‘సోదరుడు వద్దని ఏడుస్తున్నా అతడు వినలేదు’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాజధాని లక్నో శివారు ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకునేందుకు పోలీసులు, బలగాలు తీవ్రంగా ప్రయత్నించారట. కానీ, పోలీసు అధాకారుల, సైనిక బలగాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరో ప్రత్యామ్నాయం లేక కాల్పులు జరపడంతో అతడు చనిపోయాడని అధికారులు చెప్పారు. సొంత సోదరుడితో ఫోన్ చేయించి మాట్లాడించినా అతడు వినకుండా తిరగబడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర చేశారు. రైళ్లను పేల్చి వేసే కుట్రలు చేశారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బలగాలు ఇద్దరు ఉగ్రవాదులు లక్నో శివారులోని ఓ ఇంట్లో తల దాచుకున్నట్లు గుర్తించారు. ఆ ఇద్దరిలో ఒకరు సైఫుల్లా అనే ఉగ్రవాదిగా గుర్తించారు. అతడిని కాన్పూర్ అని తెలుసుకొని ప్రాణాలతో బందించేందుకు దాదాపు పన్నెండుగంటలుపాటు తీవ్రంగా శ్రమించారు. తొలుత అతడిని లొంగిపోవాలని ఆదేశించినా వినకపోవడంతో సోదరుడితో ఫోన్ చేయించి తలుపు కిందంగా ఫోన్ అందించి మాట్లాడించే ప్రయత్నం చేశారు. సైఫుల్లా సోదరుడు ఖలీద్ ఫోన్‌లో ఏడుస్తూ బతిమాలిడినప్పటికీ అతడి మనసు కరగలేదు. దీంతో పోలీసులు తొలుత టియర్‌గ్యాస్, చిల్లీ పౌడర్ మిక్స్‌డ్ బాంబులు తదితరమైన ప్రయోగాలు చేశారు. దీంతో చివరకు పోలీసుల కాల్పుల్లో అతడు మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు కూడా నిరాకరించారు. అతడు ఎంతటి దుర్మార్గపు పనులో చేశాడు తమకు నిన్న సాయంత్రమే తెలిసిందని, తాము చెప్పిన మాట వినకుండా దుశ్చర్యలకు పాల్పడిన అతడి మృతదేహం తమకు వద్దని చెప్పారు.
అతడి వద్ద పెద్ద మొత్తంలో బాంబులు, రైలు రాకపోకల వివరాలకు సంబంధించిన టైమ్ టేబుల్ స్వాధీనం అయింది. దీని ప్రకారం పెద్ద మొత్తంలో రైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. లక్నోలో ఇద్దరు ఉగ్రవాదులు ఒక చోట నక్కి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) బృందం రంగంలోకి దిగి ఎదురు కాల్పులకుదిగింది. అంతకుముందు వారిని ప్రాణాలతో పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసి చివరకు తుదముట్టించింది.