్టేట్ సంస్థ నెమ్మదిగా ఇక్కడ అడుగు మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడు సంభవించింది. ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా కలాపీపల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పేలుడులో గన్‌పౌడర్ కనిపించిందని, దాన్నిబట్టి చూస్తే ఇది ఉగ్రవాద చర్య కావచ్చని ప్రాథమికంగా పోలీసు అధికారులు అంచనాకు వచ్చారు. ఆ తర్వాత దానికి సంబంధం లేకుండా ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఇద్దరు ఉగ్రవాదులు ఒక చోట నక్కి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) బృందం రంగంలోకి దిగింది. చాలాసేపు ఎదురు కాల్పులు జరిగిన తర్వాత.. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అవతలి నుంచి కాల్పులు ఆగిపోయాయి. అప్పటికే స్మోక్ బాంబులు, టియర్ గ్యాస్.. ఇలా చాలా ప్రయోగాలు చేశారు. చివరకు లోపలకు వెళ్లి చూస్తే.. ఒక్క ఉగ్రవాది మృతదేహం కనిపించింది. అతడి దగ్గర ఒక పిస్టల్, ఒక రివాల్వర్, కత్తి.. ఇలాంటి ఆయుధాలు దొరికాయి. మరణించిన ఉగ్రవాది పేరు సైఫుల్లా అని.. అతడికి ఉజ్జయిని ప్యాసింజర్ రైలు పేలుడుతో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముందుగా తాము మైక్రోట్యూబ్ కెమెరాలు ఉపయోగించామని, దాన్ని బట్టి చూస్తే చీకట్లో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు అనిపించిందని ఏటీఎస్ సీనియర్ అధికారి అసీమ్ అరుణ్ చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో మొదలైన ఆపరేషన్.. దాదాపు 12 గంటల పాటు కొనసాగి, తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ముగిసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రభావంతోనే సైఫుల్లా పనిచేశాడని, ఐసిస్ ఖురసాన్ మాడ్యూల్‌కు చెందివాడని యూపీ పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి అత్యంత కీలకమైన చిట్టచివరి దశ పోలింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు వరకు ఈ ఎన్కౌంటర్ మొత్తం కొనసాగడం విశేషం.