అతని మృతదేహాన్ని తండ్రి తీసుకోలేదు
న్యూఢిల్లీ: భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలు పేలుడు ఘటనలో నిందితుడు మహ్మద్ సైఫురుల్లా మృతదేహాన్ని తీసుకునేందుకు అతని తండ్రి నిరాకరించారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. గురువారం ప్రారంభమైన పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాల్లో రాజ్‌నాథ్.. లక్నో ఎన్‌కౌంటర్‌పై ప్రకటన చేశారు. గురువారం ఉదయం లక్నో శివారులో భద్రత దళాలు.. సైఫురుల్లాను హతమార్చినట్టు చెప్పారు.
భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడు ఘటనకు కాన్పూర్‌కు చెందిన సైఫుల్లా కారణమని, మధ్యప్రదేశ్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులను అప్రమత్తం చేశారని రాజ్‌నాథ్ చెప్పారు. నిందితుడు సైఫుల్లా లక్నోలోని ఓ ఇంటిలో తలదాచుకున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారని తెలిపారు. పోలీసులు హెచ్చరించినా సైఫుల్లా లొంగిపోలేదని, దీంతో అతడ్ని మట్టుబెట్టారని చెప్పారు. సైఫుల్లా మృతదేహాన్ని తీసుకునేందుకు అతని తండ్రి నిరాకరించాడని తెలిపారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడు పదార్థాలను పేల్చడంతో 10 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.